Aug 09,2023 16:32

హైదరాబాద్‌ : ఈ నెల 14 నుంచి 24 వ తేదీ వరకు రాష్ట్రంలోని అన్ని థియేటర్లలో ఉచితంగా గాంధీ చిత్రాన్ని ప్రదర్శించనున్నట్లు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు. బుధవారం డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలోని తన చాంబర్లో చిత్ర ప్రదర్శనకు సంబంధించిన ఏర్పాట్లపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ వేడుకల్లో భాగంగానే విద్యార్థుల్లో జాతీయ స్ఫూర్తిని చాటే విధంగా రాష్ట్రంలోని 582 స్క్రీన్‌లలో గాంధీ చిత్రాన్ని ఉచితంగా ప్రదర్శించనున్నట్లు చెప్పారు.ఈ సమావేశంలో ఎఫ్‌డిసి చైర్మన్‌ అనిల్‌ కుమార్‌ కూర్మాచలం, తెలంగాణ స్టేట్‌ ఫిలిం చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు సునీల్‌ నారంగ్‌, కార్యదర్శి అనుపమ్‌ రెడ్డి, తెలుగు ఫిలిం చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు దిల్‌ రాజు, కార్యదర్శి దామోదర్‌ ప్రసాద్‌, హౌం శాఖ ముఖ్య కార్యదర్శి జితేందర్‌, ఎఫ్‌డిసి ఎమ్‌డి అశోక్‌ రెడ్డి, న్యాయశాఖ అదనపు కార్యదర్శి మన్నన్‌,ఎఫ్‌డిసి ఈడి, కిశోర్‌ బాబు, యుఎఫ్‌ఒ క్యూబ్‌, సెరసెర,పివిఆర్‌ ప్రతినిధులు శ్రీనివాస్‌, సాయిరఘురామ్‌, ప్రదీప్‌, సందీప్‌, తదితరులు పాల్గొన్నారు.