Jul 28,2023 20:56

-ప్రభుత్వ నిర్వాకాన్ని అక్కడే బట్టబయలు చేస్తా
-జగన్‌ విధానాలే పోలవరానికి శాపం
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :రాష్ట్రంలోని అన్ని సాగునీటి ప్రాజెక్టులను ఆగస్టు ఒకటవ తేది నుండి సందర్శించనున్నట్లు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎన్‌. చంద్రబాబునాయుడు తెలిపారు. టిడిపి కార్యాలయం ఎన్‌టిఆర్‌ భవన్‌లో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ నిర్వాకాన్ని, రాష్ట్ర ప్రజలకు చేసిన ద్రోహాన్ని, అవినీతి బాగోతాన్ని ప్రాజెక్టుల వద్ద బట్టబయలు చేస్తానని చెప్పారు. రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం సమాధానం చెప్పేంతవరకూ వదిలిపెట్టేది లేదన్నారు. రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అనుసరించిన విధానాలే శాపంగా మారాయన్నారు. రాష్ట్రప్రభుత్వ అసమర్థ నిర్ణయాలు, రివర్స్‌ పోకడల కారణంగా ప్రాజెక్టు సర్వనాశనం అయ్యిందని చెప్పారు. డయాఫ్రంవాల్‌ కొట్టుకుపోవడానికి జగన్‌ మూర్ఖపు నిర్ణయాలే కారణమని విమర్శించారు. గోదావరి నుంచి సముద్రం పాలవుతున్న 2 నుంచి 4 వేల టిఎంసిల నీటిని వాడుకుంటే రాష్ట్ర రూపురేఖలే మారిపోతాయని తెలిపారు. 2020 నాటికే పూర్తికావాల్సిన ప్రాజెక్టు ఎందుకు ఆలస్యమవుతోందని, సాంకేతికంగా జరిగిన తప్పులకు కారకులు ఎవరని ఆయన ప్రశ్నించారు. డయాఫ్రమ్‌ వాల్‌లో కీలకమైన కాఫర్‌డ్యామ్‌ డౌన్‌, అప్‌స్ట్రీమ్‌ల మధ్యలో కొట్టుకుపోయి ఇసుక పేరుకుందన్నారు. స్పిల్‌వే ఎడమవైపు నీటి ఉధృతిని ఎదుర్కొనడానికి నిర్మించిన గైడ్‌బండ్‌ కూడా కుంగిపోయి చివరకు ప్రాజక్టులో గేట్లు మిగిలాయని పేర్కొన్నారు. ఇంతదారుణం జరిగితే సమాధానం చెప్పకుండా రంకెలేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టును 2021 జూన్‌ నాటికి పూర్తిచేసి నీళ్లిస్తామని ఒకసారి, 2022 ఖరీఫ్‌ నాటికి పూర్తిచేస్తామని మరోసారి, 2023 ఖరీఫ్‌కు పూర్తిచేస్తామని ఇంకోసారి జగన్‌ పలు సందర్భాల్లో చెప్పారని వీడియోల ద్వారా వివరించారు. తమ ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టుకు రూ.11,537 కోట్లు ఖర్చు చేసి 72శాతం పూర్తిచేస్తే, వైసిపి ఇప్పటివరకు రూ.4,611 కోట్లు మాత్రమే ఖర్చు చేసి 4శాతం పనులు చేసిందని వివరించారు. ముంపు బాధితులకు పరిహారం రెట్టింపు ఇస్తామని ప్రతిపక్షనేతగా ప్రగల్భాలు పలికి, నేడు వాళ్లను ముంచేశారని మండిపడ్డారు. 2010-11 ధర అంచనా ఆధారంగా తాము పరిహారం ఇవ్వాలని చూశామన్నారు. వరదలు వస్తే నిర్వాసితుల్ని గాలికి వదిలేసి రెండు టమాటాలు, బంగాళాదుంపలతో చేతులు దులుపుకుంటున్నారని విమర్శించారు. సకల వసతులతో నిర్వాసితులకు కాలనీలు నిర్మిస్తానని, నాలుగేళ్లల్లో ఒక్క ఇల్లు కట్టలేదన్నారు.