
ప్రజాశక్తి-పులివెందుల : మాజీ మంత్రి వైఎస్.వివేకానందరెడ్డి హత్యకు ఉపయోగించిన ఆయుధాల కోసం పులివెందుల రోటరీపురం వాగులో సిబిఐ బృందం తనిఖీలు చేపట్టింది. శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ అన్వేషణ కొనసాగింది. సిబిఐ అదుపులో ఉన్న సునీల్ యాదవ్ ఇచ్చిన సమాచారం మేరకు అధికారులు గాలింపు చేపట్టారు. వివేకా ఇంటి సమీపంలోని రోటరీపురం వాగులోని నీటిని రెండు మున్సిపల్ ట్యాంకర్లతో తోడించారు. ఆయుధాలు స్వాధీనం చేసుకున్న తర్వాత సునీల్ ద్వారా మరింత సమాచారం సేకరించే అవకాశం ఉంది. వివేకా హత్య కేసులో ఎవరెవరి ప్రమేయం ఉందో సిబిఐ అధికారులకు సునీల్ చెప్పడంతో ఈ కేసు ఓ కొలిక్కి వచ్చినట్లు సమాచారం. అందులో భాగంగానే ఆయుధాల కోసం అన్వేషించారు. కడప కేంద్ర కారాగారంలోని అతిథి గృహంలో కడప రైల్వేస్టేషన్ మేనేజర్ మోహన్‌రెడ్డి, మాజీ డ్రైవర్ దస్తగిరి, సుంకేసులకు చెందిన ఉమాశంకర్‌రెడ్డి, పులివెందులకు చెందిన చెప్పుల దుకాణం యజమాని మున్నాలను సిబిఐ అధికారులు విచారణ చేశారు.