
కరిగిపోయిన కాలానికి వీడ్కోలు..అరుదెంచే రోజులకు ఆహ్వానం.. ఇదో నిరంతర ప్రక్రియ. ప్రవాహం. కాలం విసిరే సవాళ్లకు జవాబు కూడా కాలమే. కాలమంటే కార్యాచరణే. మన కార్యక్రమాలే. ఎవరు కదలినా లేకున్నా కాలం కదలిపోతుంటుంది. గతవారం ముగిసిన 2022ను సమీక్షించుకుంటే ఈ వారం రాబోయే 2023ను స్వాగతించాలి. ఎలా వుంటుందో అంచనా వేసి ఎలా వుండాలో నిర్వచించుకోవాలి. నిర్ణయించుకోవాలి. 'మంచి గతమున కొంచెమేనోరు మందగించక ముందుకడుగెరు' అన్న గురజాడ మాటలైనా, 'పదండి ముందుకు' అని చెప్పే శ్రీశ్రీ కవిత్వమైనా సందేశమదే. మనుషులు ఎప్పుడూ గతం కన్నా భవిష్యత్తు బాగుండాలని ఆశిస్తారు. అందుకోసం యథాశక్తి అడుగులు వేస్తారు. ఆశ, ఆత్మవిశ్వాసం, ఆశయబద్దమైన ఆచరణ ఇవే మానవాళిని ముందుకు నడుపుతాయి. అందుకే ప్రపంచమంతా 2023 ఆగమన వేడుకలు చూస్తాం. అయితే ఈ వేళలో మన దేశంలో మాత్రం మత చాందస సంస్థలు ఇది మనకు సంబంధం లేని వ్యవహారమని ప్రకటిస్తున్నారు. నూతన సంవత్సర వేడుకలపై నిఘా వేస్తామంటున్నారు. 2022 ఏళ్లుగా సాగుతున్న వాటిని కాదని అంతకన్నా వెనక్కు వెళ్లాలనుకోవడం దేనికి సంకేతం? ఏవో సూక్తులు, సుభాషితాలు వల్లించి మారే కాలంతో మనకు సంబంధం లేదని చెప్పడం, రాతి యుగంలో పాతేయాల్సిన పాతకాలపు సరీసృపాలను నెత్తిన పెట్టుకోవడం దేశాన్ని ముందుకు నడిపించదు. ఇంకా ఇంకా ఇంకా వెనక్కు నెడుతుంది. ఇక్కడే మన కొత్త సంవత్సర కర్తవ్యాలు మొదలై పోయినట్టు చెప్పాలి. వాస్తవికతతో పొంతన లేని ఛాందసాలనూ ఒంటెత్తు పోకడలను వదిలించుకోవడం మొదటి కర్తవ్యం.
విశాల భారత వికాసం
మత ఛాందసం అన్నాక ఒకటే వుండదు. భారతదేశం భిన్న మతాలకు, విశ్వాసాలకు నిలయం. పల్లె పట్టుల నుంచి పాలనా వ్యవస్థ వరకూ కూడా మత సామరస్యం మన దేశానికి దిక్సూచిగా నిలిచింది. హిందూ ముస్లిం తేడా లేకుండా ఉమ్మడి వేడుకలు ఇక్కడ సామరస్యాన్ని, సహజీవనాన్ని చాటిచెప్పాయి. బ్రిటిష్ వారి పాలనకు ముందే ఇక్కడకు క్రైస్తవమూ ప్రవేశించింది. బౌద్ధం, జైనం, సిక్కు వంటివి అంతకు ముందే వున్నాయి. ఈ భిన్న మతాల నిలయంగా ఈ దేశ సంస్కృతిని, చరిత్రను అర్థం చేసుకోకపోతే ఈ దేశానికి భవిష్యత్తు వుండదు. మతాలు అనేకం వున్నాయి గనకనే రాజ్యాంగ నిర్మాతలు మతాతీతమైన లౌకికతత్వం ఎంచుకున్నారు. కులం, మతం, ప్రాంతం, స్త్రీపురుష తేడాలు వంటివి పాటించని లౌకికతత్వం ఎంచుకున్నారు. రాజ్యాంగం 14వ అధికరణం నుంచి 25 వరకూ ఈ సమానతా భావన మనకు గోచరిస్తుంది. ఏది ఎక్కువ ఏది తక్కువ అని గాక రాజ్యాంగం ప్రకారం నడుచుకోవడమే దేశానికీ మనుషులకూ శ్రేయస్కరం. స్వార్థ రాజకీయాల కోసం ఇంభుకు భిన్నమైన వాదనలు తెచ్చి అత్యధికంగా వున్న మతమే ఆధిక్యత వహించాలని అసహనానికి గురి కావడం అర్థరహితం. రాజకీయంగా ఇలాంటి సిద్ధాంతాలు ఎవరు చెప్పినా తోసిపుచ్చడం ప్రజాస్వామ్య స్పృహ గల ప్రతివారి బాధ్యత. తాత్కాలిక అవకాశవాదాలకు, ఆవేశకావేశాలకు గురై తమ మతాన్ని ఇతరుల మీద రుద్దాలని చూడటం ప్రజల మధ్య చిచ్చు పెడుతుంది. తెలియకుండానే నిన్నటి మిత్రుడు లేదా ఇరుగు పొరుగు కూడా విడిపోయే విషమ పరిస్థితి దాపురిస్తుంది. దానివల్ల ఎవరికీ శాంతిసౌఖ్యాలు లేకుండా పోతాయి. కనుక ప్రజల మధ్య ఐక్యతను సామరస్యాన్ని కాపాడుకోవడం కీలకం. ఇటీవలి అనుభవాలు ముఖ్యంగా గత ఏడాది చేసిన కొన్ని ఘటనలు చెబుతున్నదదే. చాప కింద నీరులా చొరబడిన మతతత్వ రాజకీయాలను తోసిపుచ్చాల్సి వుంటుంది. ఏ ఆధారం లేని కట్టుకథలు, విద్వేష వివాదాలకు మనం లోబడిపోకుండా జాగ్రత్త వహించాలి.
వాళ్ల చుట్టే తిరగొద్దు
రాజకీయ రంగంలో ఏవో కొన్ని పాలక వర్గ పార్టీలు (బిజెపి, కాంగ్రెస్, వైసీపీ, తెలుగుదేశం, బిఆర్‌ఎస్ వంటివి) మాత్రమే శరణ్యమన్న భావన పోవాలి. పౌరులెవరైనా తమకూ దేశాన్ని మలచే హక్కు వుంటుందని గుర్తించాలి. రాష్ట్రాలలో గాని కేంద్రంలో గాని ఒకరిద్దరు నాయకులు, ఒకటి రెండు పార్టీలు, కొన్ని కులాల చుట్టూనే తిప్పుతూ అసలు సమస్యలు పక్కదోవ పట్టించే కుట్రలను అర్థం చేసుకోవాలి. బడా పార్టీల ఆధ్వర్యంలోని మీడియా సోషల్ మీడియా సంస్థలు పథకం ప్రకారం గుడుగుడు గుంచంలా అవే కథనాల చుట్టూ పరిభ్రమణం చేయిస్తున్నారనేది ప్రజలకు తెలియజెప్పాలి. రైతాంగం కార్మికులు ఉద్యోగులు మహిళలు సామాజికంగా దళితులు వెనకబడినవారిని తమ వలయంలో బందీలను చేయడం తప్ప సమగ్రంగా ఆలోచించే అవకాశం లేకుండా చేయడాన్ని ఛేదించాలి. వృథా వివాదాలు, బూతు పురాణాలు, కులాల కుంపట్లు రగిలించే రాజకీయాలను నిరసించాలి. సామాజిక న్యాయం, సాధికారతతో పాటు మౌలిక సమస్యలపై సమిష్టిగా పోరాడకుండా ఒరిగేది వుండబోదని తెలియజెప్పాలి.
సంక్షేమ పథకాలు స్వాగతించినా సమూలమైన పరిష్కారం భూమి, ఉపాధి, జీవిత భద్రత, హక్కుల రక్షణతోనే ముడిపడి వుంటుందని గుర్తించాలి. కులమత విభేదాలు ఏ పరిష్కారం సూచించలేవని స్పష్టంగా తెలుసుకోవాలి. గొప్పలెన్ని చెప్పుకున్నా పాలక వర్గ పార్టీలు, నాయకులు అంతిమంగా అధికారం కోసం అర్రులు చాచేవారే. మౌలిక సమస్యలపై వారు ఎలాంటి నిర్దిష్ట ప్రతిపాదనలు చేయడం లేదనే వాస్తవాన్ని తెలుసుకోవాలి. సంక్షేమ పథకాలను అవహేళన చేయడం సరికానట్టే వాటిని ఏ ఒక్కరి దయాభిక్ష గానో వ్యక్తిగత ఉదారతగానో చిత్రించే ప్రయత్నాలనూ తోసిపుచ్చాలి. కేంద్ర రాష్ట్రాల పథకాలేవైనా అన్నీ ప్రజాధనంతో జరిగేవి ఈ పథకాలను ఇష్టానుసారం కుదించడం, కోతలకూ వడపోతలకూ గురిచేయడం నిలదీయాలి. పాలక పార్టీలన్నీ బిజెపి, వైసీపీ, బిఆర్‌ఎస్, టిడిపి, కాంగ్రెస్ వంటి పార్టీలతో సహా అధికారంలో వున్నప్పుడు, లేనప్పుడు రెండు రకాలుగా మాట్లాడే ద్వంద్వనీతిని దుయ్యబట్టాలి. ఇటీవల ఎ.పి ప్రజాస్వామ్య పునరుద్ధరణ సభలో సిపిఎం కార్యదర్శి శ్రీనివాసరావు చెప్పినట్టు హక్కుల హరింపు విషయంలో టిడిపి పాలనా కాలం దృష్టిలో పెట్టుకుంటే భవిష్యత్తులో తాము ఏ విధంగా వాటిని కాపాడేందుకు కట్టుబడి వుంటారో స్పష్టం చేయాలి. తెలంగాణ లోనూ బిజెపిపై పోరాటంలో బిఆర్‌ఎస్‌తో కలసి వ్యవహరించినా ప్రజల సమస్యలపై రాజీ వుండబోదని సిపిఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చెప్పిందీ అదే. దేశమంతటా ప్రజా ఉద్యమాలపై రాష్ట్రాల హక్కులపై దాడి చేసే బిజెపిని పల్లెత్తుమాట అనకపోతే అది ఏ విధంగానూ పరిష్కారం కాదన్నది సత్యం. నిరంతర ప్రైవేటీకరణ, బడా సంపన్నులకు లక్షల కోట్ల రాయితీలు-బ్యాంకు సొమ్ముల ధారాదత్తం, ఆర్థిక అంతరాల తగ్గింపు లక్ష్యాన్ని వమ్ము చేస్తున్నాయి. ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక అణచివేతలు, దోపిడీ పీడనలపై జమిలిగా పోరాడాలి తప్ప పెద్ద పార్టీల ప్రచారాలు, నేతల కపట వాక్కులతో మోసపోకూడదు. మేడిపండు లాంటి గ్లోబల్ మార్కెట్ బుడగలు వరుసగా పగిలిపోతుంటే వాటిపై శ్రుతిమించిన ఆశలు పెంచుకోవడం అర్థరహితమని గ్రహించాలి. అమెరికా ఉపగ్రహం కావడం కాదు, స్వావలంబన తప్ప దేశానికి మరో ప్రత్యామ్నాయం వుండదనే మెళకువ వుండాలి. తక్షణ సమస్యగా సవాలు విసురుతున్న కోవిడ్ వేరియంట్‌లు, ఐ.టి కుదుపులను తట్టుకోగల వ్యూహం కావాలి. ఇప్పటికే వెనకబడిన ఆర్థికాభివృద్ధి ఉత్పత్తి రంగం, పెరిగిపోయిన దిగుమతులు, కేంద్ర రాష్ట్రాల రుణ ఊబి గురించి జాగ్రత్త వహించాలి తప్ప మోడీ సర్కారు భజన కీర్తనల బుట్టలో పడకూడదు.
దేశమంటే మనుషులోయ్!
సాంకేతిక మార్పుల యాజమాన్య పద్ధతుల మార్పులు, ప్రభుత్వ ప్రైవేటు నిఘాలలో చిక్కిన వ్యక్తిగత గోప్యత, స్వేచ్ఛ, నిర్వహణా స్వేచ్ఛ వంటివి కాపాడుకోవడం ఇక ప్రతివారికి పెద్ద అగ్నిపరీక్ష కొబోతున్నది. భావ ప్రకటనా స్వేచ్ఛ అనేది రాజకీయ సామాజిక కార్యకర్తలకో మీడియా వారికో మాత్రమే గాక గొప్ప రచయితలు కళాకారులకు కూడా మృగ్యమైపోతున్నది. ఇంకా విడుదల కాని 'పఠాన్' సినిమాలో నాయిక బికినీ ఏ రంగులో వున్నదనేదాన్ని బట్టి ముందస్తుగా నిషేధించడం గడచిన ఏదాది చివర పాదంలో చూసిన విపరీతం. ఇందుకు తలవంచడం మొదలెడితే ఇంకా ఇంకా అణచివేత తప్పదు. కనుకనే అన్ని తరగతుల ప్రజలూ అన్ని స్రవంతుల సంఘాలూ సృజనకారులూ కూడా తమ హక్కులను తామే రక్షించుకోవడానికి సిద్ధం కావలసిందే. విద్యార్థులు విద్యా హక్కు కోసం అధ్యాపకులు బోధనా హక్కు కోసం కూడా ఉద్యమించవలసిందే. ఉద్యోగ భద్రతకు ఘోరంగా కోతవేసి చాకిరీ పెంచే కొత్త కోడ్‌లపై వేతన జీవులు, కార్మికులు ఎలుగెత్తవలసిందే. వీటికి సమర్థనగా తెలివైన వాదనల తెచ్చే పరాన్నభుక్కు మేధావుల ప్రచారాలనూ తిప్పికొట్టవలసిందే. అభ్యుదయం, ప్రజాస్వామ్యం లౌకికతత్వం, సామ్యవాదం, శ్రామిక చైతన్యం వంటి మహత్తర ఆశయాలను అవహేళన చేస్తూ ఆలోచనా పరులను నిరుత్సాహ పరిచేందుకూ ప్రజలను తమ చుట్టూనే తిప్పుకోవడానికి పాలక వర్గాలు పొంచి కూచుని వుంటాయని గుర్తిస్తే ఇందులో ప్రతి అంశం ఎంత ముఖ్యమైందో బోధపడుతుంది. సరైన ప్రారంభమే సగం విజయం. 'దేశమంటే మట్టి కాదోరు దేశమంటే మనుషులోరు' అన్నట్టే ఏడాది మొదట్లోనే సరైన దిశా నిర్దేశం చేసుకోగలిగితే దేశాన్ని, సమాజాన్ని సంరక్షించుకోగల సత్తా సంతరించుకోగలం.
తెలకపల్లి రవి