ప్రజాశక్తి-నందిగామ
నిరుద్యోగ యువత, విద్యార్థులు ఉద్యోగాలు పొంది ఉన్నత స్థాయికి రావాలని ఎన్టిఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు పేర్కొన్నారు. శనివారం నందిగామలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ చేపట్టిన ఎస్‌ఐ, కానిస్టేబుల్ ఉచిత కోచింగ్ సెంటర్ ను ఎన్టిఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు, విజయవాడ పోలీస్ కమిషనర్ క్రాంతి రాణా టాటా ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా నందిగామ లో నిరుద్యోగ యువతీ యువకులకు ఉచితంగా కోచింగ్ సెంటర్ పెట్టడం అభినందనీయమని తెలిపారు. ఉద్యోగ సాధించాలనే పట్టుదల -కషి తో చదివి విద్యార్థులు తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని కోరారు. పేద విద్యార్థులకు ఉన్నత స్థాయి కోచింగ్ భారం కాకూడదని ఎమ్మెల్యే- ఎమ్మెల్సీలైన మొండితోక బ్రదర్స్ ఉచిత కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేయడం అభినందనీయం అన్నారు. విజయవాడ సిటి పోలీస్ కమిషనర్ క్రాంతి రాణా టాటా మాట్లాడుతూ యువత ఫోన్లు ,టీవీలు, సినిమాలు, షికారులపై దృష్టి సారించకుండా , ఉద్యోగ సాధించి, జీవితంలో ఉన్నత స్థాయికి రావాలి అనే ఆలోచనతో పట్టుదలతో చదవాలని కోరారు. నందిగామ నియోజకవర్గ నిరుద్యోగ యువత, విద్యార్థులు ఉద్యోగాలు పొంది ఉన్నత స్థాయికి రావాలనే ఆలోచన తోనే ఉచిత కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేయటం జరిగిందని నందిగామ ఎంఎల్‌ఎ మొండితోక జగన్మోహనరావు, ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ పేర్కొన్నారు. కోచింగ్ కు అవసరమైన బుక్స్ అండ్ మెటీరియల్ , 70 రోజుల పాటు మధ్యాహ్న భోజనం ఉచితంగా అందజేస్తున్నామని తెలిపారు. దాదాపు 400 మంది విద్యార్థులు తొలిరోజు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యాసంస్థల అధినేతలు కెవిఆర్ రాయప్ప, చైతన్య రమేష్- కార్తీక్, తేజ డివిఆర్ ఆళ్ళ రాంబాబు, జీడి ఎంఎం ప్రసాద్ , కాకతీయ రవీంద్ర , ఆర్డిఓ రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.










