Apr 13,2023 21:14

నారా లోకేష్‌ యువగళం పాదయాత్రకు స్వాగతం పలుకుతున్న జిల్లా నేతలు


'యువగళం'కు ఘన స్వాగతం
- జిల్లాలోకి ప్రవేశించిన లోకేష్‌ పాదయాత్ర
- తొలి రోజు రంగాపురం నుండి గుడిపాడు వరకు
ప్రజాశక్తి - కర్నూలు ప్రతినిధి/ప్యాపిలి

      ఉమ్మడి కర్నూలు జిల్లాలోకి నారా లోకేష్‌ యువగళం పాదయాత్ర గురువారం ప్రవేశించింది. డోన్‌ నియోజకవర్గం ప్యాపిలి మండలం డి.రంగాపురం వద్ద లోకేష్‌కు టిడిపి నాయకులు ఘన స్వాగతం పలికారు. స్వాగతం పలికిన వారిలో డోన్‌ ఇంఛార్జ్‌ సుబ్బారెడ్డి, బిసి జనార్ధన్‌ రెడ్డి, కెఇ శ్యాంబాబు, గౌరు వెంకట రెడ్డి, గౌరు చరితా రెడ్డి, భూమా అఖిల ప్రియ, కోట్ల సూర్య ప్రకాశ్‌ రెడ్డి, కోట్ల సుజాతమ్మ, మీనాక్షి నాయుడు, తిక్కా రెడ్డి, కెఇ ప్రభాకర్‌, ఎన్‌ఎండి ఫరూక్‌, బిటి నాయుడు, బుడ్డా రాజశేఖర్‌ రెడ్డి, ఏరాసు ప్రతాపరెడ్డి, బివి జయ నాగేశ్వర్‌ రెడ్డి, శివానంద రెడ్డి, టీజీ భరత్‌, భూమా బ్రహ్మానంద రెడ్డి, ఎవి సుబ్బారెడ్డి, బిసి సాధికారత చైర్మన్‌ నాగేశ్వర్‌ రావు యాదవ్‌, మురళికృష్ణ గౌడ్‌, వలసల రామకృష్ణ, సుబ్బయ్య, రాంమోహన్‌, సుంకయ్య, ఖాజా పీర్‌, సుదర్శన్‌, రామాంజినేయులు, నాగేంద్ర, మల్లి, అభి, అనుదీప్‌ ఉన్నారు. అక్కడి నుండి జక్కసానికుంట్ల వద్ద ఎస్సీ సామాజికవర్గ ప్రతినిధులతో ముఖాముఖి నిర్వహించారు. టిడిపి అధికారంలోకి రాగానే దళితవాడలకు శ్మశానానికి స్థలాలు కేటాయిస్తామని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ హామీ ఇచ్చారు. తాము అధికారంలోకి వచ్చాక వైసిపి ప్రభుత్వం దళితులపై పెట్టిన అక్రమ కేసులు రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. సబ్సిడీ లోన్లను రీ షెడ్యూల్‌ చేసి లబ్ధిదారులను ఆదుకుంటామని తెలిపారు.
చెరువుకుంట మరమ్మతులు చేయించాలి
- లోకేష్‌ను కలిసి విన్నవించిన నల్లమేకలపల్లె గ్రామస్తులు
చెరువుకుంట మరమ్మతులు చేయించి ఆదుకోవాలని నల్లమేకలపల్లె గ్రామస్తులు లోకేష్‌ను కలిసి విన్నవించారు. గ్రామంలోని చెరువుకుంట శిథిలావస్థకు చేరుకుందని, మరమ్మతులు చేయాలని అధికారులను కోరినా పట్టించుకోవడం లేదని తెలిపారు. చెరువుకుంటలో నీళ్లుంటేనే బోర్లకు నీరు పుష్కలంగా అందుతుందని, వ్యవసాయం బాగుంటుందని వివరించారు. దీనిపై లోకేష్‌ స్పందిస్తూ తాము అధికారంలోకి వచ్చాక చెరువుకుంటకు మరమ్మతులు చేయిస్తామని హామీ ఇచ్చారు. నల్లమేకలపల్లిలో వ్యవసాయం, పశువులకు నీటి సమస్యలేకుండా చేస్తామన్నారు.
సిసి రోడ్లు లేవు..డ్రైనేజీ సమస్య
- లోకేష్‌కు పిఆర్‌ పల్లె గ్రామస్తులు మొర
గ్రామంలో ప్రధానంగా డ్రైనేజీ సమస్య ఉందని, ఇళ్ల ముందు మురికినీరు నిల్వ ఉండడం వల్ల అనునిత్యం అనారోగ్యం పాలవుతున్నామని నారా లోకేష్‌ను పిఆర్‌ పల్లి గ్రామస్తులు కలిసి సమస్యలను విన్నవించారు. కొన్ని వీధుల్లో సిసి రోడ్లు లేవని తెలిపారు. టిడిపి పాలనలో మంజూరైన ఇళ్లకు వైసిపి ప్రభుత్వం బిల్లులు నిలిపేసిందని చెప్పారు. వీటిపై లోకేష్‌ స్పందిస్తూ అధికారంలోకి వచ్చాక పిఆర్‌ పల్లిలో డ్రైనేజీ, సీసీ రోడ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఇంటింటికీ మంచినీటి కుళాయిలు ఏర్పాటు చేస్తామన్నారు. బిల్లులు ఆపేసిన ఇళ్లకు విడుదల చేస్తామన్నారు. అక్కడి నుండి పాదయాత్ర గుడిపాడుకు చేరుకుంది. ప్రత్యేక శిబిరం వద్ద రాత్రి బస చేశారు. గురువారం మొత్తంగా 15.6 కిలోమీటర్లు యాత్ర సాగింది.
నేడు యాత్ర సాగనుంది ఇలా...
7.00 - గుడిపాడు క్యాంప్‌ సైట్‌ నుంచి పాదయాత్ర ప్రారంభం.
7.10 - గుడిపాడులో స్థానికులతో మాటామంతీ.
8.30 - హెచ్‌ఆర్‌ పల్లిలో యాదవులతో సమావేశం.
9.25 - పూదొడ్డి, మందొడ్డి క్రాస్‌ వద్ద మామిడి రైతులతో భేటీ.
11.00 - ప్యాపిలి శివార్లలో భోజన విరామం.
4.00 - ప్యాపిలి శివార్ల పాదయాత్ర కొనసాగింపు.
4.45 - ప్యాపిలి నీలకంఠేశ్వరస్వామి గుడివద్ద స్థానికులతో సమావేశం.
4.55 - ప్యాపిలి బిసి కాలనీలో 900 కి.మీ. మైలురాయి చేరిక, శిలాఫలకం ఆవిష్కరణ.
5.30 - ప్యాపిలిలో బహిరంగ సభ.
7.30 - పొలిమేరమెట్ట విడిది కేంద్రంలో బస.