Jul 11,2023 00:19

ప్రజాశక్తి - రెంటచింతల : పురుగుల మందుతాగి యువ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని పాల్వాయిగేటులో సోమవారం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. మండలంలోని తుమృకోటకు చెందిన ఎస్‌కె కరిష్మా (24) అగ్రికల్చర్‌ డిప్లొమా చేశారు. 2019 ఆగస్టులో అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌గా ఉద్యోగం సాధించి అప్పటి నుండి పాల్వాయిగేటులోనే పని చేస్తున్నారు. స్థానిక రైతు భరోసా కేంద్రంలో పని చేస్తున్న కరిష్మా సోమవారం మధ్యాహ్నం ఆర్‌బికె పక్కనే ఉన్న సచివాలయంలోకి వెళ్లి తలుపులు వేసుకుని శీతలపానియంలో పురుగు మందు కలిపి తాగారు. అనంతరం ఈ విషయాన్ని మరో ఉద్యోగికి ఫోన్‌ ద్వారా చెప్పడంతో వారు హుటాహుటిన అక్కడికొచ్చారు. అప్పటికే స్పృహతప్పి పడిపోయారు. వెంటనే కంభంపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా మెరుగైన వైద్యం కోసం నరసరావుపేటకు తీసుకెళ్లాలని చెప్పారు. నరసరావుపేటకు తీసుకెళ్లే క్రమంలో మార్గం మధ్యలో కరిష్కామ మృతి చెందారు. మృతురాలి తండ్రి మహ్మద్‌ జాన్‌ టైలర్‌గా జీవనం సాగిస్తున్నాడు. ఆత్మహత్యపై తమకు ఫిర్యాదేమీ అందలేదని ఎస్‌ఐ సమీర్‌బాష తెలిపారు. మృతదేహాన్ని మండల వ్యవసాయాధికారి బి.బ్రహ్మారెడ్డి, మాజీ సర్పంచి జి.నాగలక్ష్మి శ్రీనివాసరెడ్డి సందర్శించి నివాళులర్పించారు. ఆత్మహత్యకు గల కారణాలు స్పష్టంగా తెలియరాలేదు.