Nov 06,2022 22:20

బెట్టింగులతో చెలరేగిపోతున్న యువత
దృష్టిసారించని పోలీసు యంత్రాంగం
లాడ్జిల్లోనే బుకీల మకాం..!
ఉమ్మడి జిల్లాలో ఇదీ పరిస్థితి
ప్రజాశక్తి - ఏలూరు అర్బన్‌

              ట్వంటీ-20.. ఈ పదం వింటేనే చాలు యువతరం ఊగిపోతుంది.. మ్యాచ్‌ ఆరంభానికి ముందే టీవీలకు అతుక్కుపోతుంది.. ఈ ఆట కోసం నెలల తరబడి వేచి చూస్తుంది.. అదే బెట్టింగురాయుళ్లకు కలిసొచ్చింది. యువతలోని అతృతతను సొమ్ము చేసుకుంటుంది. ఏ జట్టు గెలుస్తోంది? ఏ జట్టు ఎన్ని పరుగులు చేస్తోంది? వంటి పదాలతో పందేలు కాస్తుంది. చివరకూ యువతను జూదం అనేమత్తులో దించుతోంది.
అస్ట్రేలియా వేదికగా కొద్దిరోజులుగా జరుగుతున్న టీ-ట్వంటీ వరల్డ్‌ కప్‌ పోటీల్లో బుకీలు బరితెగించి మరీ పందేలకు దిగుతున్నారు. పట్టణాలు, పల్లెలు తేడా లేకుండా యువతను ఈ రొంపిలోకి దించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇప్పటికే మ్యాచ్‌లు ఆరంభమై దాదాపుగా లీగ్‌ దశ కూడా పూర్తికావొస్తోంది. దీంతో ఇప్పటి వరకూ నిర్వహించిన పందేలను రెట్టింపు చేయాలని బుకీలు ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరు, భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, నరసాపురం వంటి ప్రాంతాలతో పాటుగా కొత్తగా ఏలూరు జిల్లాలో కలిసిన నూజివీడు వంటి ప్రాంతాల్లోనూ పంటర్లు (ప్రధాన బుకీల వద్ద సబ్‌ బుకీలు) తిష్టవేశారు. ఆయా ప్రాంతాల్లో ఉన్న లాడ్జీలతో పాటుగా శివారునున్న ప్రాంతాల్లో ఇళ్లను అద్దెకు తీసుకుని వాటి కేంద్రంగా పందేలను నిర్వహిస్తున్నారు. ప్రధాన బుకీలు మాత్రం విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్‌, చెన్నై వంటి ప్రాంతాల నుంచి వీరికి బంతి బంతికీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న వైర్‌లెస్‌ రేడీయోల ద్వారా రేట్ల వివరాలను వెల్లడిస్తున్నారు. బంతిబంతికీ రేటు మారుతుండే విధానం కాబట్టి వీరు కూడా ఎప్పటికప్పుడు పందెంరాయుళ్లకు అప్‌డేట్‌ను ఇస్తున్నారు.
ప్రత్యేక యాప్‌ల ద్వారా పందేలు..!
బుకీలు ఈ పందేల కోసం బుకీలు ప్రత్యేకంగా యాప్‌ను రూపొందించారు. ఆ యాప్‌ ద్వారా ఎప్పటికప్పుడు (బంతి బంతికీ) రేటును తెలియపరుస్తున్నారు. కొంతకాలం క్రితం వరకూ వాట్సాప్‌ గ్రూప్‌ల ద్వారా ఈ విధంగా నడిపేవారు. ఆ తర్వాత టెలిగ్రాంను కూడా వినియోగించారు. అయితే వీటిద్వారా అయితే పోలీసులు కనిపెడుతున్నారనే ఉద్దేశంతో బుకీలు కూడా కొత్త పంథాను ఎంచుకున్నారు. ప్రత్యేకంగా రూపొందించిన యాప్‌ ద్వారానే పందేలను నిర్వహిస్తున్నట్లు సమాచారం.
ఎందుకంత ఉదాసీనత..?
బుకీల, పంటర్ల వివరాలు దాదాపుగా పోలీసులకు తెలిసినప్పటికీ వారిపై ప్రత్యేకంగా నిఘాను పెట్టడంలో పోలీసు వ్యవస్థ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందనే వాదన లేకపోలేదు. గతంలో పట్టుబడిన వారి కదలికలపై పోలీసులు నిఘా ఉంచితే కచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయని పలువురు చెబుతున్నారు. అయితే కొందరు పోలీసులు ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం, మరికొందరు పనిఒత్తిడికి గురై పట్టించుకోకపోవడం వల్లే నిఘా పెట్టడం లేదనేది తెలుస్తోంది. వీరితో పాటుగా మరికొందరు బుకీలకు సహకరిస్తూ ముడుపులు తీసుకుంటున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ట్వంటీ -20 వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌లు ఆరంభమవుతున్నాయంటే చాలు బుకీలు చాలాకాలం నుంచి దానికోసమే ఎదురుచూస్తూ ఉంటారు. అయినా పోలీసులు ఇప్పటివరకూ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో బుకీలను అరెస్టు చేసిన దాఖలాలు పెద్దగా లేకపోవడం పోలీసుల వైఫల్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. ఇప్పటికైనా పోలీసులు వారి కదలికలపై నిఘా పెట్టాలని పలువురు కోరుతున్నారు