Jul 18,2022 16:28

లక్నో : సాధారణంగా ఎవరైనా బైక్‌పై వెళ్తే హెల్మెట్‌ ధరిస్తారు. మరి ఎవరైనా హెల్మెట్‌ పెట్టుకుని బస్‌ డ్రైవ్‌ చేస్తారా? మీరెక్కడైనా చూశారా? అయితే అందరూ అవాక్కయ్యేలా ఓ బస్‌ డ్రైవర్‌ హెల్మెట్‌ పెట్టుకుని డ్రైవ్‌ చేశాడు. అసలు అతనెందుకు హెల్మెట్‌ పెట్టుకుని డ్రైవ్‌ చేశాడో గల కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని గాజియాబాద్‌లో జరిగింది. ప్రస్తుతం ఈ బస్‌ డ్రైవర్‌ ఫొటోలు నెట్టింట్లో వైరల్‌ అవుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని లోని బస్‌ డిపోకు చెందిన బస్సు డ్రైవర్‌.. అతను నడుపుతున్న బస్సు రోడ్డు ప్రమాదానికి గురై ఎదురుగా ఉన్న అద్దాలు పగిలిపోయాయి. ప్రమాదానికి గురైన ఆ బస్సుని ఆ డ్రైవర్‌ అలాగే డిపోకు చేర్చాడు. డ్రైవ్‌ చేసేటప్పుడు తనకెలాంటి గాయాలు కాకుండా.. వర్షం, గాలి నుంచి రక్షణ కోసం ముందు జాగ్రత్త చర్యగా హెల్మెట్‌ ధరంచాడట. తాను అలా హెల్మెట్‌ పెట్టుకుని బస్‌ డ్రైవ్‌ చేస్తుంటే ఓ వ్యక్తి ఆ బస్సును వెంబడించి మరీ వీడియో తీశాడు. ఆ దృశ్యాలే ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.
కాగా, ఈ సంఘటన ఆదివారం సాయంత్రం బాగ్‌పత్‌ సరిహద్దులో జరిగింది. ఆ బస్సును మరో బస్సు ఢకొీట్టడం వల్ల ఆ బస్సు అద్దాలు పగిలిపోయాయని అధికారులు వెల్లడించారు.