ప్రజాశక్తి-నెల్లూరు :యువతలో జాతీయ సమైక్యత, మతసామరస్యం, ధైర్య సాహసాలు, సోదర భావం పెంపొందించడమే యువజన ఉత్సవాల ప్రధాన లక్ష్యమని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ పేర్కొన్నారు. గురువారం నగరంలోని అంబేద్కర్ భవన్లో స్వామి వివేకానంద కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన జిల్లాస్థాయి యువజన ఉత్సవాల్లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ 1955 సంవత్సరం నుంచి జాతీయస్థాయి యువజన ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఆమె చెప్పారు. జిల్లాస్థాయి యువజన ఉత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న వివిధ క్రీడా పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనాలని ఆమె పిలుపునిచ్చారు. జిల్లాస్థాయి, రాష్ట్రస్థాయి క్రీడా పోటీల్లో ప్రతిభ చూపి జాతీయస్థాయిలో ఆంధ్ర రాష్ట్ర గౌరవాన్ని ఇనుమడింపచేయాలని ఆమె ఆకాంక్షించారు. తొలుత స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సెట్నల్ సిఇఒ నాగరాజకుమారి పాల్గొన్నారు.










