Jul 29,2023 13:54
  • ప్రజా పంపిణీ వ్యవస్థ సమర్థవంతంగా పారదర్శకంగా పనిచేయాలి....
  • 1302.58 క్విన్టాళ్ల రేషన్‌ బియ్యం స్వాధీనం..
  • ప్రజా పంపిణీ వ్యవస్థ పై నిరంతరం నిఘా..
  • అక్రమాలకు అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు...

ప్రజాశక్తి - పల్నాడు జిల్లా : పల్నాడు జిల్లాలో ప్రజా పంపిణీ వ్యవస్థ సమర్థవంతంగానూ పారదర్శకంగాను పంపిణీ చేసేందుకు నిరంతరం కఅషి చేస్తున్నట్లు పల్నాడు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఏ శ్యాం ప్రసాద్‌ అన్నారు. ఈ మేరకు శనివారం కలెక్టరేట్‌ లో మాట్లాడుతూ ... పల్నాడు జిల్లాలో 10 మండల స్థాయి నిల్వ కేంద్రాలు ఏర్పాటు చేసి 1290 చౌక దుకాణాలకు సరుకులు సరఫరా చేస్తున్నామన్నారు. దుకాణాలకు చేరిన సరుకులను 402 ఎండియూ ఆపరేటర్ల ద్వారా వీధి వీధికి తిరుగుతూ పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఎండియు వాహనాలు సక్రమంగా తమ పరిధిలో పంపిణీ చేసేలా లాటిట్యూడ్‌, లాంగ్ట్యూడ్‌ నిర్దారించి రూట్‌ ప్లాన్‌ అమలు చేయడం జరుగుతుందన్నారు. ఏండియు ల పంపిణీ సమయంలో గ్రామ రెవెన్యూ అధికారులు, క్లస్టర్లలో పంపిణీ జరిగే సమయంలో వాలంటీర్లు కూడా దగ్గరుండి పంపిణీ జరిపిస్తున్నారన్నారన్నారు. ఎన్ఫోర్స్మెంట్‌ డిప్యూటీ తహశీల్దార్‌ లు రోజుకి 3 చౌక దుకాణాల చొప్పున తనిఖీలు చేస్తున్నారన్నారు. నెలలో మొత్తం పరిధిలో ఉన్న అన్ని షాపులు తనిఖీ జరుగుతున్నాయన్నారు.

జిల్లాలో జాతీయ ఆహార భద్రత చట్టం, రాష్ట్ర రేషన్‌ కార్డుల కింద నెలకు 9096.365 టన్నుల బియ్యం పంపిణీ చేయడం జరుగుతుందని జాయింట్‌ కలెక్టర్‌ తెలిపారు. కిలో బియ్యంపై రూ.39.35 పైసలు చొప్పున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చు చేస్తున్నాయన్నారు. జిల్లాలో మధ్యస్థ సన్నరకం బియ్యాన్ని సార్టెక్స్‌ చేసి పొర్టీపైడ్‌ బియ్యంగా మార్చి కార్డుదారులకు అందజేస్తున్నామన్నారు. పొర్టీపైడ్‌ బియ్యంలో విటమిన్‌ డి12, పోలిక్‌ యాసిడ్‌, ఐరన్‌ తో జతపరచి ఉంటాయన్నారు. భారతదేశంలో మహిళలు, పిల్లలకు పోషకాహార లోపం చాలా ఎక్కువగా ఉండటంతో రక్త హీనతను అధిగమించేందుకు పొర్టీపైడ్‌ బియ్యం ఉపయోగపడతాయన్నారు. రక్తహీనతపై పోరాటం, రక్తం ఏర్పడటానికి, నాడీ వ్యవస్థ పనితీరు మెరుగుపరుస్తుందన్నారు.

పొర్టీపైడ్‌ బియ్యం వండటం కూడా సులభమని వండేందుకు ప్రత్యేక వంట విధానం ఏమీ అవసరం లేదని జాయింట్‌ కలెక్టర్‌ తెలిపారు. బియ్యం శుభ్రపరచడం, కడగటం సాధారణ బియ్యం మాదిరిగానే చేయాలన్నారు. బియ్యాన్ని కడిగిన తరువాత నానబెట్టిన అదే నీటిని వంట కోసం ఉపయోగించాలని గంజి తీయకుండా ఉడికించాలన్నారు. అత్యుత్తమ పోషకాలతో కూడిన బియ్యాన్ని అన్ని వయసులవారు తీసుకొని మెరుగైన ఆరోగ్యం పొందాలన్నారు. బియ్యం పంచదారతోపాటుగా పట్టణ ప్రాంతాల్లో బలవర్ధకమైన నాణ్యమైన గోధుమపిండి ప్యాకెట్‌ కార్డు ఒక్కొక్కరికి రూ.16 చొప్పున అందజేస్తున్నామన్నారు. 58.096 కార్డుదారులకు గోధుమ పిండి సరఫరా చేశామన్నారు. రేషన్‌ సరఫరాపై నిరంతర నిఘా ఉంటుందన్నారు. గత 6 నెలల కాలంలో పిడిఎఫ్‌ బియ్యం అక్రమ రవాణా చేస్తున్నవారిపై చౌక దుకాణాలపై 72 కేసులు నమోదు చేసి వారిపై 6ఏ కేసులు నమోదు చేశామన్నారు. రైస్‌ బిల్లులపై దాడులు నిర్వహించి 2 కేసులు నమోదు చేశామని 1302.58 కింటాలు స్వాధీనం చేసుకున్నామని జాయింట్‌ కలెక్టర్‌ వివరించారు.