చింతపల్లి ఎఎస్‌పి ప్రతాప్ శివ కిషోర్
ప్రజాశక్తి -సీలేరు
అంతర్జాతీయ, జాతీయ క్రీడా పోటీలకు ప్రాతినిధ్యం వహించే విధంగా యువ క్రీడాకారులను తీర్చిదిద్దడమే యువహో కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని చింతపల్లి ఏఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ వెల్లడించారు. గురువారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ మారుమూల ప్రాంతమైన మాదిగమల్లులో ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు నిర్వహించిన మెగా వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించినట్లు చెప్పారు. మారుమూల ప్రాంతాల్లోని యువ క్రీడాకారుల ప్రతిభను వెలికి తీయడానికి, బాహ్య ప్రపంచానికి తెలియడానికి ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని పేర్కొన్నారు. యువతకు క్రీడల ద్వారా మనోధైర్యాన్ని కల్పించవచ్చని తెలిపారు. ఎటువంటి సెల్ సిగల్స్ లేని, అత్యంత సమస్యాత్మకమైన మూరుమూల ప్రాంతాల్లో జీకే వీధి సిఐ అశోక్ కుమార్, ఎస్సైలు రామకృష్ణ, అప్పల సూరి, రంజిత్ పర్యటించి యువతను చైతన్యవంతులు చేసి 86 జట్లు క్రీడా పోటీలో పాల్గొనేలా చేయడం అభినందనీయమన్నారు. మండల స్థాయి అసోసియేషన్లు ఏర్పాటు చేసి మంచి పోషకాహారం అందించి, నైపుణ్యంతో కూడిన శిక్షణ వీరికి ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. ఆర్థిక సహాయానికి ఎంపికైన క్రీడాకారులకు అసోసియేషన్ ద్వారా రూ.10 లక్షలు వరకు కార్పస్ ఫండ్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
ఎంతో దోహదపడిన మెగా వైద్య శిబిరం
గిరిగ్రామాల్లో ఏర్పాటు చేసిన సంజీవిని మెగా వైద్య శిబిరం నిరుపేద గిరిజనులకు ఎంత దోహదపడిందని ఎఎస్‌పి తెలిపారు. తోకరాయి గ్రామానికి చెందిన పుణ్యవతి అనే మహిళ నడవలేని స్థితిలో ఉండగా, మెగా వైద్య శిబిరానికి తీసుకొచ్చి అన్ని పరీక్షలు నిర్వహించి, మెరుగైన సేవలు నిమిత్తం మైదాన ప్రాంతానికి రిఫరల్ చేసినట్లు చెప్పారు.










