ప్రజాశక్తి-ఉక్కునగరం ఉక్కునగరం పరిసర ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతకు శిక్షణతో కూడిన ఉపాధి అవకాశాలు కోసం 'జాబ్ ఓరియెంటెడ్ ఐటి శిక్షణ'ను వినియోగించుకోవాలని 78వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ బి గంగారావు సూచించారు. శుక్రవారం. ఉక్కునగరం యూనియన్ కార్యాలయంలో స్టీల్ సిఐటియు, క్రోమియం సొల్యూషన్స్‌తో కలిసి సంస్థ బ్రోచర్‌ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా విలేకర్లతో గంగారావు మాట్లాడుతూ ఐటి సంస్థలలో ఉపాధి కోసం అర్హత, ఆసక్తి ఉన్న సుమారు 30 వేల మంది యువత ఈ పరిసర ప్రాంతాలలో ఉన్నారన్నారు. వారికి ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం అందక ఆందోళన చెందుతున్న పరిస్థితుల్లో వారిలో ఉత్సాహాన్ని మరింతగా పెంపొందించడానికి ప్రముఖ ఐటి శిక్షణ సంస్థను సంప్రదించి, వారిని ఒప్పించి ఈ శిక్షణను ఇక్కడే అందించేలా కృషి చేశామని, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అభ్యర్థించారు.
క్రోమియం సొల్యూషన్స్ డైరెక్టర్స్ ఎ.దివాకర్, ఎస్.సతీష్ మాట్లాడుతూ, శిక్షణను రెండుగా విభజించామని, ఫేజ్- 1లో డేటా సొల్యూషన్స్ పిఎల్/ ఎస్‌క్యూఎల్ శిక్షణ, ఫేజ్-2లో ఫుల్‌స్టాక్ డెవలప్‌మెంట్ శిక్షణలుగా విభజించి, దీనిలో జావా/ జె2ఇఇ, స్ప్రింగ్ బూట్, నోడ్ జెఎస్, యాంగులర్, పైథాన్, పిఎల్/ ఎస్‌క్యూఎల్ తదితర కోర్సుల శిక్షణను ఆగస్టు 15 నుంచి ప్రారంభిస్తున్నామని తెలిపారు. స్థానిక యువతను ప్రోత్సహించేందుకు కార్పొరేటర్ డాక్టర్ బి గంగారావు అభ్యర్థన మేరకు తాము సహకరిస్తున్నామన్నారు.
స్టీల్‌ప్లాంట్ ఎంప్లాయిస్ యూనియన్,సిఐటియు కార్యదర్శి యు.రామస్వామి మాట్లాడుతూ స్థానిక యువత ఉద్యోగ అవకాశాలకు వీటిని నేర్చుకునేందుకు హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాలకు వలస వెళ్తున్నారన్నారు. శిక్షణకు సంబంధించిన వివరాల కోసం స్టీల్‌ప్లాంట్ కార్మికుడు దిలీప్ కుమార్ ఫోన్ నెంబర్లు 70137 44573, 99850 35599 సంప్రదించి తగిన వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు.కార్యక్రమంలో స్టీల్ సిఐటియు నాయకులు బి అప్పారావు, పి శ్రీనివాసరాజు, డిసిహెచ్ వెంకటేశ్వరరావు, యు వెంకటేశ్వర్లు, వి ప్రసాద్ పాల్గొన్నారు.










