Aug 31,2023 23:45

యువగళానికి సంఘీభావం

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర 200 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా జిల్లాలో పలుచోట్ల సంఘాభావ ర్యాలీలు చేపట్టారు. పాతపట్నం, టెక్కలి నియోజకవర్గాల్లో ఎంపీ రామ్మోహన్‌నాయుడు, ఆమదాలవలస నియోజకవర్గంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు కూన రవికుమార్‌, పలాసలో నియోజవర్గ ఇన్‌ఛార్జి గౌతు శిరీష, శ్రీకాకుళం నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మిదేవి పాల్గొని పార్టీ శ్రేణులను ఉత్తేజ పరిచారు. బాబు ష్యూరిటీ, భవిష్యత్‌ గారంటీని విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు.

ప్రజాశక్తి- యంత్రాంగం: 
టెక్కలి నియోజకవర్గం సంతబొమ్మాళి మండలం దండు గోపాలపురం నుంచి సంతబొమ్మాళి మండల కేంద్రం వరకు నిర్వహించిన సంఘీభావ పాదయాత్రలో ఎంపి రామ్మోహన్‌నాయుడు పాల్గొన్నారు. వైసిపి ప్రభుత్వ పాలనలో అరాచకత్వం భూకబ్జాలు పెరిగాయని, అభివృద్ధి లేదని విమర్శించారు. టిడిపి చేసిన పనులకు ఇప్పుడు నాయకులు పేర్లు మార్చుకుని శిలాఫలకాలు పెట్టుకుంటున్నారని విమర్శించారు. టెక్కలి నియోజకవర్గం రానున్న ఎన్నికల్లో మళ్లీ టిడిపి జెండా ఎగుర వేసి అచ్చెన్నాయుడు హ్యాట్రిక్‌ సాధించబోతున్నారని ఎంపీ కింజరాపు రామ్మోహన్‌ నాయుడు అన్నారు.కార్యక్రమంలో టిడిపి మండల పార్టీ అధ్యక్షుడు జీరు భీమారావు, రెడ్డి అప్పన్న, బోయిన రమేష్‌, బగాది శేషగిరి పాల్గొన్నారు. పాతపట్నం నియోజకవర్గం హిరమండలం మండల కేంద్రంలో నియోజవర్గ ఇంఛార్జి కలమట వెంకటరమణతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు.
చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి: కూన రవికుమార్‌
ఆమదాలవలస మండల కేంద్రం పూజారిపేటలోని వెంకటేశ్వర కళ్యాణ మండపం నుంచి గాంధీ విగ్రహం వరకు నిర్వహించిన ర్యాలీలో టిడిపి జిల్లా అధ్యక్షుడు కూన రవివకుమార్‌ పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకుడు ద్వారపురెడ్డి జగదీష్‌, మాజీ ఎంఎల్‌సి పీరుకట్ల విశ్వప్రసాద్‌, మండల పార్టీ అధ్యక్షుడు నూక రాజు, మొదలవలస రమేష్‌, అంబళ్ల రాంబాబు, తమ్మినేని విద్యాసాగర్‌, బోర గోవిందరావు, సరేష్‌ పాల్గొన్నారు.
రానున్నది టిడిపి ప్రభుత్వమే : గుండ లక్ష్మిదేవి
రాష్ట్రంలో వచ్చే ఎడాది జరగనున్న ఎన్నికల్లో టిడిపి ప్రభంజనం సృష్టించడం ఖాయమని శ్రీకాకుళం నియోజవర్గ ఇంఛార్జి గుండ లక్ష్మిదేవి అన్నారు. శ్రీకాకుళం మండలం పెద్ద పాడు నుంచి సింగుపురం ప్రశాంతి నగర్‌ వరకు బైక్‌ ర్యాలీ నిర్వహించారు.
రాష్ట్రం సర్వ నాశనం:గౌతు శిరీష
వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం సర్వనాశమైందని టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష అన్నారు.మామిడిపల్లి నుంచి పెద్ద నీలావతి వరకు ర్యాలీ చేపట్టారుకార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి వజ్జ బాబూరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి పి.విఠల్‌రావు, రాష్ట్ర బిసి సెల్‌ ప్రధాన కార్యదర్శి లొడగల కామేశ్వరరావు పాల్గొన్నారు.