యువతకు ఆదర్శం 'కొరటాల'శతజయంతి సందర్భంగా రోగులకు బ్రెడ్లు , పండ్లు పంపిణీ

రాయచోటి : సిపిఎం పొలిట్‌బ్యూరో మాజీ సభ్యులు కొరటాల సత్యనారాయణ నేటి యువతకు ఆదర్శనీయమని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎ. రామాంజులు పేర్కొన్నారు. శతజయంతి మాజీ పొలీస్ బ్యూరో సభ్యులు కామ్రేడ్ కొరటాల శత జయంతి సందర్భంగా స్థానిక ప్రభుత్వాస్పత్రిలో 50 రోగులకు, బాలింతలకు బ్రెడ్లు పండ్లు పంపిణీ చేశారు. ముందుగా ఆస్పత్రిలో కొరటాల చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ కొరటాల సత్యనారాయణ భూస్వామ్య కుటుంబంలో పుట్టి విద్యార్థి దశలోనే ఉద్యమాలు నడిపారని చెప్పారు. అప్పట్లో విద్యార్థి సంఘం జిల్లా నాయకులైన ఎంబి, ఎంహెచ్, ఎల్‌బిజిల సాన్నిహిత్యంతో కమ్యూనిస్టు పార్టీ వైపు ఆకర్షితులై పేదల శ్రేయస్సుకై జీవితాన్ని త్యాగం చేసిన ధన్యజీవి అన్నారు. ఆయన రేపల్లె డివిజన్ పార్టీ కార్యదర్శిగా, జిల్లా కార్యదర్శిగా, రాష్ట్ర కార్యదర్శిగా, కేంద్ర కమిటీ సభ్యులుగా, పొలిట్‌బ్యూరో సభ్యులుగా అంచెలంచెలుగా ఎదిగిన ప్రజానాయకులని పేర్కొన్నారు. రేపల్లె ప్రాంతంలో చేనేత కార్మికుల సమస్యలపై నిరంతరం అలుపెరగని కషి చేశారు అన్నారు. లంకభూముల సమస్యపై నిరంతరం పోరాటాలు నడిపి పేద ప్రజలను సొసైటీలుగా ఏర్పాటు చేసి భూస్వాముల అధీనంలో లంక భూములను పేదలు సాగుచేసుకునేందుకు అనేక పొరాటాల ద్వారా సుసాధ్యం చేశారని తెలిపారు. గుంటూరు జిల్లాలో రైతాంగ ఉద్యమ నాయకులుగా పేద రైతుల సమస్యలపై అనేక పోరాటాలు నిర్వహించారు అన్నారు. సిపిఎంరామాపురం శాఖా కార్యదర్శి కె నాగబసిరెడ్డి మాట్లాడుతూ ప్రజా సమస్యలపై ప్రజలను సమీకరించి పోరాటాలు నడిపేవారు అన్నారు. విద్యార్థి, యువజన, మహిళా నాయకులతో సన్నిహితంగా మెలుగుతూ వారిని పోరాట పథంలో నడిపేందుకు కషి చేశారన్నారు. కారక్రమంలో సిపిఎం నాయకులు మాధవయ్య, రెడ్డిశేఖర్, రమణ, ఆసుపత్రి సిబ్బంది రాజు, వెంకటరమణ, కొండయ్య, మాధవి పాల్గొన్నారు. రాజంపేట అర్బన్ : కొరటాల సత్యనారాయణ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు చిట్వేలి రవికుమార్ అన్నారు. సత్యనారాయణ శత జయంతి సందర్భంగా ఆర్‌అండ్‌బి కార్యాలయంలో నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు నరసింహ సర్వేపల్లి, బి.శివయ్య, వెంకటేష్, ప్రభాకర్, ప్రసాద్ పాల్గొన్నారు.