ప్రజాశక్తి - వినుకొండ : టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర పల్నాడు జిల్లాలో మంగళవారం మొదలైంది. 172వ రోజుకు చేరుకున్న పాదయాత్ర ప్రకాశం జిల్లా ముళ్ళమూరు మండలం కెల్లంపల్లి నుండి ఉదయం 11 గంటలకు నూజెండ్ల మండలం ముప్పరాజు వారిపాలెం ద్వారా పల్నాడు జిల్లాలోకి ప్రవేశించింది. టిడిపి జిల్లా అధ్యక్షులు జీవీ ఆంజనేయులు ఆయన సతీమణి లీలావతి, కుమారుడు హరీష్‌బాబు, ఇతర టిడిపి నాయకులు, శ్రేణులు ఘన స్వాగతం పలికారు. స్వాగతం పలికేందుకు వినుకొండ నియోజకవర్గంలోని ఐదు మండలాల నుండి టిడిపి శ్రేణులు భారీగా వచ్చి పాదయాత్రలో పాల్గొన్నారు. టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబు, మాజీ మంత్రులు కన్నా లక్ష్మీనారాయణ, పత్తిపాటి పుల్లారావు, ఆలపాటి రాజేంద్రప్రసాద్, మాజీ ఎమ్మెల్యేలు యరపతినేని శ్రీనివాసరావు, కొమ్మాలపాటి శ్రీధర్, ధూలిపాళ్ల నరేంద్ర, తెనాలి శ్రావణ్ కుమార్, నరసరావుపేట, మాచర్ల, బాపట్ల, గుంటూరు తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల ఇన్‌ఛార్జులు డాక్టర్ చదలవాడ అరవిందబాబు, జూలకంటి బ్రహ్మారెడ్డి, వేగేశన నరేంద్రవర్మ, నజీర్ అహ్మద్, కోవెలమూడి రవీంద్ర, నాయకులు మనవ మోహనకృష్ణ, భాష్యం ప్రవీణ్, కందుకూరి వీరయ్య, గోనుగుంట్ల కోటేశ్వరరావు, పోతినేని శ్రీనివాసరావు లోకేష్‌తో కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు. మహిళలు, యువతులు హారతిపట్టారు. లోకేష్‌తో సెల్ఫీల కోసం మహిళలు, యువత ఉత్సాహం చూపారు. పలువురితో లోకేష్ మాట్లాడి వారి సమస్యలు తెలుసుకోవడంతోపాటు పలు హామీలు ఇస్తూ ముందుకు సాగారు.
సమస్యలపై జనం వినతులు
ముప్పరాజువారిపాలెం ప్రజలు లోకేష్‌ను కలిసి సమస్యలను విన్నవించారు. తమ గ్రామ్లంఓ 400 కుటుంబాలు నివసిస్తున్నాయని, తీవ్రమైన తాగునీటి ఎద్దడితో ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. చేతిపంపు బోరు నీరు తాగి ఫ్లోరైడ్ సమస్యతో నడుముల నొప్పులు, గార పళ్ళు, మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నామని వివరించారు. గ్రామంలో ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మించి ప్రతి ఇంటికి కుళాయి సదుపాయం కల్పించాలని కోరారు. పంటకు మద్దతు ధర కల్పించాలన్నారు. లోకేశ్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలకు గుక్కెడు నీళ్లు అందించడం చేతకాని ముఖ్యమంత్రి అసమర్ధ ముఖ్యమంత్రి లక్షల సంక్షేమం చేశానని ప్రగంబలు పలకటం సిగ్గుచేటు అన్నారు. గ్రామీణ ప్రాంతాలలో మంచినీటి సదుపాయం కల్పించేందుకు కేంద్రం ఇచ్చిన నిధులను కూడా ఈ ప్రభుత్వం వినియోగించుకోలేకపోయిందని అన్నారు. జలజీవన్ మిషన్ అమలులో రాష్ట్రం 18వ స్థానంలో ఉందన్నారు. టిడిపి అధికారంలోకి వచ్చాక వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేసి ప్రతి ఇంటికి కుళాయి ద్వారా స్వచ్ఛమైన నీరు అందిస్తామని, వ్యవసాయ పెట్టుబడులు తగ్గించి మద్దతు ధర కల్పిస్తామని హామీ ఇచ్చారు.
పుచ్చ నూతల పంచాయతీలోని జెసి నగర్ గ్రామవాసులు నారా లోకేష్ బాబును కలిసి అనేక సమస్యలను విన్నవించారు. మా గ్రామంలో శ్మశాన వాటిక లేక మృతదేహాలను వాగుఖననం చేయాల్సి వస్తోందన్నారు. నివేశన స్థలాల పట్టాల కోసం ఎన్నిసార్లు దరఖాస్తులు చేసుకున్న ఫలితం లేకపోయిందని, ఖాళీ ప్రభుత్వ భూములను వ్యవసాయం చేసుకునే పేదలకు కేటాయించాలని విన్నవించారు. నూజెండ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన వైద్య సదుపాయాలు లేక గర్భిణులు చిన్నారులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, మందులు బయట కొనాల్సి వస్తోందని చెప్పారు. చేపల వేట చేసి జీవనం సాగించే మాకు వలలు ఐస్ బాక్సులు ఇప్పించి ఆదుకోవాలని కోరారు. లోకేష్ మాట్లాడుతూ సెంటు పట్టాల పేరుతో పనికిరాని స్థలాలను ప్రజాధనంతో కొనుగోలు చేసి సుమారు రూ.7 వేలకోట్లు దోచుకున్నారని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. టిడిపి అధికారంలోకి రాగానే ప్రతి పేదవాడికి ఇంటి స్థలంతో పాటు ఇల్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. జెసి నగర్‌లో శ్మశాన వాటిక స్థలం కేటాయిస్తామన్నారు. ఆదరణ పథకాన్ని ప్రవేశపెట్టి మత్స్యకారులకు వలలు, ఐస్ బాక్సులు రాయితీపై ఇప్పిస్తామన్నారు.
రవ్వారంలో టిడిపి హయాంలో సిసి రోడ్లు నిర్మించారని, సైడ్ కాలువలు నిర్మించే సమయానికి ప్రభుత్వం మారి పనులు నిలిపివేశారని అన్నారు. గ్రామ ప్రజలు అధిక శాతం వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నామని, పొలాలకు వెళ్లే దారులు సక్రమంగా లేక ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. లోకేష్ మాట్లాడుతూ ప్రభుత్వం పంచాయతీ నిధులు దొంగిలించడంతో పంచాయతీ అభివృద్ధి కుంటుపడిందన్నారు. పంచాయతీల్లో సమస్యలను టిడిపి అధికారంలోకి రాగానే పరిష్కరిస్తుందని హామీనిచ్చారు. లక్ష్మీపురంఃలో తాగునీటి సమస్య అధికంగా ఉందని, 500 మీటర్ల మేర సైడ్ కాలవలు అవసరమని, టిడిపి హయాంలో నిర్మించిన ఇళ్లకు వైసీపీ ప్రభుత్వం బిల్లులు చెల్లించడం లేదని పలువురు వివరించారు. వీటి పరిష్కారానికి లోకేష్ హామీనిచ్చారు.
నేటి యువగళం పాదయాత్ర షెడ్యూల్
ఇప్పటి వరకు నడిచిన మొత్తం దూరం 2283.5 కిలోమీటర్లు
మంగళవారం నడిచిన దూరం 18.6 కిలోమీటర్లు
173వ రోజైన బుధవారం పాదయాత్ర ఉదయం 8 గంటలకు పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం గుర్రపునాయుడుపాలెం క్యాంప్ సైట్ నుంచి ప్రారంభం.
10 గంటలకు ఉప్పలపాడులో రైతులతో సమావేశం
11 గంటలకు చాట్రగడ్డపాడులో స్థానికులతో మాటామంతి
మధ్యాహ్నం 12 గంటలకు వినుకొండ గంగినేని డిగ్రీ కాలేజి సమీపంలో భోజన విరామం
సాయంత్రం 4 గంటలకు వినుకొండ గంగినేని డిగ్రీకాలేజి వద్ద నుంచి పాదయాత్ర కొనసాగింపు
4.20 గంటలకు చెక్ పోస్టు వద్ద స్థానికులతో సమావేశం
4.40 గంటలకు ముండ్లమూరు బస్టాండులో స్థానికులతో మాటామంతి
5.00 గంటలకు ఎన్టీఆర్ సర్కిల్లో బహిరంగసభ, లోకేష్ ప్రసంగం
6.15 గంటలకు బస్టాండు వద్ద స్థానికులతో మాటామంతి
9.45 గంటలకు నగరాయపాలెం విడిది కేంద్రంలో బస










