ప్రజాశక్తి-విఆర్.పురం
పోలవరం నిర్వాసితులు తమ గ్రామాలను ఖాళీ చేసే రోజునే కటాఫ్ డేట్‌గా ప్రకటించి యువతీ యువకులందరికీ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పూనెం సత్యనారాయణ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీకి 2017 సంవత్సరాన్ని కటాఫ్ డేట్‌గా ప్రకటించటం వల్ల అనేక మంది యువతీ యువకులు నష్టపోవాల్సి వస్తుందని తెలిపారు. చివరి నిర్వాసితునికి ఆర్ అండ్ ఆర్, భూమి, నష్టపరిహారం ఇచ్చిన తరువాతే గ్రామాలను ఖాళీ చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సిపిఎం, సిపిఐ కేంద్ర కమిటీల పిలుపు మేరకు మండలంలోని శ్రీరామగిరి పంచాయతీ పరిధి చొక్కనపల్లి గ్రామంలో మంగళవారం రాత్రి సిపిఎం నాయకులు ప్రచార భేరి నిర్వహించారు. ఇందులో భాగంగా గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేశారు. అనంతరం గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంత గిరిజనులకు రాష్ట్ర ప్రభుత్వం చాలా అన్యాయం చేస్తుందని, బోయ వాల్మీకిలను ఎస్టీ జాబితాలో చేర్చడం వల్ల ఇక్కడి గిరిజనులు తీవ్రంగా నష్టపోతారని తెలిపారు. ఈ సమస్యలపై పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు తోడం రాజు, మాజీ సర్పంచ్ బూబమ్మ, వంకు సత్తిబాబు, పోడియం శ్రీరామ్మూర్తి, గుండిపూడి లక్ష్మణరావు, సిహెచ్ హజరత్, నాల్నరపు చందర్రావు తదితరులు పాల్గొన్నారు.
తాగునీటి పథకాలను పునరుద్ధరించాలి
మండలంలోని మారుమూల గిరిజన గ్రామాల్లో తాగునీరు, రోడ్లు, కరెంటు సమస్యలను పరిష్కరించాలని సిపిఎం మండల కార్యదర్శి సోయం చిన్నబాబు డిమాండ్ చేశారు. మండలంలోని చిన్నమటపల్లి పంచాయతీ పరిధి దర్భలంక, సున్నం మట్కా, వెంకంపాలెం గ్రామాల్లో సిపిఎం నాయకులు బుధవారం ప్రచార భేరి నిర్వహించారు. గొంది కన్నయ్య చెరువులో పనిచేస్తున్న ఉపాధి కూలీలను కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా చిన్నబాబు మాట్లాడుతూ మూడేళ్ల నుండి దర్భలంక, సున్నంమట్కా గ్రామాల్లో తాగునీటి ఎద్దడి ఉన్నా అధికారులు పట్టించుకోలేదని తెలిపారు. పెద్ద మట్టపల్లి నుండి వెంకంపాలెం వరకు రోడ్లు గోతులు పడి ఉందని, రాత్రి సమయంలో ఆస్పత్రులకు వెళ్లాలంటే నానా ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ఈ గ్రామాలకు మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల నాయకులు వడ్లాది రమేష్, కుంజ నాగిరెడ్డి, కార్యకర్తలు మడకం లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.










