జనసేన రాజకీయ వ్యవహారాల ఇన్‌ఛార్జి నాదెండ్ల మనోహర్
ప్రజాశక్తి- సీతమ్మధార : యువతరంలోని శక్తిని, నైపుణ్యాలను వెలికితీసి, వారికి భవిష్యత్‌పై భరోసా కల్పించేలా దిశానిర్ధేశం చేసే లక్ష్యంతోనే జనసేన ఆధ్వర్యాన 'యువశక్తి' కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. శుక్రవారం పబ్లిక్ లైబ్రరీలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, స్వామి వివేకానంద జయంతి సందర్భంగా జనవరి 12న శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జనసేనాని పవన్‌కల్యాణ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి, యువత కోసం భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాలు, వలసల నిరోధానికి చర్యలపౖుె ప్రసంగిస్తారన్నారు. ఈ ప్రాంత అభివృద్ధి కోసం కష్టపడిన ప్రతి ఒక్కరినీ ఈ వేదిక మీదకు తీసుకొస్తామన్నారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో జనసేన బృందం పర్యటన సందర్భంలో అక్కడి యువత ఉపాధి కోసం సొంతూళ్లు, తల్లిదండ్రులను వదలి అయిష్టంగానే ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లడం, అక్కడి స్థానికుల ఉపాధిని హరించడం ఇష్టలేదనే అభిప్రాయాన్ని వ్యక్తీకరించిన నేపథ్యంలో ఈ విషయాన్ని పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్లగా, ఆయన యువశక్తి కార్యక్రమం వెల్లడించారన్నారు.
పేదల ఇళ్ళ విషయంలో వైసిపి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, జగన్నన్న కాలనీ ఒక పెద్ద కుంభకోణమన్నారు. మూడు నెలల్లో ఎపి ఆస్తులను తెలంగాణకు కట్టబెట్టేసి, ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రమైతే బాగుంటుందని ప్రజలను అయోమయస్థితిలోకి నెట్టుతున్నారని విమర్శించారు. విజయవాడలో బిసి గర్జనకు ఆర్‌టిసి బస్సులను తరలించడం ద్వారా ఎపిఎస్‌ఆర్‌టిసిని వైఎస్‌ఆర్‌టిసిగా మార్చేశారని ఎద్దేవా చేశారు. సమావేశంలో జనసేన పిఎసి సభ్యులు కోన తాతారావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు టి.శివశంకర్, పెదపూడి విజరు కుమార్, కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్, పార్టీ నేతలు పరుచూరి భాస్కరరావు, సందీప్ పంచకర్ల, పివిఎస్‌ఎన్.రాజు, పసుపులేటి ఉషా కిరణ్, వంపూరు గంగులయ్య, కల్యాణం శివ శ్రీనివాస్, గడసాల అప్పారావు, ఎ.దుర్గా ప్రశాంతి, డా.మూగి శ్రీనివాస్, నాగలక్ష్మి, శరణి పాల్గొన్నారు.










