ప్రజాశక్తి-బాపట్ల: నారా లోకేష్ యువగళం పాదయాత్రకు సంఘీభావంగా బాపట్లలో అపూర్వ స్పందన లభించింది. గురువారం బాపట్ల తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జి వేగేశన నరేంద్రవర్మ ఆధ్వర్యంలో నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 200 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా బాపట్లలో భారీ ర్యాలీ నిర్వహించారు. బాపట్ల తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి పార్టీ కార్యకర్తలతో ప్రారంభమైన భారీ ర్యాలీ పురవీధుల్లో కొనసాగింది. ఈ సందర్భంగా నరేంద్రవర్మ మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన అంతమొందించడమే లక్ష్యంగా జన ప్రభంజనంతో సాగుతున్న నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర దిగ్విజయంగా 200 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరపున శుభాకాంక్షలు తెలిపారు. యువగళం పాదయాత్రకు ప్రజల నుంచి వస్తున్న అపూర్వ స్పందన చూసి వైసీపీ నాయకులకు వెన్నులో వణుకు మొదలైందన్నారు. లోకేష్ గారు అడుగుపెట్టిన ప్రతి నియోజకవర్గంలో ప్రజలు భారీ సంఖ్యలో స్వచ్చందంగా తరలివచ్చి లోకేశ్ మద్దతు పలకడం పట్ల ప్రభుత్వంపై ప్రజలకు ఎంత వ్యతిరేకత ఉందో అర్థం అవుతోందన్నారు. మహిళలు మంగళహారతులు పడుతూ స్వాగతం పలకడం పార్టీ మీద వారి ప్రేమాభిమానాలకు నిదర్శనమన్నారు.
కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు తురక వీరస్వామి, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి తాతా జయప్రకాష్, పట్టణ, మండలాల పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, తెలుగు యువత నాయకులు, క్లస్టర్, యూనిట్ ఇన్‌ఛార్జులు, తెలుగు మహిళ నాయకులు, పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు.










