Sep 10,2023 21:40

సమగ్ర శిక్షా అభియాన్‌, కాంట్రాక్ట్‌ అవుట్‌ సోర్సింగ్‌, పార్ట్‌ టైం ఉద్యోగుల వేడుకోలు దీక్ష
ప్రజాశక్తి-యంత్రాంగం :తమను పర్మినెంట్‌ చేయాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సమగ్ర శిక్షా అభియాన్‌, కాంట్రాక్ట్‌ అవుట్‌ సోర్సింగ్‌, పార్ట్‌ టైం ఉద్యోగులు పలు జిల్లాల్లో ఆదివారం వేడుకోలు దీక్ష నిర్వహించారు. ఉద్యోగుల జెఎసి ఆధ్వర్యంలో కలెక్టరేట్ల ఎదుట ఈ కార్యక్రమం చేపట్టారు. మూడు నెలల బకాయి జీతాలు చెల్లించాలని, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ మాకు వర్తింజేయాలని, ఉద్యోగ విరమణ వయస్సు 62 ఏళ్లకు పెంచాలని నినాదాలు చేశారు. వారి ఆందోళనకు యుటిఎఫ్‌, సిఐటియు నాయకులు మద్దతు తెలిపారు. విజయనగరం కలెక్టరేట్‌ వద్ద దీక్షలో ఎపి కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.కాంతారావు, సిఆర్‌ఎంటి ఫెడరేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.గురువులు మాట్లాడుతూ జిఒ 40ని విడుదల చేసినా మినిమం టైమ్‌స్కేల్‌ అమలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. విద్యారంగంలో తీసుకొస్తున్న మార్పుల్లో భాగంగా అన్ని విభాగాల ఉద్యోగులను రేషనలైజేషన్‌ పేరుతో కుదించి ఉన్న ఉద్యోగాలను తొలగించే ప్రయత్నాలు చేయడం దారుణమన్నారు. రోజుకొక కొత్త యాప్‌ తీసుకొచ్చి పని ఒత్తిడి పెంచిన ప్రభుత్వం జీతాలు మాత్రం సకాలంలో చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీక్షలకు యుటిఎఫ్‌ విజయనగరం జిల్లా ప్రధాన కార్యదర్శి జెఎవిఆర్‌కె ఈశ్వరరావు, ఫెడరేషన్‌ జిల్లా అధ్యక్షులు జి.అప్పలసూరి మద్దతు తెలిపారు. అనంతపురం కలెక్టరేట్‌ వద్ద దీక్షలో యుటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు నక్కా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సమగ్ర శిక్ష అభియాన్‌లో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌, పార్ట్‌ టైం ఉద్యోగుల సమస్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని కోరారు. జెఎసి అధ్యక్షులు కె.విజరు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో యుటిఎఫ్‌ అనంతపురం జిల్లా గౌరవాధ్యక్షులు రమణయ్య, శ్రీ సత్య సాయి జిల్లా అధ్యక్షులు జయచంద్రా రెడ్డి, ప్రధాన కార్యదర్శి సుధాకర్‌, గౌరవాధ్యక్షులు భూతన్న తదితరులు పాల్గన్నారు. పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం భీమవరంలో నిరసన దీక్ష చేపట్టారు. తొలుత సిఐటియు కార్యాలయం నుంచి మెయిన్‌ రోడ్డు మీదుగా ప్రకాశం చౌక్‌కు ర్యాలీగా చేరుకున్నారు. ఏలూరులోని కలెక్టరేట్‌ వద్ద ఆర్ట్‌, క్రాఫ్ట్‌, పిఇటి రాష్ట్ర అధ్యక్షులు వాసా శ్రీనివాసరావు అధ్యక్షతన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 'మన ప్రభుత్వం వస్తుంది.. మీ అందరి సమస్యలు తీరుస్తుంది' అని గత ఎన్నికల ముందు ప్రజాసంకల్ప పాదయాత్రలో జగన్‌ చెప్పి అధికారంలోకి వచ్చి నాలుగేళ్లయినా సమగ్ర శిక్ష కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించలేదని విమర్శించారు. కర్నూలు కలెక్టరేట్‌ వద్ద నిర్వహించిన దీక్షకు సిఐటియు జిల్లా కార్యదర్శులు పి.నిర్మలమ్మ, జె.నాగేశ్వరరావు మద్దతు తెలిపి మాట్లాడారు. అనకాపల్లి జిల్లా కేంద్రంలోని ఎన్‌టిఆర్‌ స్టేడియం వద్ద నిర్వహించిన దీక్షకు సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్‌.శంకరరావు, యుటిఎఫ్‌ జిల్లా కార్యదర్శి గొంది చిన్నబ్బాయి, పిఆర్‌టియు నేత గోపీనాథ్‌ సంఘీభావం తెలిపారు. అల్లూరి సీతారామరాజు పాడేరులో ఐటిడిఎ వద్ద, పార్వతీపురం మన్యం జిల్లాలో కలెక్టరేట్ల వద్ద వేడుకోలు దీక్ష నిర్వహించారు.