Jul 06,2023 23:19

ట్రాక్టర్‌ ట్రక్కులో మృతదేహాన్ని ఉంచి ధర్నా చేస్తున్న మృతురాలు సంధ్య బంధువులు

ప్రజాశక్తి- మేడికొండూరు : బాలిక మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ మృతురాలి కుటుంబీకులు, బంధువులు ఆందోళనకు దిగారు. యువతి మృతదే హంతో మండలంలోని పేరేచర్ల జంక్షన్లో గురువారం ధర్నా చేశారు. పేరేచర్లలోని తెల్లక్వారీ కాలనీకి చెందిన తమ్మిశెట్టి సంధ్య (17) గుంటూరు రూరల్‌ మండలం పులకలూరు శివారులోని 10 నంబర్‌ క్వారీ వద్ద బుధవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. మృతదేహానికి పోస్టుమార్టం అనంతరం పోలీసులు.. మృతురాలి కుటుంబీకులకు గురువారం అందించారు. దీంతో ఆ మృతదేహాన్ని ట్రాక్టర్‌పై పేరేచర్ల జంక్షన్‌కు తెచ్చిన బంధువులు 10.30 గంటల నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకూ బైఠాయించారు. గుంటూరు, హైదరాబాద్‌, కర్నూరలు వైపు వెళ్లే ప్రధాన రహదారి ఇదే కావడంతో ఐదు కిలోమీటర్ల వరకూ వాహనాలు భారీగా నిలిచాయి. సమాచారం తెలుసుకున్న సౌత్‌ డీఎస్సీ మెహబూబ్‌బాషా, నల్లపాడు సిఐ శ్రీనివాసరావు ధర్నా వద్దకు చేరుకున్నారు. న్యాయం చేస్తామని హామీనివ్వడంతో ఆందోళన ముగిసింది. మేడికొండూరు పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.
ఎఎస్‌ఐ విధులను ఆటంకపరిచారని కేసు
ఇదిలా ఉండగా ఎఎస్‌ఐ శ్రృనివాసరాజు విధులకు ఆందోళనకారులు ఆటంకం కలిగించారంటూ కొందరిపై కేసు నమోదైంది. ఎఎస్‌ఐ ఫిర్యాదు చేయగా ఎస్‌హెచ్‌ఒ కె.వాసు కేసు నమోదు చేశారు. ఆందోళన కారణంగా రాకపో కలకు అంతరాయం ఏర్పడి పెద్దఎత్తున వాహనాలు నిలిచాయని, 108, ప్రైవేటు అంబులెన్సులు కూడా వెళ్లకుండా అడ్డుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అంబులెన్స్‌లకు దారివ్వాలని, అందులోని రోగులు ఇబ్బంది పడుతున్నారని, ఇతర వహనాల్లోని చిన్నపిల్లలూ ఇబ్బంది పడుతున్నారని ఎఎస్‌ఐ శ్రీనివాసరాజు చెప్పినా వినకుండా ఆయనపైనే దురుసుగా ప్రవర్తించి బూతులు తిట్టారని పేర్కొన్నారు. ఎఎస్‌ఐను పక్కను నెట్టేయడంతోపాటు ఇతర పోలీసుల పట్లా దురుసుగా ప్రవర్తించి విధులను ఆటంకపరిచారని పేర్కొన్నారు. ఈ కారణంగా తమ్మిశెట్టి బెంజిమెన్‌, తమ్మిశెట్టి రాజు, తిరుపతి బాలయ్య, వేముల దావీదు, తమ్మిశెట్టి వెంకటస్వామి, తమ్మిశెట్టి రాములు, మరికొంతమందిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ప్రజలకు, ప్రయాణికులకు ఇబ్బంది కలిగించేలా ఇలాంటి ఘటనలు పునరావృ తమైతే వారిపట్లా కఠిన చర్యలు తీసుకుం టామని ఎస్‌హెచ్‌ఒ హెచ్చరించారు.