- ఇద్దరు మృతి - 40 మందికి గాయాలు
- కేరళలోని కాలామస్సేరిలో ఘటన
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతనిధి - తిరువనంతపురం :కేరళలోని కొచ్చి నగరానికి సమీపంలో కాలామస్సేరిలో ఆదివారం జరిగిన పేలుడు ఘటనలో ఇద్దరు చనిపోయారు. మరో 40 మంది గాయపడ్డారు. కాలామస్సేరిలోని అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్‌లో 'జహోవా సాక్ష్యం' పేరిట ప్రత్యేక ప్రార్థనా కూటమి నిర్వహించారు. ఈ ప్రార్థన స్థలంలోనే ఐఇడి పేలుడు చోటుచేసుకుంది. పేలుడు జరిపింది తానేనని త్రిస్పూర్‌కు చెందిన డొమినిక్ మార్టిన్ అనే వ్యక్తి పేర్కొన్నాడు. ఈ మేరకు అతను ఫేస్‌బుక్ వెబ్‌సైట్‌లో ఒక వీడియో పోస్టు చేశాడు. 'ప్రార్థనలు నిర్వహిస్తున్న సంస్థ ప్రజలను తప్పుదారి పట్టిస్తోంది. వారి సైద్ధాంతిక భావాలు దేశానికి వ్యతిరేకమైనవి. జాతీయగీతం పాడరాదని, సైనిక సర్వీసుల్లో చేరవద్దని ప్రజలను ఆ సంస్థ ప్రేరేపిస్తోంది' అని మార్టిన్ ఆరోపించాడు. ఆన్‌లైన్ ద్వారా బాంబు తయారం చేయడం నేర్చుకొని, టిఫిన్ బాక్స్‌లో బాంబులు ఉంచి రిమోట్ కంట్రోల్ ద్వారా పేల్చినట్లు సదరు నిందితుడు పేర్కొన్నాడు. త్రిస్సూర్‌లోని కొడకర పోలీసు స్టేషన్‌లో మార్టిన్ లంగిపోయాడు. తాను కూడా క్రైస్తవుడినేని పేర్కొన్నాడు. అయితే అన్ని కోణాలను కేసును దర్యాప్తు చేస్తున్నామని శాంతిభద్రతల విభాగపు ఎడిజిపి ఎంఆర్ అజిత్ కుమార్ తెలిపారు. కాగా సిసిటివి దృశ్యాలు, మార్టిన్ మొబైల్ ఫోన్లలోని దృశ్యాలను పరిశీలించిన మీదట ఈ ఘాతుకానికి మార్టినే ఒడిగట్టి ఉంటాడని ప్రాథమికంగా భావిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. అతడి మొబైల్ ఫోన్లలోని గూగుల్ సెర్చ్ హిస్టరీ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోందన్నారు. బాంబు తయారీ కోసం వాడిని సామగ్రిని మార్టిన్ నివాసంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
- దర్యాప్తు తర్వాతే వివరాలు వెల్లడిస్తాం : సిఎం
బాంబు పేలుడు ఘటనను ముఖ్యమంత్రి పినరయి విజయన్ తీవ్రంగా ఖండించారు. సిపిఎం పొలిట్‌బ్యూరో సమావేశంలో పాల్గనేందుకు న్యూఢిల్ల్లీలో ఉన్న విజయన్ పేలుడు ఘటన దురదృష్టకరమని పేర్కొన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని, అది పూర్తి అయిన తర్వాతే తదుపరి వివరాలు వెల్లడిస్తామని ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు. ఇది చాలా తీవ్రమైన విషయమని ఆయన పేర్కొన్నారు. ఘటనలో చనిపోయిన, గాయపడినవారి సంఖ్యను ఆయన నిర్ధారించారు. రాష్ట్రంలో శాంతియుత వాతావారణం పరిరక్షించేందుకు, సామరస్యతను పెంపొందించేందుకు వీలుగా ఈ నెల 30న అఖిల పక్ష సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు.
సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గం బాంబు పేలుడును తీవ్రంగా ఖండించింది. కేరళ ప్రజానీకం శాంతియుత జీవనాన్ని గడుపుతారని, శాంతిభద్రతల పరిరక్షణలో రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉందని ఈ సందర్భంగా గుర్తు చేసింది. రాష్ట్రంలో శాంతియుత వాతావరణాన్ని దెబ్బతీసేందుకే ఈ దాడి జరిగినట్లుగా భావిస్తున్నామని పేర్కొంది. దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సిపిఎం డిమాండ్ చేసింది. కాగా ఈ దాడిలో గాయపడినవారికి ప్రభుత్వం మెరుగైన వైద్య సేవలందిస్తోంది. సెలవులో ఉన్న ఆరోగ్య కార్యకర్తలు, ఉద్యోగులందరూ తక్షణమే విధుల్లో చేరాలని ఆరోగ్య, వైద్య విభాగాధిపతులకు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జి ఆదేశాలు జారీ చేశారు.