Nov 11,2022 22:09

ఉత్సాహపూరిత వాతావరణంలో ఏలూరు సెయింట్‌ థెరిస్సా కళాశాలలో నిర్వహణ
ప్రజాశక్తి - ఏలూరు అర్బన్‌

            జిల్లాస్థాయి యువజనోత్సవాలు ఉత్సాహపూరిత వాతావరణంలో శుక్రవారం ప్రారంభమయ్యాయి. స్థానిక సెయింట్‌ థెరిస్సా కళాశాలలో శుక్రవారం నిర్వహించిన జిల్లాస్ధాయి యువజనోత్సవాలను శాసన మండలి సభ్యులు షేక్‌ సాబ్జీ, దెందులూరు శాసన సభ్యులు కొఠారు అబ్బయ్య చౌదరి, జిల్లా రెవెన్యూ అధికారి ఎవివి.సత్యనారాయణ మూర్తి ప్రారంభించారు. తొలుత మౌలానా అబ్దుల్‌ కలాం అజాద్‌ 135వ జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అదేవిధంగా స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా రెవిన్యూ అధికారి ఎవివి.సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ యువత మంచి మార్గం వైపు పయనించేందుకు యువజనోత్సవాలు దోహదపడతాయన్నారు. ప్రతిఏట జనవరి 12న స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని జాతీయ యువజనోత్సవాలు నిర్వహించబడతాయని ఇందులో జిల్లాయువత ప్రతిభ కనబరచాలన్నారు. దెందులూరు శాసన సభ్యలు కొఠారు అబ్బయ్యచౌదరి మాట్లాడుతూ యవతలో ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు యువజనోత్సవాలు దోహదపడతాయన్నారు. షేక్‌ సాబ్జీ మాట్లాడుతూ జిల్లాస్ధాయి యువజనోత్సవాలు యువతలో స్పూర్తిని నింపుతాయన్నారు. స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకొని ధడమైన సంకల్పం, క్రమ శిక్షణతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. యువజన సర్వీసుల శాఖ సెట్‌ వెల్‌ సిఇఒ ఎమ్‌డిహెచ్‌ మెహర్రాజ్‌ మాట్లాడుతూ యువతకు యువజన సర్వీసుల శాఖ ద్వారా అందిస్తున్న కార్యక్రమాలను వివరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పలుప్రదర్శనలు మైమరపించజేశాయి. వాయిద్య, గాత్ర, నృత్య విన్యాసాలు వీనులవిందుగా సాగాయి. ఈ ప్రదర్శనలను తిలకించిన యువతీ యువకులు కేరింతలు కొట్టారు. కరతాళ ధ్వనులు, ఈలలతో తమ సహచరులను ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమంలో జిల్లా యూత్‌ అధికారి డి.కిషోర్‌, పర్యాటక మేనేజరు ఎస్‌.పట్టాభిరామన్న, సెయింట్‌ థెరిస్సా కళాశాల ప్రిన్సిపల్‌ సిస్టర్‌ మెర్సీ, బిసి సంక్షేమ అధికారి ఆర్‌వి.నాగరాణి పాల్గొన్నారు.