- ధరలు భరించలేక తగ్గిస్తున్న వినియోగం
- కాంప్లెక్స్, పొటాష్‌లకు దూరం
- యూరియా, డిఎపి వైపు మొగ్గు
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి : నానాటికీ పెరుగుతున్న ఎరువుల ధరలను భరించలేక రైతులు అనివార్యంగా ఎరువుల వినియోగాన్ని అంతకంతకూ తగ్గించుకుంటున్న ధోరణి రాష్ట్రంలో క్రమేపి స్థిరపడుతోంది. ఇదే సమయంల కాస్త తక్కువ రేట్లపై లభించే యూరియా, డిఎపి వంటి ఎరువుల వైపు రైతాంగం మొగ్గు చూపుతున్న పరిస్థితి కనిపిస్తోంది. దాదాపు మూడేళ్లుగా ఒక వైపు కోవిడ్ విలయం సాగుదారులను అతలాకుతలం చేయగా, ఇదే సమయంలో కేంద్రం ఎరువుల సబ్సిడీలకు కోతలు పెట్టింది. అంతర్జాతీయంగా ముడి సరుకుల ధరలు పెరుగుతున్నాయంటూ రాయితీలను తగ్గించడంతో పాటు డైరెక్టు బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (డిబిటి) విధానాన్ని మరింత పకడ్బందీగా అమలు చేస్తోంది. పోషకాధారిత సబ్సిడీ (ఎన్‌బిఎస్) పాలసీతో యూరియా మినహా తతిమ్మా ఎరువుల ధరలపై ప్రభుత్వ నియంత్రణ లేకపోవడంతో ఎరువుల కంపెనీలు ఇష్టానుసారం కాంప్లెక్స్‌్, పొటాష్ ఎరువుల ధరలను పెంచుకుంటూ పోతున్నాయి. ఎరువుల ధరలు కంపెనీ కంపెనీకీ, రోజుకో తీరుగా మారిపోతున్నాయి.
తక్కువ ధర ఫెర్టిలైజర్ వైపు
కేంద్రం ఎన్‌బిఎస్ పాలసీలో నైట్రోజన్ (ఎన్)కు మాత్రమే సబ్సిడీ ఇచ్చి ధరలను నిర్ణయిస్తోంది. ఫాస్పరస్ (పి), పొటాష్ (కె) ఎరువులకు ఎప్పటికప్పుడు పోషక ఆధారంగా నిష్పత్తి ప్రాతిపదికన కిలోల వంతున సబ్సిడీ నిర్ణయిస్తోంది. పెరిగిన ముడి సరుకులకు తగ్గట్టు సబ్సిడీ నిర్ణయించకుండా ఎంతో కొంత నిర్ణయించి చేతులు దులుపుకుంటోంది. దాంతో కాంప్లెక్స్, పొటాష్ ఎరువుల ధరలు ఈ కాలంలో విపరీతంగా పెరిగాయి. గత ఖరీఫ్‌కు ఈ ఏడాది ఖరీఫ్‌కు పెరుగుదల ఎరువులను బట్టి 30 శాతం నుంచి 94 శాతం వరకు ఉంది. ఎంఒపి బస్తా రూ.875 నుంచి 1,700 అయింది. 20-20-0 రేటు రూ.975 నుంచి 1,470 అయింది. 28-28-0 ధర రూ.1,275 నుంచి 1,700 అయింది. 14-35-14 రేటు రూ.1,275 ఉన్నది కాస్తా 1,700 అయింది. ఫలితంగా ఈ ఎరువుల వినియోగాన్ని రైతులు తగ్గించుకున్నట్లు విక్రయాల గణాంకాలు తెలుపుతున్నాయి. ఎపిలో కాంప్లెక్స్ ఎరువుల సేల్స్ ముందటేడు 7 లక్షల టన్నులు కాగా నిరుడు 5.74 లక్షల టన్నులు. ఈ ఖరీఫ్‌లో 5.48 లక్షల టన్నులకు ఇంకా తగ్గాయి. ఎంఒపి సేల్స్ ముందటేడు 1.25 లక్షల టన్నులు, నిరుడు 1.01 లక్షల టన్నులు, ఈ సంవత్సరం 50 వేల టన్నులు. ఎస్‌ఎస్‌పి అమ్మకాలు ముందటేడు 95 వేల టన్నులు, నిరుడు 98 వేల టన్నులు కాగా ఈ తడవ 86 వేల టన్నులు. ఇదిలా ఉండగా, కేంద్రం సబ్సిడీ ఇచ్చి ధరలు నిర్ణయించే యూరియా బస్తా రూ.268 కే లభిస్తుండటంతో యూరియా సేల్స్ ముందటేడు కంటే తగ్గినా నిరుటి కంటే ఈ ఏట స్వల్పంగా పెరిగాయి. డిఎపి బస్తాపై సబ్సిడీ పోను నిరుడు రూ.1,200 కి లభించింది. ఈ తడవ రూ.1,350 అయింది. కాంప్లెక్స్ ధరలతో పోల్చితే డిఎపి రేటు తక్కువ కావడంతో ఆ ఎరువు అమ్మకాలు పెరిగాయి.
ఇవి కూడా...
ఎరువుల వినియోగం తగ్గడానికి సాగు విస్తీర్ణం తగ్గడం ఒక ముఖ్య కారణంగా చెబుతున్నా మూడేళ్లలో పెద్దగా తేడా ఏమీ లేదు. 2020 ఖరీఫ్‌లో 91 లక్షల ఎకరాలు, 2021 ఖరీఫ్‌లో 88 లక్షల ఎకరాలు, 2022 ఖరీఫ్‌లో 87 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. కానీ ఎరువుల వినియోగం సాగు విస్తీర్ణంతో సంబంధం లేకుండా బాగా తగ్గాయి. ముందటేడు అన్ని రసాయన ఎరువులూ కలుపుకొని 18.80 లక్షల టన్నులు, నిరుడు 15.57 లక్షల టన్నులు, ఈ మారు 15.53 లక్షల టన్నులకు విక్రయాలు పడిపోయాయి. రైతులు కోరుకున్న ఎరువులు అదనుకు దొరకపోవడం, సరఫరాలో ఇబ్బందులు, కృత్రిమ కొరత కూడా ఎరువుల వినియోగం తగ్గుదలకు కొంత వరకు కారణమని చెబుతున్నారు.











