Sep 23,2023 22:15
  •  నేడూ కొనసాగనున్న విచారణ

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి : రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలులోని కాన్ఫరెన్స్‌ హాలులో మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడి విచారణ ప్రక్రియ ప్రారంభమైంది. తొలిరోజైన శనివారం సిఐడి డిఎస్‌పి ధనుంజయుడు నేతృత్వంలో 12 మంది అధికారుల బృందం చంద్రబాబును సుమారు ఆరు గంటల పాటు ప్రశ్నించింది. స్కిల్‌ డవలప్‌మెంట్‌ స్కామ్‌ కేసులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న చంద్రబాబును రెండు రోజులపాటు విచారించేందుకు సిఐడికి కోర్డు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తొలిరోజు విచారణ ఉదయం 9.30 గంటలకు ప్రారంభమై సాయంత్రం ఐదు గంటల వరకూ కొనసాగింది. ఉదయం 9.15 గంటలకే అధికారులు లాప్‌ట్యాప్‌, ప్రింటర్స్‌లతో రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలులోకి వెళ్లారు. తొలుత జైలులో చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించారు. చంద్రబాబు తరుఫున లాయర్లు దమ్మాలపాటి శ్రీనివాస్‌, సుబ్బారావు సమక్షంలో తొలిరోజు విచారణ సాగింది. సీమెన్స్‌ ఒప్పందం, ఆర్థిక లావాదేవీలపై ప్రధానంగా విచారించినట్లు సమాచారం. మధ్యాహ్న భోజనంతోపాటు మొత్తం ఏడుసార్లు అధికారులు బ్రేక్‌ ఇచ్చినట్లు తెలిసింది. చంద్రబాబు వయస్సు, ఆరోగ్యం దృష్ట్యా జైలు ఆవరణలోనే వైద్య బృందాన్ని అందుబాటులో ఉంచారు. ఉదయం, సాయంత్రం మొత్తం సుమారు ఆరు గంటలపాటు సుదీర్ఘ విచారణ జరిగింది. కోర్టు ఆదేశానుసారం గంటకోసారి ఐదు నిమిషాలు బ్రేక్‌ ఇచ్చారు. సిఐడికి చెందిన వీడియోగ్రాఫర్‌తో విచారణను అధికారులు రికార్డింగ్‌ చేయించారు. విచారణ అనంతరం చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆదివారం కూడా విచారణ కొనసాగనుంది. రెండు రోజుల విచారణ అనంతరం వీడియో మొత్తాన్ని సీల్డ్‌ కవర్‌లో కోర్టుకు అందించాలని సిఐడి న్యాయమూర్తి ఆదేశించిన సంగతి తెలిసిందే.

తొలి రోజు 50కిపైగా ప్రశ్నలు?

చంద్రబాబును ప్రశ్నించేందుకు రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలుకు వచ్చిన సిఐడి అధికారులు దాదాపు 120 ప్రశ్నలను సిద్ధం చేసుకున్నట్లు తెలిసింది. వీటిలో తొలిరోజు 50కిపైగా ప్రశ్నలు వేసినట్లు సమాచారం. అత్యధిక ప్రశ్నలకు చంద్రబాబు కాదు, తెలియదు, గుర్తులేదు అని సమాధానం చెప్పినట్లు తెలుస్తోంది. కుట్రకోణం, నిధుల విడుదల, షెల్‌ కంపెనీల సాక్షాధారాల మాయంపై ప్రశ్నలు వేసినట్లు తెలిసింది. కేంద్ర దర్యాప్తు సంస్థలు సేకరించిన ఆధారాలకు అనుగుణంగా ప్రశ్నలు వేసినట్టు సమాచారం. చంద్రబాబు పిఎ శ్రీనివాస్‌ ఎందుకు అమెరికా పారిపోయారు? ఆదాయ పన్ను శాఖ ఇచ్చిన రిపోర్టులు, షెల్‌ కంపెనీల వెనుక ఎవరెవరున్నారు? స్కిల్‌ డెవలప్‌మెంట్‌ నిధుల విడుదలలో ఎందుకు తొందరపడ్డారు? అనే వాటిపై అంశాల వారీగా విచారణ చేసినట్లు సమాచారం. గత ప్రభుత్వ హయాంలో నిధుల విడుదలలో అధికారులపై ఎందుకు ఒత్తిడి తెచ్చారు? కీలకమైన ఫైళ్లు ఎందుకు మాయమయ్యాయి? అనే విషయాలపై కూడా ప్రశ్నించినట్లు తెలిసింది. సుమన్‌ బోస్‌తో రహస్య ఒప్పందం జరిగిందా? డిపిఆర్‌ లేకుండా ప్రాజెక్టు ఎందుకు పైనల్‌ చేయించారు అంటూ ప్రశ్నించినట్లు తెలిసింది. నిధులు విడుదల చేసేప్పుడు ప్రొసీజర్స్‌ ఎందుకు ఫాలో కాలేదు? ఫైనాన్స్‌ సెక్రటరీ వద్దన్నా నిధులు ఎందుకు విడుదల చేశారు? అని ప్రశ్నించినట్లు సమాచారం. యుపి కేడర్‌ ఐఎఎస్‌ ఆఫీసర్‌ను డిప్యూటీ సిఇఒగా ఎందుకు చేశారు? రూ.3 వేల కోట్ల గురించి అడగొద్దని అధికారులను ఎందుకు దబాయించారు? ఈ స్కామ్‌లో అచ్చెన్నాయుడు పాత్రపై వివరాలు కోరడంతోపాటు రూ.3 వేల కోట్లు గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ డిస్కౌంట్‌గా ఎందుకు మారిందని ప్రశ్నించినట్లు తెలిసింది. సుమన్‌ బోస్‌తో సుబ్బారావుకు జరిగిన ఇ-మెయిల్స్‌ వివరాల గురించి అడిగినట్టు సమాచారం.