
విశాఖపట్నం అంటే ఆర్కె బీచ్ అనో, కైలాసగిరనో కాదు. అలాగే పెద్ద పెద్ద హోటళ్లు, షాపింగ్ మాల్స్, స్టార్ హాస్పిటళ్లు, హైమాక్స్ థియేటర్లు, 30 అంతస్తుల భవనాలో కాదు. నేడు పాలకులు అభివృద్ధికి వీటినే కొలమానాలుగా చూపిస్తున్నారు. అంతేకాదు. విశాఖపట్నాన్ని నేనంటే నేను అభివృద్ధి చేశానంటూ గతంలో కాంగ్రెస్, నేడు బిజెపి, టిడిపి, వైసిపి తెగ పోటీపడి ప్రచారం చేస్తున్నాయి. వాస్తవం ఏమిటి?
మహా విశాఖపట్నం దేశాభివృద్ధికి ఒక రోల్ మోడల్‌గా స్వాతంత్య్రానంతరం ఆవిర్భవించింది. ప్రభుత్వ పెట్టుబడితో అనేక ప్రభుత్వ రంగ సంస్థలు, వ్యవస్థలు, సర్వీసులు, శాఖలు, సామాజిక మౌలిక సదుపాయాలు నెలకొల్పబడ్డాయి. వీటి ఆధారంగా ప్రైవేట్ రంగంలో పరిశ్రమలు, వ్యాపార, వాణిజ్య సంస్థలు వంటివి ఏర్పడ్డాయి. స్థూలంగా చెప్పాలంటే మొత్తం విశాఖ ఆర్థికాభివృద్ధి కి, ప్రజలకు ఆయువు పట్టు గాను ఉత్తరాంధ్రకు జీవగర్రగా ఇవి వెలుగొందుతున్నాయి. నేడు ప్రైవేటీకరణ విధానాలతో ఈ సంస్థలపై దాడి తీవ్రమైంది. హిందూస్థాన్ జింక్‌ను వేదాంతానికి అమ్మేసి మూసేశారు. డిసిఐని నాలుగు ముక్కలు చేసి పోర్టుల్లో కలిపి ఉన్న పోర్టును దశల వారీగా అమ్మేస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ని అమ్మకానికి పెట్టారు. అదేమంటే స్టీల్ ప్లాంట్‌ని అమ్మేస్తే మీకెేంటి నష్టం? ప్రైవేటీకరణ ద్వారానే అభివృద్ధి జరుగుతుందని కేంద్ర మంత్రులు ఎదురు దాడికి దిగుతున్నారు. ఎట్లాగైనా ప్రభుత్వ సంస్థలన్నింటిని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టటానికి తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. ఇవే జరిగితే విశాఖ నగరం జవసత్వాలు నిర్వీర్యం అవుతాయి. 75 ఏళ్ల నుండి ప్రభుత్వ పెట్టుబడితో జరుగుతున్న క్రమ అభివృద్ధి కాస్తా ధ్వంసమౌతున్నది.
ప్రభుత్వ పెట్టుబడితో మహానగరంగా మారిన తీరు
కళింగ సామ్రాజ్యం కింద ఒక చిన్న మత్స్య గ్రామంగా విశాఖపట్నం ప్రారంభమైంది. తూర్పు సముద్ర తీరంలో ఉండటంతో బ్రిటీష్ వారికి చాలా ముఖ్యమైన ప్రాంతంగా దీనిని మలుచుకున్నారు. బ్రిటీష్ కాలంలోనే 1866లో మున్సిపాలిటీగా ప్రకటించబడిరది. 1933లో పోర్టు ప్రారంభమైంది. ఇదేకాలంలో ఈస్ట్ కోస్ట్ రైల్వే లైన్లు విశాఖ మీదుగా ప్రారంభమయ్యాయి. ఆంధ్రా యూనివర్శిటీ, కింగ్ జార్జ్ ఆసుపత్రి స్థాపించారు. ఇవన్నీ బ్రిటీష్ వలస ప్రభుత్వ పెట్టుబడితో నిర్మాణం జరిగాయి. సింధియా షిప్ యార్డు, కాల్‌టెక్స్ ఆయిల్ కంపెనీ ప్రైవేట్ సంస్థల ఆధ్వర్యంలో నిర్మించబడ్డాయి. 1951 నాటికి లక్ష జనాభాకి విశాఖపట్నం చేరింది.
స్వాతంత్య్రం వచ్చిన తరువాత 1947 నుండి 1990 వరకు ప్రభుత్వ పెట్టుబడితో విశాఖ నగరం విస్తరణతో పాటు అభివృద్ధి చెందింది. రైల్వే, పోర్టు వంటివి స్వాతంత్య్రం అనంతరం ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చాయి. ప్రైవేట్ ఆధీనంలో ఉన్న సింధియా షిప్‌యార్డు, కాల్‌టెక్స్ ఆయిల్ కంపెనీలను ప్రభుత్వం జాతీయం చేసి భారీగా పెట్టుబడులు పెట్టి విస్తరించింది.
తూర్పు రక్షణ నౌకాదళానికి ప్రధాన కేంద్రంగా విశాఖపట్నాన్ని చేశారు. యుద్ధ నౌకల మరమ్మతు యార్డుతో పాటు అనేక డిఫెన్స్ కార్యకలాపాల శాఖలను నెలకొల్పారు. ఆ తరువాత భారత హెవీ ప్లేట్స్ అండ్ వెసల్స్ (బిహెచ్‌పివి), హిందుస్థాన్ జింక్, సింహాద్రి ధర్మల్‌ప్లాంట్ తదితర సంస్థలు ప్రభుత్వ పెట్టుబడులతో నిర్మించారు. మత్స్యకారులకు ఫిషింగ్ హార్బర్ నిర్మించబడిరది. ఈ క్రమంలోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన అనేక పరిపాలనా కార్యాలయాలు వచ్చాయి. ప్రభుత్వ బ్యాంకింగ్ వ్యవస్థ విస్తరించబడింది. ప్రభుత్వ రంగంలో విద్య, వైద్య సదుపాయాలు పెంచబడ్డాయి. సామాజిక, మౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వం పెట్టుబడులు పెంచింది.
ఫలితంగా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు పెరుగుతూ వచ్చాయి. ఉత్తరాంధ్రతో పాటు ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా వలసలు బాగా వచ్చాయి. వీరిలో అత్యధిక మందికి సంఘటిత రంగంలో ఉద్యోగాలు కల్పించబడ్డాయి. ప్రభుత్వ రంగ పరిశ్రమల ఆధారంగా అనేక చిన్న తరహా పారిశ్రామిక కేంద్రాలు ప్రైవేట్ రంగంలో వచ్చాయి. వ్యాపార, వాణిజ్య, సేవా కార్యకలాపాల విస్తరణ జరిగింది.
పెరుగుతున్న పట్టణీకరణను గమనించి రాష్ట్ర ప్రభుత్వం విశాఖ నగరాభివృద్ధి సంస్థ (ఉడా)ను 1978లో ఏర్పాటు చేసింది. అప్పటికే విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు నగరాల్లో పట్టణ భూ కేంద్రీకరణను నిరోధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పట్టణ భూ గరిష్ట పరిమితి చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టం పరిధిలో ఉన్న నగరాల్లో భూమి రేట్లు స్పెక్యులేట్ కాకుండా, కొద్దిమంది ఆధిపత్యం చెలాయించకుండా అందరికి అందుబాటులో ఉంచడం ఈ చట్టం ముఖ్య ఉద్దేశం. ప్రభుత్వ భూముల్లోను, రైతుల నుండి భూములు సేకరించి ఉడా సంస్థ పెద్ద సంఖ్యలో లేఅవుట్లు వేసి అతి తక్కువ ధరలకు స్థలాలు కేటాయించటం ద్వారా నగరంలో అనేక మధ్యతరగతి కాలనీలు ఏర్పడ్డాయి. వీరంతా ప్రభుత్వ సంస్థల్లో పని చేసేవారే. మరోవైపు ప్రభుత్వ రంగ సంస్థలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో పనిచేసే వారంతా సహకార సంఘాలుగా ఏర్పడి భూములు సేకరించుకొని నివాస కాలనీల నిర్మాణం చేసుకున్నారు. ఈ రోజు నగరంలో వున్న ప్రముఖ కాలనీలన్నీ ఉడా లేదా ఉద్యోగుల సహకార రంగం ద్వారానే ఏర్పడినవి. పుట్టగొడుగుల్లా వెలిసిన రియల్ ఎస్టేట్ సంస్థల ద్వారా కాదు. ఇదే సందర్భంగా వలసలుగా వచ్చిన లక్షల మంది పేదలంతా ప్రభుత్వ భూముల్లో, కొండల మీద ఇళ్లు నిర్మించుకున్నారు. నేడు ఇవన్నీ మురికివాడలుగా కొనసాగుతున్నాయి. అసంఘటిత రంగంలో వున్న వీరంతా నేడు విశాఖ ఉత్పత్తి లోనూ, సేవల్లోను కీలక పాత్ర పోషిస్తున్నారు. 80వ దశకంలో స్టీల్‌ప్లాంట్ స్థాపనతో విశాఖపట్నం స్వరూపమే మారిపోయింది. రూ. 5 వేల కోట్ల పెట్టుబడి, 25 వేల మందికి ప్రత్యక్ష ఉపాధితో ప్రస్థానం ప్రారంభించబడిరది. దీంతో ప్లాంట్ చుట్టూ లక్షల ప్రజల బతుకులు అల్లుకున్నాయి. తిరిగి విశాఖ నగరంలో వందల పరిశ్రమలు నెలకొల్పటానికి, వ్యాపార వాణిజ్య, సేవా రంగాల విస్తరణకు దోహదపడటమే కాకుండా దేశంలో విశాఖ ఒక పెద్ద పారిశ్రామిక మహా నగరంగా మారటానికి, ఆర్థిక స్థిరత్వానికి, పట్టణీకరణ స్థాయి పెరగటానికి స్థిరమైన పునాది వేసింది.
అభివృద్ధి అంటే స్టీల్ టౌన్‌షిప్
నగరం అంటే ఎలా ఉండాలి, అందులో ప్రజల జీవన విధానం, మౌలిక సదుపాయాలు ఎలా ఉండాలో విశాఖ స్టీల్ ప్లాంట్ యొక్క టౌన్‌షిప్ ను చూస్తే తెలుస్తుంది. 75 ఏళ్ల స్వతంత్ర భారతావనికి, ప్రజల అభివృద్ధికి ఒక నమూనాగా ఉంటుంది. 3 వేల ఎకరాల్లో, 12 సెక్టార్లలో 30 వేల మందికి నివాస యోగ్యమైనదిగా నిర్మించారు. ప్రతి సెక్టార్‌కి ఒక షాపింగ్ కాంప్లెక్స్, పార్క్ ఉంటుంది. పెద్ద పెద్ద పార్కులు, క్రీడా మైదానాలు, ఇండోర్ స్టేడియమ్‌లు, ఆడిటోరియమ్‌లు, జిమ్ములు, స్విమ్మింగ్ పూల్స్, గ్రంథాలయాలు, ఐదు అతి పెద్ద సామాజిక, సంక్షేమ ఫంక్షన్ హాళ్లు, నిర్వాసిత కాలనీలకు ప్రత్యేక సామాజిక భవనాలు వున్నాయి. 120 పడకల ఆసుపత్రి వుంది. 9 స్కూళ్లున్నాయి, వికలాంగులకు ప్రత్యేక స్కూల్ వుంది. అనేక రాష్ట్రాల వాళ్ళతో విభిన్న సంస్కృతులు, భాషలతో స్టీల్ టౌన్‌షిప్ ఒక మినీ భారత్‌ని తలపిస్తుంది. భూగర్భ విద్యుత్ కేబుల్, భూగర్భ మురుగు నీటి పారుదల వ్యవస్థల గురించి నరేంద్ర మోడీ ఇప్పుడు గొప్పగా ప్రచారం చేస్తున్నారు. 35 ఏళ్ల క్రితమే వీటిని స్టీల్ టౌన్‌షిప్‌లో నిర్మించారు. రెండు 0.5 టిఎంసి సామర్థ్య నీటి రిజర్వాయర్లు వున్నాయి. 24 గంటలు విద్యుత్ వుంటుంది. ప్రతి టన్నుకు ఒక మొక్క చొప్పున 75 లక్షల చెట్లు, మొక్కలతో...సుందరమైన, ఆహ్లాదకరమైన పర్యావరణాన్ని కలిగి ఉంది. స్టీల్‌ప్లాంట్‌కే కాదు ప్రతి ప్రభుత్వ సంస్థకి ఉద్యోగుల కోసం కాలనీలు నిర్మించబడ్డాయి. విశాఖ నగరంలో సుమారుగా నేడు ప్రభుత్వ సంస్థలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, సర్వీసుల కింద 25 వేల క్వార్టర్లు వున్నాయి. దేశంలో ప్రైవేట్ రంగంలో ఇటువంటి వ్యవస్థను మనం చూడలేం.
నగరానికి జీవం ప్రభుత్వ సంస్థలు
నేడు మహా నగరంలో సుమారు లక్ష మందికి పైగా...ప్రభుత్వ రంగ సంస్ధలు, రక్షణ రంగం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్నారు. వీటిల్లో పని చేసి రిటైర్ అయిన వారు మరో 85 వేల మంది ఉన్నారు. విశాఖ అభివృద్ధి అంతా వీరి వినియోగం పైనే ఆధారపడి సాగుతున్నది. ఒక్క స్టీల్‌ప్లాంట్ ఉద్యోగుల వేతనాల నుండి నెలకు మార్కెట్ లోకి సుమారు రూ. 300 కోట్లు వినిమయం లోకి వస్తున్నది. మొత్తం ఈ రంగాల్లో పని చేసే ఉద్యోగుల నుండి చూస్తే సుమారు నెలకు రూ.1200 కోట్లు పైబడి మార్కెట్లో వినిమయం జరుగుతున్నది. వ్యాపార, వాణిజ్య రంగాలు, షాపింగ్ మాల్స్, రియల్ ఎస్టేట్, భవన నిర్మాణం, విద్య, వైద్యం, రవాణా, కమ్యూనికేషన్ వంటి అనేక ప్రైవేటు సంస్ధలకు ప్రాణవాయువుగా వీరి వేతనాలు పనిచేస్తున్నాయి. ప్రైవేట్ సంస్ధల వ్యాపారం పుష్కలంగా ఉండటంతో లక్షల మందికి వీటిల్లో ఉపాధి కల్పించబడింది. ఈ విధంగా విశాఖ నగరం ఒక మహా నగరంగా 20 లక్షల మందితో దేశంలో నేడు 17వ స్థానంలో ఉంది.
కనుక ప్రభుత్వ రంగ సంస్థలంటే కార్మికులనే పరిమితమైన భావన సరికాదు. ప్రభుత్వ రంగ సంస్థలంటే ప్రజల జీవన విధానం. ప్రజలకు ఆదాయాన్ని పున:పంపిణీ చేసే వాహకాలు. ఆర్థిక పరిపుష్టి కలిగిన ఉన్నతమైన జీవితాన్ని అందించే సాధనాలు. దేశ ఆర్థిక వ్యవస్ధకు వెన్నెముకగా ఉన్నాయి. నేడు దేశంలో ఉన్న ఢిల్లీ, ముంబాయి, కోల్‌కతా, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి నగరాలు మహా నగరాలుగా మారటానికి ప్రభుత్వ పెట్టుబడే మూలకారణం.
ఈ ఆర్థిక పరిణామ క్రమాన్ని బిజెపి ధ్వంసం చేస్తున్నది. ఈ వ్యవస్ధలను, రంగాలను, సంస్ధలను బడా కార్పొరేట్ల పరం చేస్తున్నది. అందులో భాగంగానే విశాఖ నగరం లోని ప్రభుత్వ రంగ సంస్థలపై దాడి సాగిస్తున్నది. విశాఖ స్టీల్ ప్లాంట్‌ని అమ్మకానికి పెట్టింది. నగరం యొక్క ఆయువు పట్టును ధ్వంసం చేస్తున్నది. శ్రమ దోపిడీకి కేంద్రంగా మారుస్తున్నది. నగరాన్ని ప్రజల కోసం కాక ప్రైవేట్ పెట్టుబడుల లాభాల కోసం మారుస్తున్నారు. దీనివల్ల ఆర్థిక అసమానతలు తీవ్రతరమౌతాయి. ప్రజల జీవితాలు చిధ్రమౌతాయి. ఈ విధ్వంసకర విధానం మహా విశాఖ నగరానికే కాదు యావత్ దేశ ఆర్థిక వ్యవస్ధకే పెనుముప్పు కలిగిస్తున్నది.
వ్యాసకర్త డా|| బి. గంగారావు
సెల్ : 9490098792