- జోన్-2 క్రీడా సంబరాలను ప్రారంభించిన కలెక్టర్
ప్రజాశక్తి-ఎడ్యుకేషన్: యువతలో క్రీడా స్పూర్తిని నింపి అంతర్జాతీయ క్రీడా కారులుగా తీర్చిదిద్దేందుకు జగనన్న క్రీడా సంబరాలను నిర్వహించి ప్రతిభ కనపరిచిన క్రీడాకారులకు నగదు ప్రోత్సహాకాలను అందిస్తుందని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు అన్నారు. జగనన్న క్రీడా సంబరాలలో భాగంగా జోన్-2 పరిధిలోని క్రీడాకారులకు స్థానిక ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహిస్తున్న జోనల్ లెవల్ క్రీడా పోటీలను మంగళవారం శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్దార్థరెడ్డితో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ అంతర్జాతీయ స్థాయి క్రీడలలో రాణించి రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతలు తీసుకువచ్చిన క్రీడాకారులలో ఎక్కువ మంది ఎన్‌టిఆర్ జిల్లాకు చెందిన వారు కావడం గర్వించదగిన విషయమన్నారు. క్రీడాకారులలో దాగివున్న ప్రతిభను వెలికతీసి ఉత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం క్రీడా రంగాన్ని ప్రోత్సహిస్తుందన్నారు. జోన్-2 పరిధిలోని తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, కృష్ణా ఎన్‌టిఆర్ జిల్లాల కబడ్డీ క్రీడాకారులకు మహిళా పురుషుల విభాగంలో కబడ్డీ పోటీలను ఎన్‌టిఆర్ జిల్లాలో నిర్వహించడం అభినందనీయమన్నారు. రాష్ట్ర క్రీడా ప్రాధికారి సంస్థ చైర్మన్ బైరెడ్డి సిద్దార్థ రెడ్డి మాట్లాడుతూ క్రీడలు జీవితంలో భాగంగా ఉండాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహించి ప్రత్యేక నిధులను కేటాయిస్తుందన్నారు. దీనిలో భాగంగా గ్రామ స్థాయిలో జగనన్న స్పోర్ట్స్ క్లబ్బులు, ప్రతి క్రీడకు ఒక సంక్షేమ సంఘం ఏర్పాటు చేశామన్నారు. తొలుత జిల్లా కలెక్టర్, నగర మేయర్, శాసనసభ్యులు క్రీడాకారులతో కలిసి కబడ్డీ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, స్థానిక శాసనసభ్యులు మల్లాది విష్ణువర్థన్, స్థానిక కార్పొరేటర్ కె.అనిత, డిఎస్‌ఎ సిఇవో యు శ్రీనివాసరావు, ఛీఫ్ కోచ్ ఎస్‌ఏ అజీజ్ పాల్గొన్నారు.










