ప్రజాశక్తి - ఆదోని
యువగళం పాదయాత్రకు వస్తున్న జనాదరణను చూసి అధికార పార్టీ నాయకులు బెంబేలెత్తుతున్నారని టిడిపి సీనియర్ నాయకులు, మార్కెట్ యార్డు మాజీ ఛైర్మన్ సూరం భాస్కర్ రెడ్డి, ఎల్‌ఎల్‌సి మాజీ ఛైర్మన్ బసాపురం రామస్వామి, ఆత్మ మాజీ ఛైర్మన్ ఫక్రుద్దీన్ తెలిపారు. మంగళవారం సిటీ ప్రెస్ కాంపౌండ్‌లోని వారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌పై ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి 'రాసలీలలు' అంటూ వ్యక్తిగతంగా విమర్శలు చేయడం తగదని మండిపడ్డారు. సోషల్ మీడియాలో లోకేష్ రాసలీలపై ఎమ్మెల్యే చేసిన ఆరోపణలు హల్‌చల్ చేయడంపై తాము స్పందించినట్లు తెలిపారు. ఆదోని నియోజకవర్గంలో యువగళం పాదయాత్ర విజయవంతంగా జరిగిందని, సహకరించిన నియోజకవర్గ ప్రజలకు, టిడిపి నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర మంత్రిగా ఉన్న సమయంలో లోకేష్ ఏమైనా అక్రమాలు చేసి ఉంటే వాటిపై ఆధారాలు చూపిస్తూ విమర్శలు చేయాలే తప్ప ఇలా వ్యక్తిగతంగా విమర్శలు చేయడం రాజకీయ దిగుజారుడేనని దుయ్యబట్టారు. ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి, టిడిపి నాయకులు ఉమాపతి నాయుడు అక్రమాలు చేసినట్లు ఒకరిపైఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారని తెలిపారు. అసలు అక్రమాలు చేసింది ఎవరు, అన్యాయాలు చేసింది ఎవరో, భూ కబ్జాలు చేసింది ఎవరో ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. లోకేష్‌పై విమర్శలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. భూకబ్జాలు అంటే క్యాష్ ప్రసాద్ రెడ్డి అని తెలిపారు. లోకేష్ పాదయాత్రకు విశేష స్పందన లభిస్తే ఎమ్మెల్యే, ఆయన తనయుడు మనోజ్ కుమార్ రెడ్డిలు జనమే రాలేదని చెప్పడం తగదన్నారు. ఇసుక వేస్తే రాలనంత జనం వచ్చారని, దుకాణాలు అంతా బంద్ చేసుకొని చూడడానికి జనం వస్తే జనాదరణ చూసి వైసిపి నాయకులు భయపడుతున్నారన్నారు. ఆదోనిలో టిడిపిలో ఎవరైనా అక్రమాలు చేస్తే మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడుపై ఆరోపణలు వస్తాయని, అలాగే వైసిపిలో ఎవరైనా అక్రమాలు చేస్తే ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిపై ఆరోపణలు రావడం సహజమని తెలిపారు. కార్యకర్తలందరూ కలిసికట్టుగా ఉంటామని, ప్రతి విమర్శనూ ఎదుర్కొంటామని చెప్పారు. నాయకులు షేక్షావలీ, కారుమంచప్ప, రాముడు ఉన్నారు.
మాట్లాడుతున్న మార్కెట్ యార్డు మాజీ ఛైర్మన్ భాస్కర్ రెడ్డి










