- ఈ ఏడాది రైతులకు తప్పని తిప్పలు
ప్రజాశక్తి- శ్రీకాకుళం ప్రతినిధి : ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ప్రభుత్వం చేసిన ప్రకటనలకు క్షేత్రస్థాయి వాస్తవాలకు పొంతన లేని పరిస్తితి ఏర్పడింది. దీంతో ఈ ఏడాది కూడా ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ అసంపూర్ణంగానే సాగనుంది. పూర్తిస్థాయిలో ఇకెవైసి నమోదుకాకపోవడమే ఈ పరిస్థితికి కారణం. విశ్వసనీయ సమాచారం ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా 5,31,377 మంది రైతుల వేలిముద్రలను సేకరించాల్సిఉంది. వరిసాగు చేసిన 8లక్షల ఎకరాలకు సంబంధించిన వివరాలు కూడా నమోదుకాలేదు. ప్రస్తుత సీజన్‌కు సంబంధించి ఇంతకు మించి చేయడం సాధ్యం కాదని అధికారులు అంటున్నారు. దీంతో ధాన్యం విక్రయాలకు సంబంధించి వీరు అయోమయ పరిస్థితి ఎదుర్కోక తప్పదని భావిస్తున్నారు. ఇకెవైసి జరగకపోవడంతో వీరందకరు ప్రయివేట్ వ్యాపారులకు ధాన్యం అమ్ముకోవాల్సిన పరిస్థితులు తలెత్తాయి. తుపాన్లు, వర్షాలకు పంటలు నష్టపోయినా పంటల బీమా, ఇన్‌పుట్ సబ్సిడీలు అందవు వేలి ముద్రలు పడకపోవడం, కౌలుకు ఇచ్చిన భూములకు యజమానులు వేలిముద్రలు వేయకపోవడం, వలసలు వంటి అంశాలను ఇకెవైసి లక్ష్యం పూర్తికాకపోవడానికి కారణాలుగా అధికారులు చెబుతున్నారు
శ్రీకాకుళం జిల్లాలో అత్యధిక మంది ...
శ్రీకాకుళం జిల్లాలో అత్యధిక మంది ఇకెవైసికి దూరమయ్యారు. ఈ జిల్లాలో 56,756 మంది నుండి వివరాలు ఇంకా సేకరించాల్సిఉంది. ఆ తరువాత స్థానంలో కాకినాడ జిల్లా ఉంది. ఈ జిల్లాలో 49,092 మంది నుండి ఇకెవైసి తీసుకోవాల్సిఉంది. గుంటూరు జిల్లాలో 39,884 మంది నుండి వివరాలు తీసుకోవాల్సిఉంది. నెల్లూరు జిల్లాల్లో 14శాతం మంది, విశాఖ పట్నంలో 13 శాతం మంది, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, డాక్టర్ బిఆర్.అంబేద్కర్ కోనసీమ, పార్వతీపురం మన్యం జిల్లాల్లో 12 శాతం మంది, పల్నాడు, విజయనగరం జిల్లాలో 11 శాతం మంది వివరాలు ఇకెవైసిలో నమోదుకాలేదు.

కౌలు గుర్తింపు కార్డు లేదన్నారు : వమరవెల్లి జయరాం, లక్ష్ముడుపేట, శ్రీకాకుళం జిల్లా
నేను నాలుగు ఎకరాల్లో వరి పంట వేశాను. ఇకెవైసి ఉంటేనే ధాన్యం కొంటామని అధికారులు ప్రచారం చేశారు. వేలిముద్ర వేసేందుకు రైతు భరోసా కేంద్రానికి వెళ్లాను. కౌలు గుర్తింపు కార్డు ఉంటేనే ఇకెవైసి అవుతుందని చెప్పడంతో వచ్చేశాను. ధాన్యం ఎవరికి అమ్ముకోవాలో తెలియడం లేదు. అప్పులు చేసి మదుపులు పెట్టాను.










