- ఆర్థికశాఖ చుట్టూ సమస్యలే
- కేంద్రమిచ్చే సాయంపైనే ఆశలన్నీ
- కొత్త అనధికార పన్నులపైనా ఆలోచన
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : కొత్త ఆర్థిక సంవత్సరం కూడా కష్టాల్లోనే ప్రారంభమైంది. 2022-23 సంవత్సరం అంతా సమస్యల్లోనే కొనసాగగా, 2023-24 ఆర్థిక సంవత్సరం కూడా అదే తరహాలో ప్రారంభమైనట్లు ఆర్థికశాఖ అధికారులే చెబుతున్నారు. గతేడాది మొత్తం ఆదాయం కన్నా వ్యయం గణనీయంగా పెరిగిపోవడంతో ప్రతిరోజూ రుణాలు, వేస్ అరడ్ మీన్స్, ఓవర్‌డ్రాఫ్ట్‌లతోనే కాలం నెట్టుకురావాల్సి వచ్చింది. ఈ ఏడాది తొలి నాలుగు రోజుల్లోనే రూ.3 వేల కోట్ల రుణంగా ప్రారంభమవుతుండడం గమనార్హం. కొత్త ఆర్థిక సంవత్సరం కూడా అదే బాటలో పయనిస్తోంది. ఇప్పటికే భారీగా వ్యయం కళ్లముందుండగా, ముగిసిన ఏడాదికి సంబంధించిన బిల్లులు, ఇతర బకాయిలు కొత్త సంవత్సరంలోకి బదలాయించారు. ఇవి కూడా భారంగా మారే పరిస్థితి కనిపిస్తోంది. వార్షిక బడ్జెట్‌ను రూ.2,79,279 కోట్లతో ఆమోదించినప్పటికీ, దానిని చివరకు రూ.2.93 కోట్లకు సవరించారు. అందులో కూడా పాత బకాయిలకు సంబంధించి నిధులు కేటాయించలేదు. అంటే ఈ భారాన్ని పలు శాఖలకు సంబంధించిన కేటాయింపుల నుంచే చెల్లించాల్సి ఉంటుంది. ఇది ఆయా శాఖల వ్యవహారాలపై వ్యతిరేక ప్రభావం చూపించనుంది. ముగిసిన ఏడాది పొడవునా ఉద్యోగుల జీతాలు, పింఛన్లపై ఆందోళనలు కొనసాగాయి. ఏ ఒక్క నెల్లోనూ ఒకటో తేదీన జీతాలు ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఇక శనివారం నుంచి ప్రారంభమైన కొత్త ఆర్థిక సంవత్సరంలోనే ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉండడంతో ఉద్యోగులు, ఉపాధ్యాయుల ఆగ్రహాన్ని తగ్గించాలంటే టంఛనుగా జీతాలు చెల్లించాల్సి ఉంటుంది. అందుకు తగిన నిధులను కూడా ముందుగానే సమకూర్చుకోవాల్సి ఉంది. వీటికి తోడు సామాజిక పింఛన్లు, నవరత్నాల్లో భాగంగా అందించాల్సిన నగదు బదిలీకి కూడా ఒకేసారి నిధులు సమకూర్చుకోవడం కొంత కష్టమేనని వారంటున్నారు. ముగిసిన ఆర్థిక సంవత్సరంలో రూ.2,56,256 కోట్లతో బడ్జెట్‌ను ఆమోదించి నప్పటికీ చివరకు 2.40 లక్షల కోట్లు మాత్రమే వ్యయం అయినట్లు సవరణ బడ్జెట్‌లో చూపించారు. రూ.16 వేల కోట్లు లోటుగా ఉన్నట్లు తేలింది. ఈ మేరకు జరగాల్సిన పనులు, చెల్లింపుల భారం కూడా కొత్త ఆర్థిక సంవత్సరంపైనే ఉంటుందని అధికారులు అంటున్నారు. ఇందుకు తగ్గ రాబడి లేకపోవడంతో 2022-23లో ప్రతి నెలా అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఓవర ్‌డ్రాఫ్ట్ కూడా భారంగానే మారుతూ, రిజర్వ్‌బ్యాంకు నుంచి హెచ్చరిక లేఖలు కూడా వచ్చాయి. ఇదే పరిస్థితి 2023-24లో కూడా తప్పదని ఆర్థికశాఖ అధికారి ఒకరు వ్యాఖ్యానించడం గమనార్హం.
కేంద్రంపైనే ఆశలన్నీ..
కేంద్రం నిధులు కూడా ఆశించిన స్థాయిలో రాకపోవడం రాష్ట్రానికి శరాఘాతంగా పరిణమించింది. కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా నిధులు 4 శాతం వరకు రావాల్సి ఉన్నప్పటికీ, అందులో కూడా కొంత కోతలు పడినట్లు తెలిసింది. పోలవరం, వెనుకబడిన జిల్లాలకు నిధులు, రాజధాని నిర్మాణం, ఇతర కేంద్ర ప్రాయోజిత పథకాలకు కూడా నిధుల కోతలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. కొత్త ఏడాదైనా కేంద్రం సరైన నిధులు ఇవ్వగలిగితే ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కవచ్చని, లేదంటే మళ్లీ రుణాలపై ఆధారపడక తప్పదని ఆర్థికశాఖ అధికారులు అంటున్నారు. ఇదే సమయంలో ఆదాయాన్ని పెంచుకునేందుకు గానూ ప్రస్తుతం ఉన్న పన్నుల్లో మార్పులు చేసే అవకాశాలు ఉంటాయని తెలుస్తోంది. వీటితోపాటు సెస్‌ల పెంపు, మద్యంపై వచ్చే ఆదాయాన్ని పెంచుకునే ఆలోచన కూడా చేస్తున్నట్లు తెలిసింది. మొండి బకాయిల వసూళ్లపైనా కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుందని అధికారులు అంటున్నారు.










