Mar 05,2023 21:23

మాట్లాడుతున్న ముఫ్తి ఖదీర్‌ మౌలానా, చిత్రంలో ఎంఏ.గఫూర్‌, వాహిద్‌ హుస్సేన్‌ తదితరులు

యువత సన్మార్గంలో నడవాలి
- ఆలిండియా మిల్లీ కౌన్సిల్‌ రాష్ట్ర అధ్యక్షులు ముఫ్తి ఖదీర్‌ మౌలానా
ప్రజాశక్తి - నంద్యాల

     యువత పెడధోరణి పట్టకుండా సన్మార్గంలో నడవాలని ఆలిండియా మిల్లీ కౌన్సిల్‌ రాష్ట్ర అధ్యక్షులు ముఫ్తి ఖదీర్‌ మౌలానా పిలుపునిచ్చారు. ఆలిండియా మిల్లీ కౌన్సిల్‌ రాష్ట్ర అధ్యక్షులు ముఫ్తి ఖదీర్‌ మౌలానా నంద్యాల జిల్లా మిల్లీ కౌన్సిల్‌ కార్యాలయాన్ని ఆదివారం సందర్శించారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్యే, ఆవాజ్‌ కమిటీ వ్యవస్థాపకులు ఎంఎ గఫూర్‌, ప్రముఖ పారిశ్రామికవేత్త, మహేంద్ర గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ మేనేజింగ్‌ పార్ట్నర్‌ వాహిద్‌ హుస్సేన్‌లు ఉన్నారు. వీరికి మిల్లీ కౌన్సిల్‌ జిల్లా కార్యదర్శి జిఎం గౌస్‌, సహాయ కార్యదర్శి ఉస్మాన్‌ భాష, పొలిటికల్‌ కార్యదర్శి మస్తాన్‌ ఖాన్‌లు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ముఫ్తి ఖదీర్‌ మౌలానా మాట్లాడుతూ నంద్యాల జిల్లాలో మిల్లి కౌన్సిల్‌ చేయాల్సిన సేవా కార్యక్రమాలను, మిల్లి కౌన్సిల్‌ సభ్యుల పాత్రను తెలియజేశారు. యువత సన్మార్గంలో నడిచేలా, సేవా కార్యక్రమాల్లో వారి వంతు భాగస్వామ్యం ఉండేలా తీర్చిదిద్దుతామన్నారు. అలాగే బెంగళూరుకు చెందిన ఫాల్కనీ యూనివర్సిటీ, ఆల్‌ ఇండియా మిల్లీ కౌన్సిల్‌ సంయుక్తంగా ఉచిత ఉన్నత విద్యను అందించేందుకు స్కాలర్షిప్‌ టెస్టులను కూడా నిర్వహిస్తున్నామని, గత కొన్ని సంవత్సరాలుగా ఈ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. గతేడాది కర్నూలు జిల్లాతో పాటు నంద్యాలలో కూడా స్కాలర్‌ షిప్‌ పరీక్ష ఏర్పాటు చేయగా అందులో నలుగురు విద్యార్థులు ఎంపికై నేడు విద్య, వసతిని ఉచితంగా పొందుతున్నారని పేర్కొన్నారు.