Jul 31,2022 23:26

బ్రోచర్‌ను విడుదలచేస్తున్న గంగారావు తదితరులు

ప్రజాశక్తి-ఉక్కునగరం : ఉక్కునగరం పరిసర ప్రాంతాలలో నివాసముంటున్న నిరుద్యోగ యువతీయువకులకు శిక్షణతో కూడిన ఉపాధి అవకాశాలు కోసం ఏర్పాటుచేసిన 'జాబ్‌ ఓరియెంటెడ్‌ ఐటి శిక్షణ'ను వినియోగించుకోవాలని 78వ వార్డు కార్పొరేటర్‌ డాక్టర్‌ బి గంగారావు కోరారు. ఉక్కునగరంలోని సిఐటియు కార్యాలయంలో స్టీల్‌ సిఐటియు, క్రోమియం సొల్యూషన్స్‌ ఆధ్వర్యాన ఆదివారం ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో బ్రోచర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా గంగారావు మాట్లాడుతూ, ఐటి సంస్థలలో ఉపాధి కోసం అర్హత, ఆసక్తి కలిగిన సుమారు 30 వేల మంది యువత ఈ పరిసర ప్రాంతాలలో ఉన్నారని తెలిపారు. వారికి ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారమూ అందక ఆందోళన చెందుతున్నారని, వారిలో ఉత్సాహాన్ని పెంపొందించేందుకు ప్రముఖ ఐటి శిక్షణ సంస్థతో సంప్రదించి ఇక్కడ శిక్షణ అందించడం కోసం కృషి చేశామని వివరించారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో సాఫ్ట్‌వేర్‌ సొల్యూషన్స్‌ సభ్యులు దివాకర్‌, స్టీల్‌ సిఐటియు నాయకులు బి.అప్పారావు, పి.శ్రీనివాసరాజు, డిసిహెచ్‌ వెంకటేశ్వరరావు, యు.వెంకటేశ్వర్లు, వి.ప్రసాద్‌, దిలీప్‌ పాల్గొన్నారు.