Jul 13,2023 20:51

విలేకర్ల సమావేశంలో మాట్లాడుతున్న ఇంటూరి నాగేశ్వరరావు

ప్రజాశక్తి-కందుకూరు :ఈనెల 15వ తేదీ నుంచి కందుకూరు నియోజకవర్గంలో జరిగే టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ పాదయాత్రను జయప్రదం చేయాలని టిడిపి కందుకూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఇంటూరి నాగేశ్వరరావు కోరారు. గురువారం స్థానిక టిడిపి కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో నాగేశ్వరరావు మాట్లాడారు. 15వ తేదీ సాయంత్రం 4 గంటలకు లోకేష్‌ పాదయాత్ర కందుకూరు నియోజకవర్గంలోకి ప్రవేశిస్తుందన్నారు. ఆయనకు స్వాగతం పలికేందుకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశామని చెప్పారు.లింగసముద్రం మండలం వెంగళాపురం గ్రామం వద్ద లోకేష్‌ బస ఉంటుందన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని ముఖ్య నాయకులతో చర్చిస్తారని చెప్పారు. 16వ తేదీ వలేటివారిపాలెంలో జరిగే బహిరంగ సభలో మాట్లాడతారన్నారు. వెనకబడిన ప్రాంతమైన కందుకూరు అభివద్ధి కోసం లోకేష్‌ కు వినతి పత్రం ఇవ్వనున్నట్లు తెలిపారు. బహిరంగ సభ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వలంటీర్ల ద్వారా ముందు జాగ్రత్తలు తీసుకోనున్నట్లు తెలిపారు.. మాజీ శాసనసభ్యులు డాక్టర్‌ దివి శివరాం మాట్లాడుతూ నియోజకవర్గ అభివద్ధి విషయంపై లోకేష్‌ మాట్లాడతారన్నారు. ముఖ్యంగా కందుకూరుని ప్రకాశం జిల్లాలో తిరిగి కలపాలనే విషయం ప్రస్తావిస్తారని తెలిపారు. లోపాలను ఎత్తి చూపిస్తే మహీధర్‌ రెడ్డి తట్టుకోలేక ప్రతి విమర్శలకు దిగుతున్నారన్నారు. వలేటివారిపాలెం నుంచి సింగరాయకొండ వరకు నిర్మించే జాతీయ రహదారి పనులు పరమ నాసిరకంగా జరుగుతున్నాయన్నారు. విలేకర్ల సమావేశంలో టిడిపి నాయకులు నార్నె రోశయ్య, జనగర్ల నాగరాజు, దామా మల్లేశ్వరరావు, గోచిపాతల మోషే, ముచ్చు శ్రీనివాసరావు, చదలవాడ కొండయ్య పాల్గొన్నారు.