Nov 04,2023 23:09

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం ఉద్యోగ, ఉపాధి రంగాల్లో రాణించాలంటే యువత క్రీడలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని ఎంపి మార్గాని భరత్‌ రామ్‌ పిలుపునిచ్చారు. రాజమహేంద్రవరం కేంద్రంగా ప్రతీ ఏడాది నిర్వహిస్తున్న రాజమహేంద్రవరం ప్రీమియర్‌ లీగ్‌(ఆర్‌పిఎల్‌) క్రికెట్‌ టోర్నమెంటులో పాల్గొనే క్రీడాకారుల వేలం కార్యక్రమం ఎపిఇపిడిసిఎల్‌ ఇంజనీరింగ్‌ గెస్ట్‌ హౌస్‌లో శనివారం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన వేలం ప్రారంభోత్సవ సభలో ఎంపి మార్గాని భరత్‌ రామ్‌ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఐపిఎల్‌ స్థాయిలో రాజమహేంద్రవరం కేంద్రంగా నిర్వహిస్తున్న ఆర్‌పిఎల్‌ క్రికెట్‌ టోర్నమెంటు విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఆర్‌పిఎల్‌ ఛైర్మన్‌ అజ్జరపు వాసు, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ కుంచె శేఖర్‌లు గత ఆరేళ్లుగా క్రమం తప్పకుండా ఈ టోర్నమెంటును నిర్వహించడం అభినందనీయమని అన్నారు. రాజమహేంద్రవరం నగరం పర్యాటక ప్రాంతంగా అభివద్ధి జరుగుతుందని, క్రీడలపరంగా రాజమహేంద్రవరం నగరానికి మంచి గర్తింపు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు. అంతర్జాతీయ స్థాయి క్రికెట్‌ స్టేడియంను నిర్మించాలని తలంచానని, ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో నిర్మించేందుకు చేసిన ప్రయత్నాలకు కొన్ని అడ్డంకులు రావడంతో ఫలించలేదన్నారు. రాబోయే ఎన్నికల నాటికి నాగులచెరువు ప్రాంతంలోని స్టేడియంలో గ్రీన్‌ కార్పెట్‌ గ్రౌండ్‌గా తీర్చిదిద్దడంతోపాటు, ఫ్లడ్‌లైట్లను ఏర్పాటు చేసేందుకు అవసరమైన చర్యలను తీసుకుంటున్నట్లు చెప్పారు. అలాగే పోలీసు గ్రౌండ్‌లో ఇప్పటికే గ్రీన్‌ కార్పెట్‌గా తీర్చిదిద్దారని, ఎంపి నిధులు ఒక కోటి రూపాయలతో ఫ్లడ్‌లైట్లు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. దేశంలోని ఎనిమిది రాష్ట్రాలకు చెందిన 400 మంది క్రీడాకారులు, సుమారు 20 జట్లుతో ఈ టోర్నమెంటు సాగనుందని ఆర్‌పిఎల్‌ ఛైర్మన్‌ అజ్జరపు వాసు తెలిపారు. తాను ఏ కార్యక్రమం తలపెట్టినా అందులో తన స్నేహితులే ప్రధాన భూమిక పోషిస్తారని, ఎంపి మార్గాని భరత్‌ రామ్‌ అందిస్తున్న సహాకారం తమ కార్యక్రమాలకు మరింత ఊతంగా నిలుస్తున్నాయని అన్నారు. స్వర్ణాంధ్ర నిర్వాహకులు గుబ్బల రాంబాబు మాట్లాడుతూ మానసిక ఉల్లాసం..శారీరక దారుఢ్యంకు క్రీడలు దోహదం చేస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు మానె దొరబాబు, చంటి, కుంచె శేఖర్‌, మణికంఠరెడ్డి, వినరు, తదితరులు పాల్గొన్నారు.