ప్రజాశక్తి - ముదినేపల్లి
నారా లోకేష్ చేస్తున్న పాదయాత్ర వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా పార్టీ అదేశాల మేరకు సంఘీబావ పాదయాత్ర ముదినేపల్లి మండలంలో సోమవారం నిర్వహించారు. టిడిపి నియోజకవర్గ యువ నాయకులు కొడాలి వినోద్ ఆధ్వర్యంలో ముదినేపల్లి నుంచి సింగరాయపాలెం వరకు పాదయాత్ర నిర్వహించారు. పాదయాత్రలో నాలుగు మండలాల పార్టీ అధ్యక్షులు, వివిధ హోదాల్లో ఉన్న నాయకులు, యువత, మహిళలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం లోకేష్ పాదయాత్ర విజయవంతం కావాలని, 2024లో చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలంటూ సింగరాయపాలెంలో శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో పూజలు, ప్రార్థనలు చేయించారు. ఈ పాదయాత్రలో రెండు వేలమంది పాల్గొన్నారు.
చాట్రాయి : టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌బాబు చేపట్టిన యువగళం వంద రోజులు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆ పాదయాత్రకు మద్దతుగా ఏలూరు పార్లమెంట్ అధికారి ప్రతినిధి మందపాటి బసవరెడ్డి, విజయ మిల్క్ డైరెక్టర్ బొట్టు రామచంద్రరావు, మాజీ ఎంపిపి కందుల కృష్ణ, పుచ్చకాయల నోబెల్‌రెడ్డి, కోట జోషి ఆధ్వర్యంలో సోమవారం పాదయాత్ర చేపట్టారు. టిడిపి మండల పార్టీ కార్యాలయం నుంచి రామాలయం వరకు పాదయాత్ర చేశారు. అనంతరం రామాలయంలో పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల తెలుగు యువత అధ్యక్షులు బొంతు సతీష్, తుమ్మ గూడెం గ్రామ టిడిపి అధ్యక్షులు మందలపు రాజా, టిడిపి పర్వతాపురం గ్రామ అధ్యక్షులు బొర్రా నాగేశ్వరరావు, కాసాగాని గోవర్ధన్‌రెడ్డి, పలగాని లక్ష్మీనారా యణ, వంగల సుబ్బారావు, వెల్ది నాగేశ్వరరావు, చల్లగుళ్ల విజయశేఖర్, టిడిపి మండల కార్యదర్శి కంచర్ల హనుమంతరావు, వెంకటేశ్వరరావు, టిడిపి నేతలు పాల్గొన్నారు.
కైకలూరు : యువగళం పాదయాత్రకు సంఘీభావంగా పట్టణంలో టిడిపి నేతలు సోమవారం ర్యాలీ చేశారు. మండవల్లి మండలం చావలిపాడు నుంచి కైకలూరు మీదుగా ఆటపాక మాగంటి బాబు నివాసంలోని పార్టీ కార్యాలయం వరకు పాదయాత్ర చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు, రాష్ట్ర, జిల్లా, మండల నాయకులు, పార్టీ అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.










