ప్రజాశక్తి-కశింకోట
ప్రభుత్వ ప్రజాస్వామ్య నైతికతను యువత బలపరచాలని ఆదికవి నన్నయ యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ ఆచార్య ముర్రు ముత్యాలనాయుడు పిలుపునిచ్చారు. నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో స్థానిక రాజీవ్‌గాంధీ ఆర్‌ఇసీఎస్ పాలిటెక్నిక్ కళాశాలలో గురువారం జరిగిన 'నైబర్ హుడ్ యూత్ పార్లమెంటు' సదస్సుకు ముత్యాలనాయుడు ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. మంచి భారతదేశం కోసం నాయకులను నిర్మించడంలో విద్యార్ధులు ఉత్ప్రేరకంగా పనిచేయాలని సూచించారు. యువతలో ఉన్న ఉత్సాహం భారత దేశాన్ని ఆర్థికంగా సాధికారత కలిగిన దేశంగా మారుస్తుందన్నారు. ప్రపంచంలోని సమకాలిన సంస్కరణలపై విద్యార్ధులు అవగాహన పెంచుకోవాలని సూచించారు. సమాచారం, డేటా ఆధారిత నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని పెంచడానికి ఎన్‌వైకే ప్రోత్సహిస్తుందని చెప్పారు. ఘన వ్యర్థాల నిర్వహణ, ఆకలి నిర్మూలన, లింగ సమానత్వం, తక్కువ వ్యయంతో పరిశుభ్రమైన ఇంధనం, స్వచ్ఛమైన నీరు, పారిశుధ్యం మెరుగుదల అంశాలపై విద్యార్ధులు దష్టి పెట్టాలని సూచించారు.
అటవీశాఖ విశాఖ రేంజ్ అధికారి బిర్లంగి రామనరేష్, వ్యక్తిత్వ వికాస శిక్షకులు ఎస్‌విఆర్.నాయుడు మాట్లాడుతూ లక్ష్యం స్పష్టంగా లేకపోతే చేసేపని దారీ తెన్నూ లేక అగమ్యగోచరంగా తయారవుతుందని చెప్పారు. నెహ్రూ యువ కేంద్రం జిల్లా అధికారి జి.మహేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో సీనియర్ జర్నలిస్ట్ ఎన్.నాగేశ్వరరావు, ఎన్‌వైకె రాష్ట్ర సలహా కమిటీ సభ్యులు కాండ్రేగుల వెంకటరమణ, కళాశాల ప్రిన్సిపల్ కెఎస్‌విఎన్‌ఎం.అప్పారావు, వైస్ ప్రిన్సిపల్ ఎస్‌ఎఎస్.గణేష్, జాతీయ యువజన అవార్డు గ్రహీత ఆర్.లీలాప్రసాద్, కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ అసిస్టెంట్ డైరక్టర్ షఫీ మహమ్మద్ తదితరులు పాల్గొన్నారు.










