ప్రజాశక్తి -కంచరపాలెం : యువతకు ఉద్యోగాలు కల్పించాలని డివైఎఫ్‌ఐ విశాఖ జిల్లా మహాసభలో వక్తలు డిమాండ్‌చేశారు. డివైఎఫ్‌ఐ విశాఖ జిల్లా 15వ మహాసభలు కంచరపాలెంలోని బిఎన్‌ఆర్ భవన్‌లో నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి 120 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఈ మహాసభలకు ముఖ్యఅతిథిగా డివైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి ఎం.సూర్యారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్రంలో బిజెపి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరుద్యోగ సమస్య తీవ్రంగా పెరిగిపోయిందన్నారు. యువతను నిర్వీర్యం చేసే పద్ధతుల్లో పరిపాలన చేస్తున్నారని విమర్శించారు. రెండు కోట్ల ఉద్యోగాలు ఊసే లేదన్నారు. మరోపక్క కులాలు, మతాలు మధ్య చిచ్చు పెడుతూ ఉన్మాదాన్ని సృష్టిస్తున్నారన్నారు. హిందుత్వ వాదంతో లౌకిక వ్యవస్థను దెబ్బతీసేలా భారత రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ సంస్థలను కారు చౌకగా అమ్మేస్తూ ఉద్యోగాల భర్తీ లేకుండా చేస్తున్నారన్నారు. మేకిన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్టార్ట్ ఆఫ్ ఇండియా అని మాయమాటలు చెప్పి పేపర్ ప్రకటనలకే పరిమితం అవుతున్న బిజెపి ప్రభుత్వ విధానాలను యువత తిప్పికొట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమానికి డివైఎఫ్‌ఐ విశాఖ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కె.మహేష్, రాజు, ఉపాధ్యక్షులు శ్రావణ్, ప్రసాద్, గణేష్, నాయకులు శ్యామ్, సురేష్, విజయ తదితరులు నాయకత్వం వహించారు.










