ఇంటిలోనైనా, వీధిలోనైనా ఉరకలెత్తే సమూహం యువతరం. సందడికైనా, సాహసానికైనా ముందు నిలిచే సందోహం యువతరం. వాహనానికి ఇంధనం ఎలాగో దేశానికి యువతరం అలాగ. దేహానికి రుధిరం ఎలాగో సమాజానికి నవతరం అలాగ. ఎక్కడైనా ఎప్పుడైనా దేన్నయినా శోధించి సాధించి అధిగమించి అధిరోహించి విజయ పతాకాన్ని ఎగరేయడం యువతరానికి సహజంగానే సమకూరే విద్య. దానికి సరైన నైపుణ్యామూ, సహకారమూ, లక్ష్యమూ జోడించగలిగితే- ఇక అంతా జేజేల సందర్భమే !
యుక్త వయసు రాగానే ఇంత బల సంపన్నత ఆటోమేటిగ్గా వచ్చి చేరిపోతుందా? పద్దెనిమిది లోకి ప్రవేశించగానే ఇన్ని శక్తి సమూహాలూ, యుక్తి సరంజామాలూ వాటికవి వచ్చి వాలిపోతాయా? ఈ ప్రశ్నకు జవాబు- కొంత అవును.. కొంత కాదు. ఎందుకంటే- ఇక్కడ లెక్క వయసుకు సంబంధించి మాత్రమే కాదు; ఆ వయసు వచ్చే నాటికి ఉండే మానసిక ఉద్విగత, సన్నద్ధత, సామాజిక స్పృహకు సంబంధించి కూడా. యువతకు సహజమైన శక్తి, అమితమైన ఆసక్తి ఉంటాయి. ఏది సరిగ్గా లేదో దాని మీద కోపం ఉంటుంది. ఏది అసమంగా ఉందో దాని మీద ఆలోచన రేకెత్తుతుంది. ఏది అన్యాయంగా ఉందో దాని మీద ఆగ్రహం కలుగుతుంది. ఎందుకు, ఏమిటి? ఎలా? అన్న విచక్షణ, వివేచన, సంఘర్షణా మనసు నిండా నడుస్తూ, తొలుస్తూ ఉంటాయి. ఇదంతా యువతరం సమాజాన్ని, చుట్టూ ఉన్న వాతావరణాన్ని పట్టించుకున్నప్పుడు ... సహజంగా మేల్కొనే ప్రక్రియ. కానీ, అలా 'పట్టించుకోనివ్వని' విధంగా ఎన్నో ప్రతికూల ప్రభావాలు స్వారీ చేస్తున్నాయి.
చరిత్రలో అయినా, సమాజంలోనైనా యువత పాత్ర ఎంతో కీలకం. ఏ ఉద్యమం విజయవంతం కావాలన్నా, ఏ ప్రాజెక్టు ఫలవంతం అవ్వాలన్నా వారి క్రియాశీలత చాలా ప్రధానం. అందుకనే వందేళ్ల క్రితం వివేకానందుడు ప్రత్యేకించి యువతరాన్ని మేల్కొలిపే ఉద్యమం చేపట్టాడు. యువతరం పూనుకుంటే దేశాన్ని ముందుకు నడిపించవొచ్చని స్పష్టం చేశాడు. 'ప్రశ్న ఆయుధం కావాలి. ప్రతి దానికీ తలూపటం కాదు, తర్కించాలి. హేతుబద్ధంగా లేని దేనినీ నమ్మక్కర్లేదు.' అని చాటిచెప్పాడు. సరిగ్గా వారం రోజుల్లో మనం 75వ స్వాతంత్య్ర సంబరం జరుపుకోబోతున్నాం. కానీ, ఇన్నేళ్ల తరువాత వెనక్కి తిరిగి చూస్తే... మనం ఎలా ఉన్నాం?
ప్రపంచంలో అన్ని దేశాల కన్నా అత్యధిక యువ జనాభా మనదేశంలోనే ఉంది! ప్రపంచం మొత్తం మీద 180 కోట్ల యువజనులు ఉంటే- అందులో 28 శాతం మన యువతే! మన దేశంలో ఇప్పుడు సగటు వయసు 29 ఏళ్లు. అంటే భారత్ నవనవలాడుతున్న ఒక యువజన దేశం. మరి అలాంటి ఉత్తేజ ఉత్సాహాలతో మన యువతరం ఉందా? అధికారిక లెక్క ప్రకారమే దేశంలో 30 శాతం మంది యువతకు ఉద్యోగం కానీ, ఉపాధి కానీ లేదు. ఈ విషయంలో మన దేశం శ్రీలంక, నేపాల్‌ల కన్నా వెనకబడి ఉంది. ప్రపంచంలో మన స్థానం జనాభాలో రెండో స్థానమైతే, ఆ జనాభాను పనికి ఉపయోగించుకోవటంలో 103వ స్థానం! ఎంతటి దౌర్భాగ్యం ఇది! యువతరం అంటే కేవలం ఓట్లు కాదు; వనరులు కూడా. ఫలితమూ, ప్రయోజనమూ, ఉత్పాదక ఉన్న పనుల్లో యువత నిమగమై ఉండాలనేది మన స్వాతంత్య్ర సమర యోధుల ఆకాంక్ష. కానీ, ఆచరణ అలా లేదు.
యువతరం అంటేనే-వివేకం, వివేచన, విచక్షణ, హేతువాద వీక్షణం. చదువులు పెరిగేకొద్దీ, సాంకేతికత పెరిగేకొద్దీ ఈ దృక్పథం మరింత వృద్ధి కావాలి. కానీ, నేడు అందుకు భిన్నమైన దృశ్యం కనిపిస్తోంది. సాంకేతిక విప్లవాన్ని వినియోగించుకొని అజ్ఞానపు సామ్రాజ్యం పెచ్చరిల్లుతోంది. ''ఎల్ల లోకము ఒక్క ఇల్లై..'' విలసిల్లాలని అభిలషించిన గురజాడ వంటి మహా కవుల మాట ఇప్పుడు...కుల, మత, ప్రాంత విభేదాల దొంతర్ల మోతలో పొల్లు పోతోంది. యువశక్తి దేశ సర్వముఖతోభివృద్ధికి, శాస్త్రీయ పురోగాభివృద్ధికి, సమభావన, సౌభ్రాతృత్వం విలసిల్లే దిశగా దోహదపడాలి. నవీన పథంలోకి దేశాన్ని మళ్లించటానికి ఉపయోగపడాలి. 'ఇంక్విలాబ్ జిందాబాద్' అని భగత్‌సింగ్ నినదించింది, దేశాన్ని కదిలించింది 23 ఏళ్ల యువకుడిగా ఉన్నప్పుడే! అల్లూరి సీతారామరాజు 'వందేమాతరం' అని విశాఖ మన్యాన్ని చైతన్యబాటలో కదిలించింది 24 ఏళ్ల వయసులో. నేడు ఒలింపిక్స్‌లో మన దేశ పతాకను సగర్వంగా రెపరెపలాడించి కోట్లాది భారతీయ హృదయాలను ఒకేలా స్పందింపజేసిందీ 30 ఏళ్లు నిండని యువ క్రీడాకారులే! ''యువతరం శిరమెత్తితే... నవతరం గళమెత్తితే...లోకమే మారిపోదా? శోకమే పారిపోదా?'' అన్నది ఒక కవి ఆశాభావం. అది కేవలం ఆశే కాదు; చరిత్ర నిండా అనేక ఉదంతాలూ ఉదాహరణలూ ఉన్నాయి. ఆ దిశగా భారత యువతరం అడుగేయాలి.










