ప్రజాశక్తి-నర్సీపట్నంటౌన్: నిందితులను తక్షణమే అరెస్టు చేయాలని మహిళా సంఘం ప్రతినిధులు అనకాపల్లి జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీలకు వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా రెల్లి మహిళా హక్కుల సాధన కమిటీ అధ్యక్షురాలు నిరపల్లి లలితకుమారి, కార్యదర్శి పిల్లా జ్యోతి నర్సీపట్నంలో విలేకరులతో మాట్లాడుతూ, దళిత మహిళ బంగారు లక్ష్మిని ప్రేమ పెళ్లి పేరుతో మోసం చేసి ముఖం చాటేసిన అగ్రకులానికి చెందిన మాకవరపాలెం మండలం బయ్యవరం గ్రామానికి చెందిన అనిమిరెడ్డి ఆనంద్ కుమార్, అతని తల్లి తులసీపై ఎలమంచిలి టౌన్ పోలీస్ స్టేషన్ లో అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు పట్టించుకోలేదన్నారు. గత నెలలో వీరిపై అట్రాసిటీ కేసు నమోదైతే ఇంత వరకు అరెస్టు చేయకుండా పోలీసులు నిందితులకు కొమ్ము కాస్తున్నారన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తక్షణమే అరెస్టు చేసి బాధితులకు న్యాయం చేసి రక్షణ కల్పించాలని లేకుంటే ఆందోళన ఉదృతం చేస్తామన్నారు.










