Mar 24,2023 23:04

ప్రజాశక్తి-చందర్లపాడు :

నేటి విద్యార్థులు, యువతకు భగత్‌ సింగ్‌ జీవితం స్ఫూర్తిదాయకమని ఆయన ఆశయాలు కొనసాగించాలని కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి చనుమోలు సైదులు, ఎస్‌ఎఫ్‌ఐ నందిగామ డివిజన్‌ కార్యదర్శి గోపి నాయక్‌లు అన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ నందిగామ డివిజన్‌ కమిటీ ఆధ్వర్యంలో భగత్‌ సింగ్‌, రాజ్‌ గురు, సుకుదేవ్‌ల వర్ధంతిని స్థానిక జిల్లా పరిషత్‌ హైస్కూల్‌లో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బ్రిటీష్‌ సామ్రాజ్యావాదానికి వ్యతిరేకంగా, దేశస్వాతంత్య్రం కోసం నూనూగు మీసాల వయస్సులోనే ప్రాణత్యాగం చేసిన వీరకిశోరాలన్నారు. జలియన్‌ వాలా బాగ్‌ దురాగతంతో బ్రిటీష్‌ వారిని గడగడ లాడించిన పోరాట యోధుడు భగత్‌సింగ్‌ అని కొనియాడారు. నేడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలకు, కాషాయకరణ, యుద్ధోన్మాదంకి వ్యతిరేకంగా పోరాడాలని, కార్పొరేట్‌ అనుకూల జాతీయ విద్యావిధానాన్ని రద్దు చేసేంత వరకు, విద్యా ఉపాధి అవకాశాల కోసం భగత్‌ సింగ్‌ జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని పోరాడాలని యువతని కోరారు. ఈ కార్యక్రమంలో చందర్లపాడు సిఐటియు మండల కార్యదర్శి వేల్పుల ఏసోబు,ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు వెంకటేష్‌, హస్సేన్‌, నాయకులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.