చరిత్రలో క్లిష్టమైన పరిస్థితుల్లో యువత నిర్వహించిన పాత్రను వివరిస్తూ, విద్యార్థులకు ప్రేరణ కలిగించేలా పంజాబ్ విద్యార్థి సంఘం ద్వితీయ మహాసభలకు భగత్‌సింగ్ తన సందేశాన్ని వినిపించారు. ఇందులో భాగంగా స్వాతంత్య్ర ఉద్యమంలో విద్యార్థుల పాత్రను వివరించారు. అంతేకాకుండా రాజకీయంగా పంజాబ్‌ను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యతను గుర్తుచేశారు. దేశం పట్ల అపారమైన అంకితభావంతో అమరుడైన జతిన్‌దాసును ప్రేరణగా చూపిస్తూ యువతలో ధైర్యాన్ని నింపారు. స్వాతంత్య్ర పోరాట సందేశాన్ని దేశం నలుమూలలకూ చేరవేసే మహత్తర బాధ్యతను యువత భుజాలపై ఉంచారు.
పంజాబ్ విద్యార్థి సంఘం ద్వితీయ మహాసభలు 1929 అక్టోబరు 19న సుభాష్ చంద్రబోస్ అధ్యక్షతన జరిగాయి. భగత్‌సింగ్ ఈ సభలకు ఒక సందేశం పంపించారు. 1930-31లో రానున్న పోరాటంలో మనస్ఫూర్తిగా పాల్గొని, విప్లవసందేశం తీసుకెళ్లాల్సిందిగా పిలుపునిచ్చారు. బటుకేశ్వర్‌దత్ కూడా సంతకం చేసిన ఈ సందేశాన్ని మహాసభలో చదివి వినిపించారు. దానికి విద్యార్థుల నుంచి అపూర్వమైన స్పందన వచ్చింది. వారు 'భగత్‌సింగ్ జిందాబాద్!' అంటూ పెద్ద ఎత్తున నినదించారు.
''ఇప్పుడు మేము యువతను తుపాకులు, బాంబులు తీసుకోమని పిలుపివ్వలేము. విద్యార్థులు అంతకుమించిన పెద్ద బాధ్యత తీసుకోవాల్సి ఉంది. త్వరలో జరగనున్న లాహోరు కాంగ్రెసు మహాసభ స్వాతంత్య్రం కోసం భీషణ పోరాటానికి పిలుపివ్వనున్నది. దేశ చరిత్రలో క్లిష్టతరమైన ఈ సమయంలో యువత భుజాలపై చరిత్ర ఒక మహత్తర బాధ్యతను తెచ్చిపెట్టింది. విద్యార్థులు ఈ స్వాతంత్య్ర పోరాటంలో ముందుభాగాన నిలబడి, మృత్యువును ఎదుర్కొన్నమాట యథార్థం. నిర్ణయాత్మకమైన ఈ తరుణంలోనూ అదే రీతిలో విద్యార్థులు ధృఢంగా, ఆత్మవిశ్వాసంతో నిలబడటానికి వెనుకాడే ప్రసక్తి ఉంటుందా? యువజనులు విప్లవ సందేశాన్ని దేశం నలుమూలలకీ చేర్చాలి. పారిశ్రామిక ప్రాంతాల్లోని మురికివాడలోన్లూ, పల్లెసీమల్లో శిథిలావస్థలోని పూరిపాకల్లోనూ బతుకులీడ్చే కోటానుకోట్ల ప్రజాబాహుళ్యంలో విప్లవ చైతన్యం తీసుకురావాలి. ఆ విధంగానే మనకు స్వాతంత్య్రం సిద్ధిస్తుంది. అప్పుడు ఒక మనిషిని మనిషి దోచుకునేందుకు అవకాశం లేకుండా పోతుంది. ఇతరత్రా చూసినా పంజాబ్ రాజకీయ రంగంలో వెనుకబడి ఉన్నట్టు పరిగణిస్తుంటారు. ఈ బాధ్యత కూడా పంజాబీ యువజనులదే. దేశం పట్ల అపారమైన అంకితభావంతోనూ అమరవీరుడు జతిన్‌దాసు ప్రేరణతోనూ యువజనులు ఈ స్వాతంత్య్ర పోరాటంలో తాము సైతం చెక్కుచెదరకుండా నిలిచి పోరాడగలమని రుజువు చేసుకోవాలి!'' అని ఆ సందేశంలో భగత్‌సింగ్ యువతకు పిలుపునిచ్చారు.