Apr 01,2023 08:06

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రాజధాని ప్రాంత గ్రామాల ప్రజలు మొక్కవోని దీక్షతో చేపట్టిన ఉద్యమానికి శుక్రవారంతో 1200 రోజులు పూర్తయ్యాయి. ఉద్యమాన్ని అణిచేసేందుకు ప్రభుత్వం ఎన్ని ఒత్తిళ్లకు పాల్పడినా..పోలీసులతో వేధింపులకు గురి చేసినా పోరుబాట వీడకుండా సామాన్య ప్రజానీకం సుదీర్ఘకాలంగా పోరు సాగిస్తుండటం అభినందనీయం. ఢిల్లీని తలదన్నేలా అమరావతి నిర్మిస్తామంటూ శంకుస్థాపన సమయంలో గుప్పెడు మట్టి చెంబుడు నీళ్లు కుమ్మరించి వెళ్లిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆ తర్వాత అతీగతీ పట్టించుకున్న పాపాన పోలేదు. ఇక్కడి బిజెపి నేతలు మాత్రం అమరావతికి అన్యాయం జరిగిపోతోందంటూ మొసలి కన్నీరు కారుస్తూ కపట నాటకాలు ఆడుతున్నారు. కానీ నాడు భూసమీకరణ సమయంలో టిడిపి ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని ప్రశ్నించి..నేడు రాజధాని తరలింపు యత్నాలతో వైసిపి ప్రభుత్వ వంచనలను నిలదీస్తూ రాజధాని ప్రాంత పేదలకు, రైతులకు అండదండగా నిలిచింది ఒక్క ఎర్రజెండానే. ఉద్యమం 1200 రోజులకు చేరుకున్న సందర్భంగా మరోమారు సంపూర్ణ మద్దతు ప్రకటించి మార్క్సిస్టు పార్టీ తన నిబద్ధతను చాటుకుంది.
రాజధాని విజయవాడలో పెట్టినా, గుంటూరులో పెట్టినా మనస్ఫూర్తిగా అభ్యంతరమే లేదు. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టరాదనే రాజధానిగా అమరావతిని స్వాగతిస్తున్నాం. అంటూ ప్రతిపక్ష నేత హోదాలో శాసనసభలోనూ, 'టిడిపి అధినేత చంద్రబాబు తాత్కాలిక నివాసంలో ఉంటున్నారు. నేను ఇదే అమరావతిలో శాశ్వత నివాసం నిర్మించుకున్నా..రాజధాని మార్చే ప్రసక్తే లేదు' అంటూ ఎన్నికల ప్రచారంలోనూ హామీలు కుమ్మరించిన ఇప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అధికారంలోకి రాగానే తన హామీలపై తానే నీళ్లు కుమ్మరించారు. 2019 డిసెంబరు 17న శాసనసభలో మూడు రాజధానులంటూ కొత్త పల్లవి అందుకున్నారు. అదిగో కర్నూలు..ఇదిగో విశాఖ అంటూ కాలం వెళ్లదీస్తూ వస్తున్నారే మినహా రాజధాని చిక్కు ముడి విప్పడం లేదు. రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌కు ఈ దుస్థితి పట్టడానికి ప్రధాన ముద్దాయి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వమే. అమరావతి నిర్మాణానికి రూ.42 వేల కోట్లు అవసరమని నాటి టిడిపి - బిజెపి ప్రభుత్వం కేంద్రానికి నివేదించినా..రూ.1500 కోట్లుతో సరిపెట్టింది. భారీ సినిమా గ్రాఫిక్స్‌లా రాజధానిని చూపించి సారవంతమైన 35 వేల ఎకరాలను భూసమీకరణ పేరిట రైతుల నుండి తీసుకున్న తెలుగుదేశం ప్రభుత్వం తాతాల్కిక భవనాలనే నిర్మించగలిగింది. ఆచరణ సాధ్యమైన, పరిపాలనా రాజధానిని పరిమిత ప్రాంతంలో చేపట్టివుండాల్సింది.
మూడు రాజధానుల విషయంలోనూ మోడీ సర్కార్‌ గోడమీద పిల్లి వాటం ప్రదర్శిస్తోంది. 42 కేంద్ర ప్రభుత్వ సంస్థలకు అమరావతిలో స్థలాలు కేటాయించినా, నిర్మాణాలు ప్రారంభించలేదంటే కేంద్రం మతలబు ఏమిటి? అమరావతి మెట్రో రైల్‌ ఊసులేమయ్యాయి? ఇవన్నీ బిజెపిని బోనులో నిలిపే ప్రశ్నలే. బిజెపి-వైసిపి కుమ్మక్కు అయ్యే ప్రస్తుత మూడు రాజధానుల వంచన పూరిత వ్యూహానికి తెరలేపాయా అన్న సందేహం కలగమానదు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలంటే వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల అభివృద్ధిపై దృష్టి సారించి ఆ మేరకు అవసరమైన నిధులను ప్రత్యేకంగా కేంద్రం నుంచి రాబట్టుకోవాలి. కానీ ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనలను విన్నపాలకు సరిపెడుతున్నారే మినహా.. 'మెడలు వంచి నిధులు, హోదా సాధించుకు'నే పోరాటస్ఫూర్తి లేదు. ఇకనైనా బిజెపి మోసాన్ని గుర్తించి ఇక్కడి పాలకులు కళ్లు తెరవాలి. రాజధాని, పోలవరం నిర్మాణ నిధులతో సహా రాష్ట్రానికి చట్టబద్ధంగా రావాల్సిన ప్రత్యేక హోదా, నిధులు రాబట్టుకోవాలి. అమరావతి విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును అమల్జేయకుండా సుప్రీంకోర్టులో సవాలు చేసి భంగపాటుకు గురైన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మొండి వైఖరి వీడాలి. అమరావతి రైతుల డిమాండ్లను పరిష్కరించాలి.