ప్రజాశక్తి - ఆదోని
కొత్త పరిశ్రమలు స్థాపించి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని సిపిఎం పట్టణ కార్యదర్శి లక్ష్మణ్, నాయకులు తిప్పన్న, వీరేష్, నాగరాజు, వెంకటేష్ డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లా సమగ్రాభివృద్ధి కోసం ఈనెల 26 నుంచి 31 వరకు చేపట్టే మహా పాదయాత్రను జయప్రదం చేయాలని పట్టణంలో కాజిపుర, బోయగేరి, మారాఠి గేరి, వడ్డేగేరి ప్రాంతాల్లో కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఖనిజ సంపద ఆధారంగా పరిశ్రమలు ఏర్పాటు చేస్తామన్న పాలకుల వాగ్దానాలు ప్రకటనలకే పరిమితమయ్యాయని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జిల్లాకు ఇచ్చిన హామీ మేరకు చిత్తశుద్ధితో ఇండిస్టీయల్, హబ్‌లు, ఐటి, ఇతర పరిశ్రమలు ఏర్పాటు కోసం నిధులు కేటాయించాలని కోరారు. ఆదోని, ఎమ్మిగనూరులో టెక్స్‌టైల్, లెదర్ పార్కును నిర్మించాలని తెలిపారు. జిల్లా అభివృద్ధికి రూ.10 వేల కోట్లు కేటాయించాలని, జిల్లాలో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం కోసం నిధులు కేటాయించి పనులు ప్రారంభించాలని కోరారు.
కార్యక్రమంలో మాట్లాడుతున్న లక్ష్మణ్










