కడప కొత్తగా న్యాయవాద వత్తిని చేపట్టిన యువ లాయర్లకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 'వైఎస్‌ఆర్ లా నేస్తం' పథకం ఎంతో ఆర్థిక చేయుతను అందివ్వడంతో పాటు న్యాయవాద వత్తిలో నిలదొక్కుకునేందుకు ఎంతో ఉపయోగపడుతోందని కలెక్టర్ వి.విజరు రామరాజు పేర్కొన్నారు. సోమవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 2023-24 సంవత్సరానికి సంబంధించి మొదటి విడతగా 5 నెలల (ఫిబ్రవరి-జూన్ వరకు) 'లా నేస్తం' నిధులను బటన్ నొక్కి లబ్దిదారుల ఖాతాలకు జమ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్థానిక కలెక్టరేట్ విసి హాలు నుంచి కలెక్టర్‌తోపాటు జెసి గణేష్ కుమార్ హాజరయ్యారు. విసి ముగిసిన అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ లా డిగ్రీ తీసుకున్న తర్వాత తొలి మూడేళ్లు న్యాయవాదిగా స్థిరపడేందుకు 'లా నేస్తం' కింద ఇచ్చే స్టైఫండ్ వారికి ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. జూనియర్ లాయర్లకు రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన ఈ గొప్ప పథకాన్ని న్యాయవాద వత్తిలోకి ప్రవేశించిన యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ ఆర్థిక సాయంతో జూనియర్ లాయర్ల వృత్తిలో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా సమాజాభివృద్ధి కోసం వృత్తి నైపుణ్యం పెంపొందించుకోవాలని సూచించారు. 5 నెలలకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా ఒక్కరికి రూ.5 వేల చొప్పున 136 మందికి రూ.6,80,000 మంజూరైందన్నారు. కార్యక్రమంలో డిఆర్వో గంగాధర్ గౌడ్, గవర్నమెంట్ ప్లీడర్ శివశంకర్ రెడ్డి, బార్ అసోసియేషన్ సభ్యులు, లబ్ధిదారులైన లాయర్లు పాల్గొన్నారు.










