Jul 12,2023 21:44

ఫొటో : పాదయాత్రకు బయల్దేరుతున్న టిడిపి నాయకులు

'యువగళం'కు తరలిన నాయకులు
ప్రజాశక్తి-సీతారామపురం : టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర 154వ రోజు ఉదయగిరి నియోజకవర్గంలోని కొండాపురంలో జరుగుతున్న సందర్భంగా బుధవారం నిర్వహించిన భారీ బహిరంగ సభకు సీతారామపురం నుండి మండల టిడిపి సీనియర్‌ నాయకుడు చింతల శ్రీనివాసులు ఆధ్వర్యంలో టిడిపి శ్రేణులు భారీగా తరలి వెళ్లారు. సుమారు 50 వాహనాల్లో 500 మంది టిడిపి కార్యకర్తలు నాయకులు వెళ్లారు. ఈ సందర్భంగా విలేకరులతో పలువురు నాయకులు మాట్లాడుతూ యువగళం పాదయాత్ర 2వేల కిలోమీటర్లు మైలురాయి ఉదయగిరి నియోజకవర్గంలో రావడం సంతోషకరమని, క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వారికి భరోసా ఇస్తూ రాబోయే రోజులలో తెలుగుదేశం పార్టీ అండగా ఉంటూ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తను ప్రత్యక్షంగా చూసిన ప్రతి సమస్యను లోకేష్‌ పరిష్కరిస్తారన్నారు.
ప్రస్తుత ముఖ్యమంత్రి కేవలం అభివృద్ధిని మరచి అప్పులు చేసి రాష్ట్రాన్ని అమ్ముకుంటూ బటన్లు నొక్కే పనులు మాత్రమే చేస్తున్నారని రాబోయే టిడిపి ప్రభుత్వంలో ముందుగా అభివృద్ధి చేసి తర్వాత సంక్షేమ పథకాలను అమలు చేస్తామని లోకేష్‌ చెప్పడం నాయకత్వ లక్షణాలను తెలియజేస్తుందన్నారు. అనంతరం టిడిపి మండల కన్వీనర్‌ కప్ప ప్రభాకర్‌ రాజు మాట్లాడుతూ మండల టిడిపిలో సీనియర్‌, జూనియర్‌ అనే తారతమ్యాలు లేవని అందరం కలిసికట్టుగా పనిచేస్తూ సీనియర్ల సలహాలను తీసుకుంటూ ఏ ఎన్నికలు వచ్చినా టిడిపి గెలుపే ధ్యేయంగా పనిచేస్తున్నామన్నారు. తమ మధ్య ఎటువంటి విభేదాలు లేవని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల టిడిపి సీనియర్‌ నాయకులు వెంకటేశ్వర్లు రెడ్డి, చెన్నకేశవులు, వెంకటేశ్వర్లు, జాషువా తదితరులు పాల్గొన్నారు.