Aug 18,2023 00:04

ఓటర్ల నమోదు పూర్తి చేయాలని కలెక్టర్‌ కె.వెంకటరమణారెడ్డి

యువ ఓటర్ల నమోదు పూర్తవ్వాలి : కలెక్టర్‌
ప్రజాశక్తి - తిరుపతి టౌన్‌

ఎన్నికల కమిషన్‌ రేషియో ప్రకారం యువ ఓటర్ల నమోదు పూర్తి చేయాలని కలెక్టర్‌ కె.వెంకటరమణారెడ్డి ఆదేశించారు. బిఎల్‌ఒలు తమ విధుల్లో అధిక ప్రాధాన్యత ఎన్నికల విధులకు ఇవ్వాలని, ఈనెల 21 లోపు ప్రత్యేక ఓటర్ల సవరణ, సర్వే పూర్తి చేయాలని, అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. గురువారం ఉదయం కలెక్టరేట్‌లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో, ఇఆర్‌ఒ, ఎఇఆర్‌ఒలతో ప్రత్యేక ఓటర్ల సవరణ-2024పై నాలుగోసారి సమావేశమయ్యారు. జిల్లాల్లో ఏడు నియోజకవర్గాల్లో ఆన్‌లైన్‌ నమోదు ప్రకారం 6,68,526 గృహాలకు గాను 4,92,681 కుటుంబాలకు సర్వే పూర్తయ్యిందన్నారు. రాతపూర్వకంగా అందించిన ఫిర్యాదులు క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్యలు చేపట్టాలన్నారు. యాప్‌ పనిచేయడం లేదని సాకులు వద్దని, తప్పనిసరిగా మాన్యువల్‌గా ఫామ్స్‌ సేకరించాలన్నారు. ఎన్నికల కమిషన్‌ సూచన మేరకు కాలేజీల్లో ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించి జిల్లాలో తేడా ఉన్న 0.8 శాతం పూర్తి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో కమిషనర్‌ హరిత, డిఆర్‌ఒ కోదండ రామిరెడ్డి, ఇఆర్‌ఒలు కిరణ్‌కుమార్‌, రామారావు, చంద్రముని, కనక నరసారెడ్డి పాల్గొన్నారు.
కలెక్టరేట్‌లో దండియాత్ర చిత్రపటం ఆవిష్కరణ
తిరుపతి టౌన్‌ : భారత స్వాతంత్య్ర పోరాటంలో ముఖ్యమైన ఘట్టాలు మన భావి తరాలకు తెలియజేయాల్సిన బాధ్యత మనపై వుందని కలెక్టర్‌ కె.వెంకటరమణా రెడ్డి అన్నారు. ఆజాదీ కా అమత్‌ మహౌత్సవ్‌ లో భాగంగా గురువారం మధ్యాహ్నం కలెక్టరేట్‌ లో దండి మార్చ్‌ లో పాల్గొన్న స్వాతంత్య్ర సమర యోధుల చిత్రపటాన్ని జిల్లా కలెక్టర్‌ కే వెంకట రమణ రెడ్డి, జెసి డి.కె.బాలజీ తో కలిసి ఆవిష్కరించారు. ఉప్పు సత్యాగ్రహం (దండియాత్ర) మార్చి 12 నుండి ఏప్రిల్‌ 6 వరకు సబర్మతి ఆశ్రమం, అహ్మదాబాద్‌ నుండి దండి వరకు సుమారు 385 కి.మీ. పాదయాత్ర స్వాతంత్య్ర పోరాటంలో ఒక మహా ఉద్యమమని, వాటిని భావితరాలకు తెలిసేలా చేయడం మన బాధ్యతని అన్నారు. ఈ కార్యక్రమంలో డిటి విజయభాస్కర్‌ పాల్గొన్నారు.
త్వరలోనే ఆడిటోరియం ప్రారంభిస్తాం : కమిషనర్‌
తిరుపతి టౌన్‌ : స్మార్ట్‌ సిటీ నిధులతో నగరంలో నిర్మిస్తున్న ఆడిటోరియం నిర్మాణ పనులు పూర్తి అయ్యాయని త్వరలోనే ప్రారంభించి నగరవాసులకు అందుబాటులోనికి తెస్తామని నగరపాలక సంస్థ కమిషనర్‌ హరిత అన్నారు. గురువారం ఉదయం ఇంజినీరింగ్‌ అధికారులతో కలిసి ఆడిటోరియం పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ నగర ప్రజలకు ఆహ్లాదాన్ని అందించడంలో భాగంగా స్మార్ట్‌ సిటీ నిధులతో పలు అభివద్ధి పనులు చేస్తున్నామన్నారు. అందులో భాగంగానే సుమారు 40 కోట్ల రూపాయల స్మార్ట్‌ సిటీ నిధులతో తుడా కార్యాలయం సమీపంలో 600మంది కూర్చుని కార్యక్రమాలు వీక్షించేందుకు వీలుగా ఆడిటోరియం, కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌, ఆర్ట్‌ స్టూడియో, డిజైన్‌ స్టూడియో ను నిర్మిస్తున్నామని అన్నారు. కమిషనర్‌ వెంట సూపరింటెండెంట్‌ ఇంజినీర్‌ మోహన్‌, మునిసిపల్‌ ఇంజినీర్‌ చంద్రశేఖర్‌, డి.ఈ. దేవిక, ఏఈకాం ప్రతినిదులు బాలాజీ, అనిల్‌, తదితరులు ఉన్నారు.