ప్రజాశక్తి-బాపట్ల: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర వంద రోజుల మైలురాయి చేరుకున్న సందర్భంగా బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జి వేగేశన నరేంద్రవర్మ ఆధ్వర్యంలో బాపట్ల నియోజకవర్గంలో చుండూరుపల్లి నుంచి అప్పికట్ల వరకు పాదయాత్ర నిర్వహించారు. సోమవారం పొన్నూరు-బాపట్ల మార్గంలో చుండూరుపల్లి సెంటర్ నుంచి అప్పికట్ల వరకు సంఘీభావ పాదయాత్రలో పార్టీ నాయకులు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బాపట్ల తెలుగుదేశం పార్టీ బాధ్యులు నరేంద్రవర్మకు పాదయాత్రలో అడుగడుగునా ప్రజలు నీరాజనాలు పలికారు. కార్యక్రమంలో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
వేమూరు: టిడిపి నాయకుడు నారా లోకేష్ యువగళం పాదయాత్రకు మద్దతుగా మాజీ మంత్రి, తెలుగుదేశం పోలిట్‌బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబు చుండూరు మండలంలో సోమవారం సంఘీభావ పాదయాత్ర ప్రారంభించారు. లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభించి నేటికి 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా సోమవారం చుండూరు మండలంలో వేమూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ శ్రేణులతో సంఘీభావ పాదయాత్ర ప్రారంభించారు. ముందుగా యడ్లపల్లిలో ఎన్టీఆర్ విగ్రహానికి ఆనందబాబు పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం పాదయాత్రలో పాల్గొన్నారు. యడ్లపల్లి గ్రామం ఎన్‌టిఆర్ విగ్రహం వద్ద నుంచి నడిగడ్డపాలెం, చుండూరు అంబేద్కర్ నగర్‌లో వున్న అంబేడ్కర్ విగ్రహం వరకు పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా ఆనంద్‌బాబు మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం లోకేష్ పాదయాత్రకు అనేక అడ్డంకులు సృష్టించినా అన్నిటినీ అధిగమించి పాదయాత్ర విజయవంతంగా చేస్తున్నారని అన్నారు. పాదయాత్రలో లోకేష్‌కు ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారని అన్నారు. రాబోయేది టీడీపీ ప్రభుత్వమేనని అన్నారు. ఈ పాదయాత్రకు మద్దతుగా వేమూరు నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని పాదయాత్రను విజయవంతం చేశారు.
రేపల్లె: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగాళం పాదయాత్ర 100 రోజులకు చేరుకున్న సందర్భంగా రేపల్లె తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సంఘీభావ యాత్రను నిర్వహించినట్లు శాసనసభ్యులు అనగాని సత్యప్రసాద్ చెప్పారు. మండలంలోని కారుమూరు గ్రామం నుంచి ప్రారంభమైన యాత్ర వేజండ్లవారిలంక మీదుగా మోర్లవారిపాలెం, బేతపూడి గ్రామం వరకు నిర్వహించారు. ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ 2024 ఎన్నికల్లో వైసీపీకి రాష్ట్ర ప్రజలు చరమగీతం పాడుతారన్నారు. నారా లోకేష్ పాదయాత్రకు ప్రజల్లో అనూహ్య స్పందన వచ్చిందని తెలిపారు. అరాచక శక్తుల నుంచి రాష్ట్రాన్ని కాపాడాలనే లక్ష్యంతోనే నారా లోకేశ్ పాదయాత్ర చేస్తున్నారని అన్నారు. రైతు ప్రభుత్వం అని చెప్పుకునే వైసీపీ నాయకులు.. అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో ఎందుకు విఫలమయ్యారని మండిపడ్డారు. చంద్రబాబు, లోకేశ్‌లకు మద్దతుగా తమ వంతు ప్రయత్నం చేస్తున్నామని అనగాని సత్యప్రసాద్ తెలిపారు. కార్యక్రమంలో గూడపాటి శ్రీనివాసరావు, జివి నాగేశ్వరరావు, జివి రామారావు, కొక్కిలిగడ్డ వెంకటేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
కొల్లూరు: యువగళం పాదయాత్ర వంద రోజుల మైలురాయి చేరిన సందర్భంగా వేమూరు నియోజకవర్గం చుండూరు మండలం ఎడ్లపల్లి గ్రామం ఎన్టీఆర్ విగ్రహం దగ్గర నుంచి వయా నడిగడ్డవారిపాలెం మీదుగా అంబేద్కర్ నగర్‌లోని అంబేద్కర్ విగ్రహం వరకు మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఆధ్వర్యంలో జరిగింది. ఈ పాదయాత్రకు సంఘీభావంగా కొల్లూరు నుంచి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి డాక్టర్ కనగాల మధుసూదన్ ప్రసాద్ ఆధ్వర్యంలో భారీఎత్తున కార్యకర్తలతో పాల్గొని పాదయాత్రను విజయవంతం చేశారు.










