Jan 27,2022 06:21

జస్టిస్‌ నజీర్‌ ప్రసంగంలో రెండు బలహీనతలు వున్నాయి: వాస్తవానికి, భారతీయ నాగరికత, దాని చట్టబద్ధమైన వారసత్వాన్ని ఆయన ఏకపక్షంగా నొక్కి చెప్పడం తప్పు. ప్రాచీన భారత దేశంలో న్యాయ కోవిదులుగా, ఆరాధ్యులుగా ఆయన ఉదాహరించిన మనువు, కౌటిల్యుడు, కాత్యాయనుడు, బృహస్పతి, యజ్ఞవాల్క్యుడు బ్రాహ్మణవాద వివరణలకు ప్రసిద్ధి చెందినవారు. ఎందుకో గాని ... సర్వమానవ సమానత్వానికి, మానవత్వానికి
ప్రతీకగా నిలిచిన భౌద్ధ, జైన ధర్మ శాస్త్రాలను ఆయన ఉదహరించలేదు.


జస్టిస్‌ ఎస్‌. అబ్దుల్‌ నజీర్‌ భారత సుప్రీంకోర్టులో సుదీర్ఘకాలంగా సేవలందిస్తున్న న్యాయమూర్తి. 2021 డిసెంబర్‌ 26న హైదరాబాద్‌లో జరిగిన 16వ అఖిల భారతీయ అధివక్త పరిషత్‌ (ఎ.బి.ఎ.పి) జాతీయ కౌన్సిల్‌ సమావేశంలో ఆయన 'వలస కాలం నాటి భారతీయ న్యాయ వ్యవస్థను సమూలంగా మార్చడం'పై ప్రసంగించారు. రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఫ్‌ు (ఆర్‌.ఎస్‌.ఎస్‌) అనుబంధ సంస్థ నిర్వహించిన ఆ కార్యక్రమంలో ఆయన చేసిన ప్రసంగం ఆశ్చర్యం కలిగించింది.
ఏ కారణంగానో న్యాయమూర్తి ప్రసంగాన్ని ఎ.బి.ఎ.పి తన వెబ్‌సైట్లో పెట్టలేదు. కానీ ఒక ప్రముఖ లీగల్‌ పోర్టల్‌ ఆయన పూర్తి ప్రసంగాన్ని తన వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచింది. భారతీయ ప్రజలకు అనుగుణంగా లేని భారతీయ న్యాయ వ్యవస్థ వలసకాలం నాటిదని, దానిని అత్యవసరంగా భారతీయీకరణ చేయాలని జస్టిస్‌ నజీర్‌ పేర్కొన్నారు. ప్రాచీన భారతదేశం లోని మనువు, కౌటిల్యుడు, కాత్యాయనుడు, బృహస్పతి, నారదుడు, యజ్ఞవాల్క్యల న్యాయ సాంప్రదాయాల విజ్ఞానాన్ని భారతీయ న్యాయ వ్యవస్థ అలక్ష్యం చేస్తున్న ఫలితంగా మన జాతి ప్రయోజనాలకు వ్యతిరేకంగా, మన రాజ్యాంగానికి హాని కలిగించే వలసకాలం నాటి న్యాయ వ్యవస్థను అంటి పెట్టుకుందని అన్నారు. భారతదేశంలో అప్పటికే ఉనికిలో మహోన్నతమైన న్యాయ వ్యవస్థ ఉన్నప్పటికీ, దాడులు, దురాక్రమణల ద్వారా విదేశీ న్యాయ వ్యవస్థను మనపై విధించారని, 2021 నాటికి కూడా అదే వలసకాలం నాటి న్యాయ వ్యవస్థను కొనసాగించడం విచారకరమని ఆయన అన్నారు.
నేరస్తులకు బహిరంగంగా శిక్షను విధించిన మనువును జస్టిస్‌ నజీర్‌ అహేతుకంగా గుర్తు చేసుకున్నారు. సర్వోన్నత న్యాయస్థానంలో విశేషానుభవం గల న్యాయమూర్తి బహిరంగ శిక్షా విధానాన్ని శ్లాఘించడం దురదృష్టకరం. చట్ట వ్యతిరేకంగా జరిగే మూక హత్యలు, వెంటాడి, వేటాడి పట్టుకొని శిక్షించే చర్యలు గత నిరంకుశ పాలనలో, ఇప్పుడు కూడా అమలులో ఉన్నాయనే విషయాన్ని ఆయన పూర్తిగా విస్మరించారు. వాస్తవానికి, పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసించిన వారి పేర్లను బహిరంగ పరచటం అంటే, ప్రజల గోప్యతలో అహేతుకంగా జోక్యం చేసుకొని, ఆర్టికల్‌ 21ని ఉల్లంఘించడమేనని అలహాబాద్‌ హైకోర్టు మార్చి 2020లో వెలువరించిన తీర్పులో పేర్కొంది. వాస్తవాలు తెలియాలంటే జస్టిస్‌ నజీర్‌ వాదనలను, తాను అభిమానించే ఇద్దరు భారతీయ మేథావులైన మనువు, కౌటిల్యుని అసలు రచనలతో పరిశీలించాల్సిన అవసరం ఉంది.
మనుస్మృతి
మనుస్మృతి లోని కొన్ని చట్టాలు శూద్రులను హీనంగా చూసే విధానం ఇలా వుంది. 1. ప్రపంచ శ్రేయస్సు కోసం, దేవుడు బ్రాహ్మణులను నోటి నుంచి, క్షత్రియులను భుజాల నుండి, వైశ్యులను తొడల నుండి, శూద్రులను పాదాల నుండి సృష్టించాడు. 2. శూద్రులు, మిగిలిన ముగ్గురికి సేవ చేసే పనిని దేవుడు వారికి అప్పగించాడు. 3. ఒకవేళ శూద్రుడు అహంభావంతో బ్రాహ్మణుల బాధ్యతల గురించి బోధిస్తే, రాజు అతని చెవిలో, నోటిలో వేడి నూనెను పొయ్యాలి. 4. ఒక అగ్ర కుల వ్యక్తితో సమానంగా ఆసీనుడయ్యే ఒక నిమ్న కులానికి చెందిన వ్యక్తి తొంటి పైన వాతలు పెట్టాలి. లేదా దేశ బహిష్కరణ చేయాలి. లేదా అతని పిరుదులపై గాట్లు పెట్టాలి.
మనుస్మృతి లోని కొన్ని చట్టాలు మహిళలను హీనంగా చూసే విధానం ఇలా వుంది. 1. మహిళలు రాత్రి, పగలు కుటుంబం లోని పురుషులపై ఆధారపడి ఉండాలి. ఒకవేళ వారు ఇంద్రియ సుఖాలను పొందాలనుకుంటే, ఒక్కరి అదుపు లోనే ఉండాలి. 2. మహిళ తండ్రి ఆమెను బాల్యంలో రక్షిస్తాడు. భర్త యవ్వనంలో రక్షిస్తాడు. కుమారులు తన వృద్ధాప్యంలో రక్షిస్తారు. అంతేతప్ప ఒక మహిళ స్వతంత్రంగా ఉండడం కుదరదు. 3. మహిళలు అందం గురించి పట్టించుకోకూడదు. వయసు గురించి ఆలోచించకూడదు. 'అతనొక పురుషుడు' అంతే చాలు, తమను తాము అందానికి, అంద విహీనానికి అర్పించుకోవాలి. 4. వారిని సృష్టించే సమయంలో మనువు మహిళలకు అపరిశుద్ధమైన కోరికలను, ఆగ్రహాన్ని, నీతిమాలినతనాన్ని, అసూయను, చెడు ప్రవర్తనను ఆపాదించాడు.
'మన హిందూ జాతికి చెందిన వేదాల తరువాత ఆరాధించదగినది మనుస్మృతి'' అని వి.డి. సావర్కర్‌ ప్రకటించాడు. నవంబర్‌ 26, 1949 నాడు భారత రాజ్యాంగ పరిషత్‌ రాజ్యాంగాన్ని ఆమోదించిప్పుడు, ఆర్‌.ఎస్‌.ఎస్‌ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. 'ప్రాచీన భారతంలోని ప్రత్యేకమైన రాజ్యాంగ అభివృద్ధిని గురించి మన రాజ్యాంగంలో ప్రస్తావించలేదు. నేటికీ కూడా మనుస్మృతిలో స్పష్టంగా వివరించబడిన చట్టాలు ప్రపంచాన్ని ప్రశంసించడానికి ప్రేరేపించి, విధేయతను, అంగీకారాన్ని బయటకు తీస్తాయి. కానీ, మన రాజ్యాంగ పండితులకు మాత్రం ఇవేవీ లెక్కలో లేని విషయాలని'' నవంబర్‌ 30, 1949న ఆర్‌.ఎస్‌.ఎస్‌ పత్రిక 'ఆర్గనైజర్‌' సంపాదకీయంలో పేర్కొన్నారు.
కౌటిల్యుడు - అర్థశాస్త్రం
బి.జె.పి, తన అధికార వెబ్‌సైట్లో, ఆర్‌.శ్యామ్‌ శాస్త్రి ఇంగ్లీష్‌ లోకి అనువదించిన కౌటిల్యుని అర్థశాస్త్రాన్ని అందుబాటు లోకి తెచ్చింది. 'అధ్యయనం చేయడం, బోధించడం, యజ్ఞయాగాదులు నిర్వహించడం, ఇతరులు చేసే యజ్ఞాలలో మత క్రతువులను నిర్వహించడం, బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం బ్రాహ్మణుని విధి. అధ్యయనం చేయడం, యజ్ఞయాగాదులు చేయడం, బహుమతులు ఇవ్వడం, యుద్ధాలు చేయడం, జీవితాలను రక్షించడం క్షత్రియుని విధి. అధ్యయనం చేయడం, యజ్ఞాలు చేయడం, బహుమానాలు ఇవ్వడం, వ్యవసాయం చేయడం, పశుపోషణ, వ్యాపారం చేయడం వైశ్యుని విధి. పై మూడు వర్గాలకు రెండు జన్మలపాటు సేవచేయడం, వ్యవసాయం, పశుపోషణ, వ్యాపారం, చేతివృత్తులు చేయడం శూద్రుని విధి'' అని కౌటిల్యుడు తన అర్థశాస్త్రంలో కుల వ్యవస్థను బలపరిచాడు.
కౌటిల్యుని దృష్టిలో రాజు ఒక క్రూర నియంతగా ఉండాలి. 'ఇంద్రుడు (బహుమతులు ఇచ్చేవాడు), యముడు (శిక్షించే వాడు), వీరిరువురి విధులు రాజు విధుల్లో సమ్మిళితం అవుతాయి. శిక్షలను అమలు చేసేది, బహుమతులు ఇచ్చేవాడు అందరికీ కనిపించే రాజు మాత్రమే. రాజును లెక్కచేయని వారిని తీవ్రమైన శిక్షలకు గురిచేయవచ్చు. కాబట్టి రాజును ఎవ్వరూ అలక్ష్యం చేయకూడదు. ఆ విధంగా అధికారానికి వ్యతిరేకంగా ఉండే ప్రతీఘాత శక్తుల నోళ్ళు మూయిస్తారు. ఒక వ్యక్తి నేరం చేశాడని రుజువైతే, అతనిపై చిత్రహింసలకు గురి చేసి శిక్షిస్తారు'. కౌటిల్యుడు సిగ్గుమాలిన తనంతో జాతి వెలి విధానాన్ని విధించాడు. ఆయన చెప్పిన దాని ప్రకారం.. 'రాజుగారి కొలువులో ఉండే గురువులు, పురోహితులు, మంత్రులు తూర్పు దిక్కునున్న రాజభవనానికి ఉత్తరాన ఉన్న స్థలాల్లో ఉంటే, పడమర దిక్కున వస్తువులు తయారు చేసే చేతి వృత్తిదారులతో పాటు శూద్రులు నివాసం ఏర్పరచుకుంటారు'.
రాజ్యాంగానికి అవమానం
ఇలాంటి అమానవీయ న్యాయ వ్యవస్థను శ్లాఘిస్తూ, రాజ్యాంగబద్దంగా ఏర్పరచిన న్యాయ వ్యవస్థను తీవ్రంగా, బహిరంగంగా ఖండించడం ద్వారా జస్టిస్‌ నజీర్‌ 'రాజ్యాంగం మీద విశ్వాసాన్ని, విధేయతను కలిగి ఉంటానని, రాజ్యాంగాన్ని, చట్టాలను సమర్థిస్తానని' చేసిన ప్రమాణాన్ని ఉల్లంఘించాడు. ఆయన ప్రసంగం రాజ్యాంగ పరిషత్‌ అందించిన తోడ్పాటును, కృషిని అవమానించింది.
జస్టిస్‌ నజీర్‌ ప్రసంగంలో రెండు బలహీనతలు వున్నాయి: వాస్తవానికి... భారతీయ నాగరికత, దాని చట్టబద్ధమైన వారసత్వాన్ని ఆయన ఏకపక్షంగా నొక్కి చెప్పడం తప్పు. ప్రాచీన భారతదేశంలో న్యాయ కోవిదులుగా, ఆరాధ్యులుగా ఆయన ఉదాహరించిన మనువు, కౌటిల్యుడు, కాత్యాయనుడు, బృహస్పతి, యజ్ఞవాల్క్యుడు బ్రాహ్మణవాద వివరణలకు ప్రసిద్ధి చెందినవారు. ఎందుకో గాని సర్వమానవ సమానత్వానికి, మానవత్వానికి ప్రతీకగా నిలిచిన భౌద్ధ, జైన ధర్మ శాస్త్రాలను ఆయన ఉదహరించలేదు.
బౌద్ధ, జైన ధర్మ శాస్త్రాలు
ప్రముఖ న్యాయవాది, భారతీయ ధర్మశాస్త్ర చరిత్ర పరిశోధకుడు రాహుల్‌ శ్యామ్‌ భండారీ బౌద్ధమతం ఆధ్వర్యంలో ఉన్న న్యాయ వ్యవస్థపై మొదటిసారి పరిశోధన చేశాడు. భండారీ సమాచారం ప్రకారం, ఒకే వ్యక్తికి సంపూర్ణమైన అధికారాన్ని ఇవ్వకూడదని బుద్ధుడు ప్రచారం చేశాడు. జైనం కూడా మహిళలను తక్కువ చేసి చూడని ఒక విస్తృతమైన న్యాయ వ్యవస్థను కలిగి ఉంది. క్రీ.పూ 367-298కి చెందిన భద్రబాహు, మహిళలకు వారసత్వ హక్కులను కల్పించిన 'భద్రబాహు సంహిత'ను రచించాడు. ఒకవేళ ఒక వ్యక్తి మరణిస్తే, అతనికి చెందిన ఆస్తి (కొడుకు ఉన్నా లేకున్నా) వితంతువయిన అతని భార్యకు చెందేది. పురుషులకు ఈ విషయంలో ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వలేదు.
జస్టిస్‌ నజీర్‌ ఆధునిక కాలానికి ముందున్న న్యాయ వ్యవస్థను...రాజ్యాంగ పరిషత్‌ ఆమోదించిన న్యాయ వ్యవస్థ కంటే ఉన్నతమైనదిగా శ్లాఘించారు. సమ న్యాయ పాలన, సహజ న్యాయం, న్యాయ వ్యవస్థ యొక్క స్వతంత్రతపై ఆధారపడిన న్యాయ వ్యవస్థలను మనువు, కౌటిల్యుడు సమర్థించారని చెప్పడం చాలా పెద్ద తప్పిదం. ఆనాడు అలాంటి వ్యవస్థలు ఉనికిలో లేవు. ఆ కాలంలో పంచ పాండవులు జూదంలో అన్ని హక్కులను, వారి రాజ్యాన్ని, ఆస్తులను, ఆఖరికి వారి ఉమ్మడి జీవిత భాగస్వామి ద్రౌపదిని పణంగా పెట్టారు. ఒకవేళ చట్టబద్ధమైన పాలన, సహజ న్యాయం జరిగి ఉంటే ఇలాంటి దారుణమైన ఘటన జరిగి ఉండేది కాదు.
సువర్ణ చారిత్రక (అనేక మంది చరిత్రకారుల అనుమానాలతో కూడిన) కాలానికి తిరిగి వెళ్ళాలన్న జస్టిస్‌ నజీర్‌ పిలుపు వల్ల ముప్పు వాటిల్లుతుంది. ఇరవయ్యవ శతాబ్దం మధ్య కాలంలో సామ్రాజ్యవాద శక్తులకు వ్యతిరేకంగా వలసవాద ప్రభావం నుంచి బైటపడే ప్రక్రియ ప్రారంభమైంది. అందుకు అనేకమంది ప్రజలు ప్రాణ త్యాగాలు చేశారు. సామ్రాజ్యవాద, భూస్వామ్య, పెట్టుబడిదారీ దాస్య శృంఖలాలను తెంచుకొని, ప్రగతిశీల, సర్వమానవ సమానత్వంతో కూడిన ఒక హేతుబద్ధమైన రాజ్య వ్యవస్థను నెలకొల్పడం దాని లక్ష్యం. భారత రాజ్యాంగం, దేశం లోని న్యాయ వ్యవస్థను ఏర్పాటు చేయడం సరైనది. వీటిని మానవీయ కోణంలో ముందుకు తీసుకొని పోవడమే సరైన పరిష్కారం. అంతే తప్ప...రాజులు, రాజ్యాల గాథల్లోలా రక్షణ కోసం శరణు కోరడం పరిష్కారం కాదు.
ఇప్పటికే ఆర్‌.ఎస్‌.ఎస్‌, బిజెపి పాలనలో ప్రమాదంలో పడిన భారత ప్రజాస్వామ్య లౌకిక రాజ్యానికి జస్టిస్‌ నజీర్‌ ప్రసంగం ఒక హెచ్చరిక. ఎన్నికల్లో సాధించిన పూర్తి మెజారిటీ ద్వారా రాజ్యాంగ విలువల సంరక్షణను గాలికి వదిలి, వారు పార్లమెంట్‌ ను ఒక చర్చా వేదికగా కాక, ఒక నోటీస్‌ బోర్డ్‌గా మార్చి వేశారని ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ప్రతాప్‌ భాను మెహతా అభిప్రాయపడ్డారు. ఇలాంటి క్లిష్టమైన సమయంలో...న్యాయ వ్యవస్థ, ముఖ్యంగా సర్వోన్నత న్యాయస్థానం ఈ హిందూత్వ అరాచకాలను అదుపు చేయాలని ఆశిద్దాం.
( 'ఫ్రంట్‌ లైన్‌' సౌజన్యంతో )

యువరానర్‌...మాకు అభ్యంతరం వుంది...

- షామ్ సుల్ ఇస్లాం