ప్రజాశక్తి-పంగులూరు: తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఈ నెలాఖరులో అద్దంకి నియోజక వర్గంలో జరగనున్న నేపథ్యంలో పాదయాత్రను జయప్రదం చేయడానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని, అద్దంకి శాసన సభ్యులు తెలుగుదేశం పార్టీ నాయకులు గొట్టిపాటి రవి కుమార్ కోరారు. లోకేష్ పాదయాత్ర ఏర్పాట్లపై బుధవారం పంగులూరు మండల తెలుగుదేశం పార్టీ నేతలతో జొన్న తాళిలోని పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే గొట్టిపాటి రవి కుమార్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పాదయాత్రకు సంబంధించిన ఏర్పాట్లు, బహిరంగ సభ నిర్వహణ విషయాలపై చర్చించారు. ప్రతిఒక్కరూ ప్రతిష్టా త్మకంగా సాగుతున్న లోకేష్ యువగళం పాదయాత్రను విజయవంతం చేయడానికి కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఒంగోలులో మహా నాడు నిర్వహణకు అధికార పార్టీ నుంచి ఎన్ని ఆటంకాలు ఎదురైనా, పార్టీ పెద్దలు అడిగిందే తడువుగా ఒంగోలు నియోజకవర్గంలోని మండువవారి పాలెం గ్రామ రైతులు ముందుకు వచ్చి తమ 140 ఎకరాల పొలాల్లో మహానాడు నిర్వహణకు అంగీకారం తెలిపారని, అంతేకాకుండా తమ వ్యవసాయ భూమిని చదును చేసి ఇచ్చి చరిత్రలో నిలిచి పోయారని, చంద్రబాబు నాయుడు సైతం రైతులతో ప్రత్యేకంగా భేటీ అయి కృతజ్ఞతలు తెలిపారని గుర్తు చేశా రు. అదేవిధంగా రాష్ట్ర రాజధాని కోసం తమ భూములను ప్రభుత్వానికి ఇచ్చిన రైతులు న్యాయం చేయాలని కోరుతూ చేపట్టిన 'న్యాయస్థానం నుంచి దేవస్థానం' పాదయాత్ర ఏ విధంగా విజయవంతం అయ్యిందో రాష్ట్ర, దేశ వ్యాప్తంగా ప్రజలు చూశారన్నారు. అదే స్ఫూర్తితో, రెట్టింపు ఉత్సాహం తో నియోజకవర్గంలో జరిగే పాదయాత్ర, బహిరంగ సభను చిత్తూరు, కర్నూలు, కడప, నెల్లూరు, జిల్లాల కంటే అద్దంకి నియోజకవర్గంలో నారా లోకేష్ యువగళం పాదయాత్ర నభూతో నభవిష్యత్ అన్న రీతిలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జరగని రీతిలో అద్దంకి జరుపుకుందామని అన్నారు. అద్దంకి నియోజకవర్గంలో ప్రతిఒక్కరూ పాదయాత్ర తమదిగా భావించి, గ్రామాల్లోని నేతలు కార్యకర్తలు అందరూ సమన్వయం చేసుకుని, కలిసికట్టుగా నారా లోకేష్ పాదయాత్రను విజయవంతం చేద్దామని ఎమ్మెల్యే గొట్టిపాటి అన్నారు. కార్యక్రమంలో మండల తెలుగుదేశం అధ్యక్షుడు రావూరి రమేష్ బాబు, పార్టీ మండల మాజీ అధ్యక్షులు కుక్కపల్లి ఏడుకొండలు, చింతల సహదేవుడు, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.










