
ప్రపంచంలో రెండవ పెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశం చైనా. కొనుగోలు శక్తి (పిపిపి) పద్ధతిలో లెక్కించినపుడు జిడిపిలో అది తొలి స్థానంలో ఉంది. సాంప్రదాయ లెక్కింపులో త్వరలో అమెరికాను అధిగమించి అగ్రస్థానానికి చేరనుందని అందరూ చెబుతున్నదే. దీని అర్ధం అమెరికా లేదా ఐరోపా ధనిక దేశాల స్థాయికి చేరిందని కాదు. ఇటీవలి కాలంలో తలెత్తిన సమస్యల పూర్వరంగంలో చైనా ద్రవ్య లేదా విత్త రంగాన్ని మరింతగా క్రమబద్దీకరించే పెను మార్పులను ప్రకటించారన్నది తాజా వార్త. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లో దానికి తుదిరూపం ఇస్తారు. మారుతున్న పరిస్థితులు, అవసరాలకు అనుగుణంగా మారకపోతే అదే పెద్ద ఆటంకంగా మారుతుంది. చైనాలో ఏం జరిగినా అది కొంత మందికి వింతగానూ మరి కొందరికి ప్రతికూలంగా కనిపిస్తుంది. అనేక దేశాల్లో ముందుగానే టాంటాం వేస్తే ఒక విధానంపై చైనాలో అంతర్గతంగా చర్చ జరిపి సిద్ధంకాగానే ప్రకటన, అమలు చేస్తారు. ఏ పద్ధతిలో చేశారు అనేదానికంటే ప్రకటించిన విధానం ఎలాంటి ఫలితాలను ఇచ్చిందన్నదాన్ని గీటురాయిగా తీసుకోవాలి. మన దేశ మార్కెట్‌ను స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి విదేశాలకు తెరిచాము. కానీ చైనా 1978లో ఆ పని చేసింది. రెండు దేశాలూ సాధించిన వృద్ధిని చూస్తే నక్కకూ నాగలోకానికి ఉన్నంత తేడా కనిపిస్తుంది.
తమ దేశ లక్షణాలతో సోషలిస్టు వ్యవస్థ నిర్మాణం జరుపుతున్నట్లు చైనా కమ్యూనిస్టు పార్టీ ప్రకటించింది. దాన్లో భాగంగానే గత నాలుగున్నర దశాబ్దాల్లో వచ్చిన అనుభవాలు, తలెత్తిన ప్రతికూల సమస్యలు, తాజాగా అమెరికా, ఇతర ధనిక దేశాల నుంచి ఎదురవుతున్న కొత్త సవాళ్ల నేపథ్యంలో విత్త రంగ నియంత్రణలో పెను మార్పులను తలపెట్టింది. బ్యాంకింగ్, బీమా రంగాల్లో ఉన్న సంపద విలువ 400 లక్షల కోట్ల ఇవాన్‌లు లేదా 57.7 లక్షల కోట్ల డాలర్లు. ఇటీవలి కాలంలో కొన్ని చోట్ల పేలినట్లు చెబుతున్న నిర్మాణ రంగ బుడగలు, దివాలా తీసిన బ్యాంకులు, వీధుల్లోకి వచ్చిన జనం, జాక్ మా వంటి వారు చిన్న కంపెనీలను మింగివేసేందుకు చూడగా అదుపు చేసిన తీరు, కంపెనీల్లో మదుపుదార్లకు రక్షణ వంటి అనేక అంశాలు ఒక సమగ్రమైన నియంత్రణ వ్యవస్థను తీసుకురావాల్సి అవసరాన్ని ముందుకు తెచ్చాయి. అంతేకాదు బిఆర్‌ఐ పేరుతో వివిధ దేశాల్లో పెడుతున్న పెట్టుబడులు, ఇస్తున్న రుణాల గురించి పెద్ద ఎత్తున చైనా వ్యతిరేకులు చేస్తున్న తప్పుడు ప్రచారం గురించి తెలిసిందే. ఏక గవాక్షం ద్వారా ఇలాంటి వాటిని నడిపించటం, జవాబుదారీతనాన్ని పెంచటం కూడా తాజా మార్పుల వెనుక ఉంది.
దీని అర్ధం అక్కడేదో అదానీ కంపెనీల వంటి భారీ కుంభకోణాలో, ఆర్థిక రంగాన్ని కుదేలు చేసే పరిణామాలో జరిగినట్లు కాదు. మన దేశం ప్రతి రాష్ట్రానికి ఒక రిజర్వుబ్యాంకు శాఖ ఉంటే చైనా రిజర్వుబాంకు శాఖలు కేవలం పదకొండు మాత్రమే. మన జిడిపి మూడున్నర లక్షల కోట్ల డాలర్లు కాగా పదిహేడున్నర లక్షల కోట్ల డాలర్లతో చైనా ఉంది. అందువలన చైనా రిజర్వుబాంకు విస్తరణ కూడా తాజాగా తలపెట్టిన మార్పుల్లో ఒకటి. వివిధ రంగాలకు ఉన్న నియంత్రణ వ్యవస్థలు ఒకదానికి మీదకు ఒకటి రావటం వంటి లోపాలను అవకాశంగా తీసుకొని అక్రమాలకు పాల్పడిన వారిని అనేక మందిని శిక్షించారు. పెద్ద సంఖ్యలో ఉన్న విదేశీ సంస్థలు వాటి ఆర్థిక, ద్రవ్య సంబంధ లావాదేవీలు, వాటి సంపద కూడా తక్కువేమీ కాదు. వాటన్నింటిని మరింతగా నియంత్రించాల్సిన అవసరం ఉంది. ఈ చర్యల ద్వారా చైనా కమ్యూనిస్టు పార్టీ, తద్వారా అధినేత సీ జిన్‌పింగ్ నియంత్రణ, అధికారం మరింతగా విస్తరించుకొనేందుకే అని విదేశాల్లో కొందరు చిత్రించటంలో అర్ధం లేదు. తమ అక్రమాలకు దారులు బంద్ అవుతున్నాయనే ఏడుపు తప్ప మరొకటి కాదు. మన దేశంలో హర్షద్ మెహతా, కేతన్ పరేఖ్ వంటి స్టాక్‌బ్రోకర్లు కంపెనీలతో కుమ్మక్కై వాటాలకు లేని విలువలను సృష్టించి మదుపుదార్లను నిలువునా ముంచిన సంగతి తెలిసిందే. సత్యం పేరుతో కంపెనీ తెరిచి అసత్యాలతో కొంపలు ముంచిన ఘనుల గురించి చెప్పనవసరం లేదు. ఇప్పుడు అదానీ కంపెనీల కథ కూడా అదే అన్న ఆరోపణ వస్తే వ్యవస్థ సంస్కరణ సంగతి తరువాత అసలు నిజాల నిగ్గుదేల్చే విచారణకే నరేంద్ర మోడీ సిద్ధం కాలేదు. ఇప్పుడు చైనాలో తలపెట్టిన మార్పుల్లో స్టాక్ మార్కెట్ నియంత్రణ కూడా కేంద్ర మంత్రివర్గ పరిధిలోకి రానుంది.
చైనా పార్లమెంటు ప్రస్తుతం చర్చిస్తున్న మరో ప్రధాన అంశం ఆర్థిక, విత్త రంగాల డిజిటలైజేషన్ వంటి కృత్రిమ మేధ పద్ధతుల ద్వారా జనానికి, ఇతర దేశాలకు సులభంగా సేవలను అందించటం. అమెరికా, ఐరోపా దేశాలతో పోటీ పడేట్లు తీర్చిదిద్దటం. అలాంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని చైనాకు అందకుండా కట్టడి చేసేందుకు ఆ రంగంలో ముందున్న దేశాలను కూడగట్టుకొని అమెరికా సాంకేతిక పోరును ప్రారంభించింది. దాన్ని అధిగమించకపోతే చైనా పురోగమనానికి తాత్కాలికంగానైనా కొన్ని ఆటంకాలు తలెత్తుతాయి. అందుకే యుద్ధ ప్రాతిపదికన అవసరమైన శాస్త్ర, పరిశోధన అభివృద్ధి రంగాలను నడిపించాలని చైనా నిర్ణయించింది. కొత్తగా ఏర్పాటు చేస్తున్న జాతీయ విత్త క్రమబద్దీకరణ కమిషన్ (ఎన్‌ఎఫ్‌ఆర్‌సి)లో ఇది కూడా భాగంగానే ఉండనుంది. సీ జిన్‌పింగ్ 2013లో అధికారానికి వచ్చిన తరువాత మూడు అంశాల పునర్వ్యస్థీకరణల మీద కేంద్రీకరించారు. ఒకటి ద్రవ్య స్థిరత్వము-అభివృద్ధి కమిషన్, రెండవది వృద్ధుల వ్యవహారాల మంత్రిత్వశాఖ, మూడవది తాజా అంశం. అనేక ఐరోపా దేశాలు వందల సంవత్సరాల పాటు అభివృద్ధి చెందిన తరువాత జనాభా పెరుగుదల తగ్గి, వృద్ధుల సంఖ్య పెరగటాన్ని చూశాము. ఇప్పుడు చైనా ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగా ఉండగానే ఆ సమస్యలను ఎదుర్కొంటున్నది. సోషలిస్టు వ్యవస్థలో మానవాభివృద్ధి, దానిలో భాగంగా జీవితకాలం పెరగటం దీనికి ఒక కారణంగా చెప్పవచ్చు. అందువలన చైనా సమాజం ఈ సవాళ్లను కూడా అధిగమించే సత్తా, ముందు చూపు కలిగి ఉందని చెప్పవచ్చు.
- ఫీచర్స్ అండ్ పాలిటిక్స్